తప్పు

తప్పు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కాటేగారు పాండురంగ విఠల్

శీను సాఫ్ట్వేర్ ఉద్యోగి. లవ్లీకూడా ఉద్యోగం చేస్తున్నది. పెళ్ళైన ఐదేండ్లకు విష్షు పుట్టింది. ఒక్క సంతానమే చాలనుకున్నారు. పాపకు మూడో సంవత్సరం నడుస్తున్నది. ఇద్దరు ఉద్యోగస్తులు కావున ఉదయమే విష్షును క్రెచ్చులో వదిలిపెట్టి, చెరొక ద్విచక్ర వాహనంమెక్కి ఉద్యోగం చేయడానికి వెళ్లేవారు. ఎవరు ముందొస్తే, వారు పాపను ఇంటికి పిలుచుకొని వచ్చేవారు. శీను ఆ రోజు 5.30కి బయలుదేరి విష్షు దగ్గరికి వచ్చాడు. నిద్రపోతున్న పాపను ఆయా లేపింది. తొందరగా లేవ లేదు. ఆందోళనతో గట్టిగా తట్టి లేపింది. అప్పుడు మూలుగుతూ కళ్ళు తెరిచింది. కళ్ళు ఎర్రగా వున్నవి. ఏడుస్తూ లేవడానికి ప్రయత్నిస్తుంటే, ఆయా ఎత్తుకొని బయటికి తీసుకొని వచ్చి, శీను చేతులకందించింది. ఒళ్ళంతా వేడిగా వుంటే, ఏమైందని అడిగాడు. ఇప్పటి వరకు ఆడుకొని, గంట క్రితమే నిద్రపోయిందని, మీరొస్తే లేపి, తీసుకొచ్చానని చెప్పింది. మనసులో ఆందోళన మొదలుకాగా బైక్ స్టార్ట్ చేసి, ఇంటికి బయలుదేరాడు. శీను దారిలోనే లవ్లీకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. బయలుదేరే హడావిడిలో వున్న ఆమె, ఈ విషయం వినగానే బాస్ దగ్గరికెవెళ్లి, ఆందోళనతో అనుమతి తీసుకొని, స్కూటరెక్కి బయలుదేరింది. శీను ఇంటికెవెళ్లి క్రోసిన్ సిరప్ వేసి ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేశాడు.6.30కి డాక్టరొచ్చి, విష్షు చేతిని పట్టుకొని, స్టేతస్కోపు గుండెపై వుంచి పరీక్షించి, కళ్ళు పైకిలేపి చూసి, ఒక ఇంజెక్షన్ చేసి వెంటనే తన హాస్పిటల్కు తీసుకొని రమ్మన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయాడు. అదేసమయంలో లవ్లీ కూడా వచ్చింది. శీను విష్షును ఎత్తుకొని, భార్యను కూడా రమ్మని, తన బైకు తాళాలుతీసుకొని పోతే, లవ్లీ తాళంవేసి, బెంగతో బైక్ ఎక్కింది. ఏమైందని అడిగితే, విషయమంతా వివరిస్తూ బైకు నడుపుతున్నాడు శీను. డాక్టర్ రెండు మూడు గంటల వరకు ఏవేవో టెస్టులు చేశాడు. రాత్రి 12 గంటలు దాటింది. ఇద్దరు దిగులుగా కూర్చున్నారు. శీను,లవ్లీ తమతమ తల్లి దండ్రులకు విషయం చెప్పారు. దూర ప్రాంతాల్లో వున్న వారు ఈ విషయం విని ఏమి చెయ్యాలో తోచక చింతించసాగారు.
రాత్రి 1.00 గంటకు డాక్టర్ వచ్చి, బ్రైనులో క్లాట్ వున్నదని ఆపరేషన్ చెయ్యాలని చెప్పాడు. డాక్టర్ చకచకా ఏర్పాట్లు చేశాడు. 2.30కు మొదలైన ఆపరేషన్ తెల్లవారుఝామున 5.15కు ముగిసింది. అప్పుడు డాక్టర్ అద్దంలో నుంచి విష్షుని చూపించాడు. విష్షు అచేతనంగా పడివున్నది. లవ్లీ ఏడుపు ఆపలేక పోతున్నాడు శీను. అప్పిటికే ఇరువైపుల పెద్దలు వచ్చారు. ఇంకో సంతానం వుంటే బాగుంటుందని చెప్పినా వినలేదని నానా దుర్భాషలాడుతున్నారు. అప్పుడు విననందుకు పశ్చాత్తాప పడుతున్నారు శీను, లవ్లీలు. లవ్లీ దిగ్గున లేచింది. ఇదంతా పీడకల అని తెలుసుకొనుటకు ఆమెకు ఐదు నిమిషాలు పట్టింది. పక్కనున్న లవ్లీని గుండెలకు హత్తుకుంది. వణుకుతూ భర్తను లేపి, ఈ రోజే డాక్టర్ దగ్గరికి వెళుదామన్నది. మళ్లీ పిల్లలు పుట్టేలా ఆపరేషన్ చేయించుకుందామని చెప్పినది. ఆఫీసులకు సెలవు పెట్టి, ఇద్దరు హాస్పిటల్కు బయలు దేరారు. శీను, లవ్లీ తమ తప్పు తెలుసుకున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!