ధీశాలి

ధీశాలి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

ఊరికి దూరంగా ఉన్న ఒక ఉన్నత పాఠశాలలో హెచ్.ఎం. రూప టీచర్స్ అందరిని సమావేశపరిచి “ఈరోజు డీ.ఈ.ఓ ఆఫీస్ లో మహిళా దినోత్సవం సందర్భంగా మనందరికీ పార్టీ ఉన్నది కలెక్టర్ గారు కూడా అటెండ్ అవుతారు. కనుక మన డిస్టిక్ లో ఉన్న ఇష్టమైన లేడీ టీచర్స్, ప్రధానోపాధ్యాయులు పాల్గొనవలసిందిగా డి. ఇ. ఓ. గారు నోటీసు పంపించారు. మీలో ఇష్టమైన వాళ్ళందరూ నాతోపాటు రావచ్చును”అని చెప్పారు.
ఆ విధంగా డిస్ట్రిక్ట్ లోని చాలా మంది టీచర్స్, ప్రధానోపాధ్యాయులు డి. ఈ. వో ఆఫీస్ లో చాల మంది హాజరయ్యారు. డి. ఈ. ఓ. రమణిగారు అరేంజ్మెంట్స్ గురించి ఆఫీస్ స్టాఫ్ కు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఒక పెద్ద హాలులో అందరికీ సమావేశం ఏర్పాటు చేశారు. అనుకున్న టైమ్ కు కలెక్టర్ దివ్యగారు వచ్చేసారు. సమావేశం మొదలయింది ఎవరెవరో మహిళా దినోత్సవం గురించి ప్రసంగిస్తున్నారు. వచ్చిన వాళ్ళలో సరోజిని అనే టీచర్ మెల్లగా పక్కనున్న ఆవిడతో “కలెక్టర్ అంటే ఎంత పెద్దావిడో అనుకున్నాను. చిన్నమ్మాయే. అంత పెద్ద హోదాలో ఉన్నా ఎంత సింపుల్ గా ఉందో చూడు. అందర్నీ నవ్వుతూ పలకరిస్తోంది. కొందరుంటారు నవ్వితే తమ హోదాకు భంగమని అనుకుంటారు”అన్నది” ఇంతకు మన అందరిని ఎందుకు రమ్మన్నారంటావు” అన్నది మేరి అనే టీచర్. “ఏముంది మహిళా దినోత్సవం కదా. అందరిలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఇంకొక నాలుగు డ్యూటీలు వేస్తారేమో. ఇప్పటికే ఎలక్షన్ డ్యూటీలు, జనాభా లెక్కల డ్యూటీలు, ఎకనామికల్ సర్వేలు, బీసీ సర్వేలు, ఇలాంటివి ఎన్నో డ్యూటీలు చేస్తూనే ఉన్నాము కదా. స్కూల్ లో పాఠాలు చెప్తూ కూడ బయట డ్యూటీలు చేయక తప్పటం లేదు” అన్నది సరోజిని టీచర్. ” మెల్లగా మాట్లాడు సరోజినీ. వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండదు” అన్నది  మేరీటీచర్. “ఏమాటకామాటే చెప్పుకోవాలి మన రమణి మేడం డి. ఇ. ఓ. గా వచ్చిన తర్వాత చాలా ఎక్స్ట్రా డ్యూటీ లు  చాల వరకు తగ్గిపోయాయి మనకు” అన్నది సరోజిని. ఇంతలోకే డీ.ఈ.ఓ ఆఫీస్ లో అటెండర్గా పనిచేసే చందు అతని భార్య సునీత వాటర్ బాటిల్స్ టేబుల్స్పైన పెట్టి వెళ్లారు. డి.ఈ. ఓ. రమణి గారు లేచి మహిళల ఔన్నత్యం గురించి చెప్పడం మొదలు పెట్టారు. తర్వాత కలెక్టర్ గారిని మాట్లాడమన్నారు.
