ధైర్యే సాహసే దుర్గ

ధైర్యే సాహసే దుర్గ

రచన :శ్రీదేవి విన్నకోట

ఆ రాత్రి పూట రోడ్డు కి ఓ మూలగా ఉన్న అండర్ గ్రౌండ్ లో నవ్య చాలా కంగారుగా పరిగెడుతుంది. వెనకాల ముగ్గురు పోకిరీ యువకులు ఆబగా  ఆశగా తనని అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వారికి దొరక్కుండా ఇంకా త్వరగా పరుగు పెట్టడానికి తన శక్తి సరిపోవడం లేదు. తనకి ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా దారిలో ఉన్న సిమెంట్చెప్టా తగిలి నేల మీద బోర్లా పడిపోయింది.

ఇక ఆ రాక్షసుల చేతిలో తన జీవితం ముగిసినట్టే అనుకుంటూ తాను ఈ ఆపాయం లో ఎలా పడిందో తలుచుకుంటూ భయంగా కళ్ళు మూసుకుంది.
నవ్య ఓ మధ్య తరగతి అమ్మాయి. తండ్రి చిన్న కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి గృహిణి. ఇంట్లోనే ఉంటుంది. తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పిల్లల్ని పెద్ద చదువులు చదివించడం వారికి భారం  అయినా చదువుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశతో ప్రభుత్వం నుంచి కూడా చదువుకు తగిన ప్రోత్సాహం అందిస్తూ ఉండడంతో పిల్లలిద్దరినీ  చక్కగా చదివిస్తున్నారు.

నవ్య అక్కడే లోకల్ గా ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. తను చాలా భయస్తురాలు,బెరుకు ఎక్కువ, ఆ రోజు ఎప్పటి లాగానే సైకిల్ పై కాలేజీకి వెళ్ళింది. తన ప్రాణ స్నేహితురాలు సుధ చెల్లెలి పుట్టిన రోజు కావడంతో సాయంత్రం వాళ్ళ ఇంట్లో  కేక్ కటింగ్. పుట్టినరోజు వేడుక ఉండడంతో సుధ నవ్యనీ తన  ఇంటికి రమ్మని బలవంతం చేసింది.నవ్య కి ఇష్టం లేకపోయినా సుధ నవ్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆంటీ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది నవ్యని తీసుకు వెళ్తున్నాను. కొంచెం లేటుగా వస్తుంది అని చెప్పింది. నవ్య వాళ్ళ అమ్మ పద్మ  సుధ బాగా తెలిసిన అమ్మాయి కావడంతో సరే అంది.నవ్య సుధ వాళ్ళ ఇంటికి వెళ్లింది.

పుట్టిన రోజు వేడుక ముగిశాక  కేక్ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ స్నేహితురాళ్ళు అందరూ  కలసి సరదాగా కబుర్లలో పడి టైం చూసుకోపోవడంతో చీకటి పడిపోయింది. అక్కడికి సుధ తనను స్కూటీ మీద డ్రాప్ చేస్తాను అంది.కానీ తనకి సైకిల్ వుండడంతో పర్వాలేదు ఇప్పుడు సమయం ఎనిమిదేగా అయ్యింది. నేను వెళ్లి పోగలను అయినా ఇంట్లో అందరూ ఉన్నారు కదా నీకు పని ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు అని సుధ కీ చెప్పి  తను వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరింది. మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తే ఎక్కువ టైం పడుతుంది అని  ఇదిగో ఇలా అండర్ గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటే అండర్ గ్రౌండ్ బయట గట్టుమీద కూర్చున్నారా ముగ్గురు పోకిరి వెదవలు వస్తున్న తనని వంకరగా చూస్తూనే ఉన్నారు.

అండర్ గ్రౌండ్ లోపలికి సైకిల్ తీసుకురావడానికి తనకు కొంచం ఇబ్బంది అయింది. ఇనుప కమ్మిలు అడ్డుగా ఉండడంతో తను అక్కడ ఆగి సైకిల్ లోపలకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే  ఇంతలో వాళ్ళ ముగ్గురు నుంచి ఒకడు తన వెనక సైకిల్ సీట్ పట్టుకుని వెనక్కి గుంజాడు. మరొకడు ఏం పిల్ల ఏమైనా సాయం కావాలా చేయమంటావా అంటూ వచ్చాడు.తనకి విపరీతమైన భయం వేసింది. ఇక సైకిల్ అక్కడే వదిలేసి  వాళ్లకి అందకుండా ఒక్క ఉదుటున పరుగు అందుకుంది. కానీ వాళ్లు తరుముతున్న కంగారులో దారిలో ఉన్న సిమెంట్ చెప్టాకు చూసుకోకుండా తగిలి ఇలా  పడిపోయింది.

ఆమె కళ్ళ నుంచి నీళ్ళు ధారగా ప్రవహిస్తున్నాయి. భయంతో వణికి పోతుంది.కాలికి గట్టిగా రాయి తగలడంతో లేవలేక పోయింది. వాళ్లు తనకీ బాగా దగ్గరిగా వచ్చేశారు. పిల్ల కాకినాడ కాజాలా బలే ఉందిరా అని ఒక్కడు అంటే మరొకడు లేదురా బందర్ లడ్డు లా ఉంది అంటూ ఆమె వైపు అడుగులు వేస్తున్నారు ముగ్గురు పోకిరీలు.ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావడంతో నవ్య లో చిరు ఆశ. వాళ్ళు అటు వైపు తలతిప్పి చూశారు.దూరంగా దుర్గ  నేల మీద పాకుతూ వస్తూ కనిపించింది.