దివ్య లేచి “మహిళలందరూ ఆత్మవిశ్వాసంతో మెలగ వలెనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవం కోల్పోకూడదని, అందరి జీవితాలు వడ్డించిన విస్తర్లు కావని, ఎప్పటికప్పుడు కష్టాలను దాటుకుంటూ ఉన్నత శిఖరాలు చేరుకోవడమే జీవితమని, ఒక్కొక్కసారి జీవితంలో ఆత్మీయులనందరిని కోల్పోయి, ఆస్తులన్నింటిని కోల్పోయి, ఏం చేయాలో తెలియక, సుడిగుండాల విష వలయంలో చిక్కుకొని, ఎక్కడికి వెళ్లాలో తెలియక, చీకటి కుహరంలో కూరుకుపోయే పరిస్థితులు ఎదురవుతాయి. అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా తమ బాధ్యతలను చక్కగ నెరవేరుస్తూ ముందడుగు వేస్తూ విజయ శిఖరాలు చేరుకోవాలి” అన్నది . “ఈరోజు నేను కలెక్టర్ గా కాకుండా ఒక మహిళగా మీ ముందు నిలుచున్నాను. మహిళలు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, వెనుకంజ వేయకుండా ధైర్యంగా ఉండాలి. మీకు అఫీషియల్గా గాని, పర్సనల్గా కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నా సహాయం అవసరం అనిపిస్తే నాకు తెలపండి. సాధ్యమైనంతవరకు వాటిని తొలగించడానికి నేను ప్రయత్నిస్తాను” అన్నది దివ్య. ఒక మహిళ లేచి “మేడం మీది వడ్డించిన విస్తరిలాంటి జీవితం కనుక ఎన్ని ఉపన్యాసాలైన ఇస్తారు. మా కష్టాలు మీరు ఊహించలేరు. సహాయమౌసరమైనపుడు ఎవ్వరు ఆదుకోరు” అన్నది. “లేదమ్మా నా జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. నేను మా అమ్మ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాము” అన్నది దివ్య. “మేడం మీరు మమ్మల్ని మభ్య పెట్టడానికి అలా మాట్లాడుతున్నారు. మీకు మా కష్టాలు ఎక్కడ అర్థమవుతాయి. మాలాగ కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళెవరు కలెక్టర్ కాలేరు” అన్నది మొండిగా.
“అయితే వినండి నా కథ చెప్తాను. మా అమ్మ ఒక పెద్ద శ్రీమంతుడు ఇంట్లో పుట్టిన ఏకైక సంతానం. అది తెలిసి ఆమె ఇంటర్లో ఉన్నప్పటినుండే ఆ వీధిలోనే ఉండే చంద్రశేఖర్ అనే అతను ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం మొదలు పెట్టాడు. ఆమె పట్టించుకోకపోయినా పట్టు విడవకుండా  డిగ్రీ పూర్తయ్యే వరకు కూడా ఆమెను వెంబడించాడు. చివరికి అతని ప్రేమ పై నమ్మకం కుదిరిన మా అమ్మ మా అమ్మమ్మా తాతయ్యలకు ఆ అబ్బాయి గురించి చెప్పి, అతనిని పెండ్లి చేసుకుంటానని చెప్పింది.
కానీ వాళ్ళు, చదువు సంధ్యలు లేకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతున్న అతనికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు. అయినా మా అమ్మ అతనిని పూర్తిగా నమ్మి అతని సలహాపై గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు వచ్చింది. ఒక్కగానొక్క కూతురు అంత తెలివి తక్కువగా  వెనక ముందు ఆలోచించకుండ, ఒక బాధ్యత లేకుండ అల్లరి చిల్లరగా తిరిగే అతనిని చేసుకుని తన జీవితాన్ని కష్టాల పాలు చేసుకున్నదని ఎంతో బాధ పడ్డారు. అయినా కూతురును వదులుకోలేక అతనిని అల్లునిగా అంగీకరించక తప్పలేదు. పెళ్లి అయినా కొన్ని రోజులు మంచిగా ఉన్నట్టు నటించి మెల్లమెల్లగా అతను తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన సాగాడు. పట్టపగలే బాగా తాగి వచ్చి అల్లరి చేయడం, డబ్బులిమ్మని మా అమ్మని వేధించడం చీటికిమాటికి కొట్టడం చేసేవాడు. ఆ బాధలన్నీ చూడలేక ఉన్న ఆస్తులన్నీ ఒక్కొక్కటి అమ్మి అతనికివ్వ సాగారు మా అమ్మమ్మ తాతయ్య. అయినా అతనికి తృప్తి కలగలేదు. చివరికి ఏం చేయాలో తెలియని మా అమ్మమ్మ, తాతయ్యలు మా అమ్మ పడే కష్టాలు చూడలేక ఉన్న ఒక ఇంటిని అనాధ ఆశ్రమానికి రాసిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లు చనిపోయిన కొన్ని రోజులకే అనాధాశ్రమం వాళ్లు వచ్చి ఇంటిని ఖాళీ చేయించారు. ఒక చిన్న రూమ్ తీసుకుని అక్కడ కాపురం పెట్టారు మా అమ్మ వాళ్ళు. కొన్ని రోజులకు  అతను ఒక ఆవిడని ఇంటికి తీసుకొచ్చి, “ఈమె నా భార్య నీ కంటే ముందే ఆవిడతో పెళ్లి అయింది నాకు. నీ ఆస్తి కొరకే నీతో పెళ్లి నాటకం ఆడాను. ఇప్పుడు నాకు నీ అవసరం లేదు. నీ ఇష్టం వచ్చిన దగ్గరకెళ్లి బ్రతుకు. నా భార్యకు నీతో కలసుండడం ఇష్టంలేదు” అని వెళ్లగొట్టాడు. అప్పటికే చంటిపిల్లగా ఉన్నా నన్ను తీసుకుని మళ్లీ అనాధాశ్రమంకి వెళ్లి, అక్కడే చిన్న చిన్న పనులు చేస్తూ, ట్యూషన్స్ చెప్పుకుంటూ నన్ను పోషించడమే కాక, తాను టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించుకున్నది. తన జీతం చాలా పొదుపుగా వాడుతూ నా చదువుకు, భవిష్యత్తుకు నా ట్యూషన్స్ కు వాడడం మొదలు పెట్టింది. ఆ విధంగా పొదుపుగా ఖర్చు చేస్తూ నాకు ఒక ధ్యేయాన్ని కలిగే లాగా చిన్నప్పటి నుండి నూరి పోయడం వల్ల, నేను కూడ మా అమ్మ కష్టమెరిగి, కష్టపడి చదివాను. మా అమ్మ కోరిక మేరకు కలెక్టర్ను కాగలిగాను. మా అమ్మ అంచెలంచెలుగా ఎదుగుతూ డి. ఈ. ఓ. గా ఈ ఆఫీసు లోనే పనిచేస్తున్నారు. ఆమె ఎవరో కాదు డీ.ఈ.వో. రమణి గారు. తన ఆస్తి కొరకే  చంద్రశేఖర్ వెంబడించి అప్పటికే పెళ్లయి పోయినా కూడా  ప్రేమించానని కల్లబొల్లి కబుర్లు చెప్పి, మోసగించి పెళ్లి చేసుకుని, మంచి ఉద్యోగం ఉన్నదని అబద్దం చెప్పి మోసగించడం వల్ల ఆ బాధతోనె మా అమ్మమ్మా తాతయ్యలు మరణించారు. తనకెవరు లేకపోయినా చంద్రశేఖర్ వద్దనే అభిమానమును చంపుకొని పడి ఉండకుండా ఆత్మాభిమానంతో బయటకు వచ్చి, ఎవరి సహాయం లేకపోయినా, ఏ ఆధారాలు లేకపోయినా, తన రెక్కల కష్టంతో నాకు ఏ లోటు రాకుండా పెంచి, కంటికి రెప్పలా కాపాడి మంచి ఉన్నత విద్య  చెప్పించి కలెక్టర్గా చేయగలిగింది. ఒంటరి మహిళ అయిన నన్నింతటి దానిని చేయగలిగిందంటే ఆత్మ విశ్వాసమే కారణం.  మా అమ్మ ఎవరో కాదు. ఈ ఆఫీసులో డి. ఈ. ఓ గా పనిచేస్తున్న రమణి గారు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ మూలన అందరికీ నీళ్ల బాటిల్స్ అందిస్తున్న ఆ చందుయే మా అమ్మ జీవితం ఇలా అయిపోవడానికి కారణభూతుడు” అని తన కథను ముగించింది కలెక్టర్ దివ్య. అక్కడ సమావేశమైన అందరితో పాటు చందు అనబడే ఆ చంద్రశేఖర్ కూడా ఆ మాటలు విని సిగ్గుతో తలవంచుకుని ముళ్ళలాంటి అందరి చూపులను తప్పించుకుంటూ భార్యతోబాటు బయటకు వెళ్ళిపోయాడు. అందరూ డి. ఈ.వో. దగ్గరికి వచ్చి “మేడం మీరు ఎప్పుడూ చెప్పలేదు మీ అమ్మాయి కలెక్టర్ అని” అని అడగడం మొదలు పెట్టారు.”అవును ఆ కలెక్టర్ నా కూతురే” అని ధీమాగా చెప్పి ముందుకు అడుగేసింది రమణి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!