తనకి చిన్నప్పుడే పోలియో సోకడంతో ఒక కాలు పూర్తిగా పని చేయదు. తాను అండర్ గ్రౌండ్ బయట కిష్టన్న కొట్లో కూర్చుని సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతూ ఉంటుంది. 30 ఏళ్ళు ఉంటాయి కాళ్లు పని చేయవన్న మాటే గాని మనిషి దృఢంగా ఉంటుంది. బాగా గుండె ధైర్యం గల మనిషి. నేల మీద పడి ఉన్నఆ పిల్లని ఆ పిల్ల చుట్టూరా ఆంబోతుల్లా నుంచున్న వాళ్ళని చూడగానే దుర్గ కి విషయం అర్థమైంది.ఎం చేస్తున్నారురా మీరు ఇక్కడ అంటూ వాళ్లకి దగ్గరగా వచ్చింది.నీకెందుకే  నీ— కుంటి. పో నువ్వు పోయి పని చూసుకో అన్నాడు ముగ్గురులో నుంచి ఒకడు.నవ్య దుర్గ ని చూడగానే ఏడుపు అందుకుంది ప్లీజ్ నన్ను కాపాడు అక్క నాకు చాలా భయమేస్తుంది అంటూ.

ఛత్ అపెహే ని ఎదవ గోల అంటూ నవ్య ని గదమాయించింది.ఏందన్నా ఇది పాపం సదువుకునే పిల్ల  వదిలేయండి అన్నా అంటూ వాళ్లకు చిన్నగా నచ్చచెప్తు ప్రాధేయపడసాగింది.నువ్వు మాకు సొల్లు చెప్పకు పో అవతలికి అంటూ దుర్గనీ కాళ్లతో ఒక తన్ను తన్నాడు అందులో ఒకడు. ఇక  ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది దుర్గ.

ఇంతలో పెద్దగా ఏడవసాగింది నవ్య. అలా ఏడుస్తున్న నవ్య వంక  దుర్గ కోపంగా చూస్తూ నీకు
ఏ అవకరం లేకుండా అన్ని అవయవాలు సవ్యంగానే ఉన్నాయిగా కనీసం ఎదిరించడానికి అయినా ప్రయత్నించకుండా అలా బోరుమని ఏడుస్తూ ఉంటావా.  నీలాంటి పిరికి వాళ్ళు బతికి ఉండటం కంటే చచ్చిపోవడమే నయంలే.కానీ ఇలాఎందుకు పనికి రాని చావు చస్తున్నందుకు మాత్రం నిజంగానే ఏడువు అంటూ ఈసడింపుగా మాట్లాడింది.

ఇంతలో వాళ్లలో ఒకడు నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులు ఇక చాలు కానీ ఇంక బయలుదేరు ఇక్కడి నుంచి అనడంతో ఇక చేసేదేమీలేక తను అక్కడే కొద్ది దూరంలో చిన్న సందులా ఉండిఒక మూలగా నాలుగు పక్కల ఓ పెద్ద బరకాన్ని  డేరాల కట్టి అక్కడే పడుకుంటుంది ప్రతిరోజు. తనకు ఇల్లు వాకిలి లేవు ఇంటికి అద్దె కట్టేంత సంపాదన లేకపోవడంతో అక్కడే  అలా ఉంటూ రోజులు  గడిపేస్తుంది. తనకి తోడుగా  రాత్రులు గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్మే సన్యాసి తాత వచ్చి రోజు పడుకుంటాడు.

దుర్గ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. గబగబా తనుండే డేరా లోకి వెళ్ళింది. చెవుల్లో ఆ పిల్ల ఏడుపే గింగురు మంటూ వినిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి. లేకపోతే ఆ పిల్ల బ్రతుకు ఆగమై పోతుంది. అనుకుంటూ ఎర్రటి పచ్చికారం డబ్బా చేతిలోకి తీసుకుంది. కుక్కలు ఏమైనా వచ్చినప్పుడు ఆ కుక్కల్ని కొట్టడానికి పెట్టిన పెద్ద వెదురు కర్ర చేతిలోకి తీసుకుంది. మళ్లీ గబగబా నవ్య వాళ్ళు ఉన్నచోటికి పాక్కుంటూ వచ్చింది.

అక్కడ  నవ్య పరిస్థితి చాలా హృదయవిదారకంగా ఉంది. ఒంటిమీద బట్టలు పూర్తిగా చిరిగి పోయాయి.రేయ్ పోరంబోకు వెధవల్లారా ఆ పిల్ల ని వదలమని చెప్తుంటే మీకు అర్థం కాదేంట్ర  సచ్చినోళ్ళరా అంటూ గట్టిగా అరవడంతో ఇది మళ్ళీ వచ్చింది ఏంటి అంటూ ఒకడు దుర్గనీ కొట్టడానికి ముందుకు వచ్చాడు. వస్తున్న వాడికి తన చేతిలో ఉన్న వెదురు కర్ర కాళ్ళకి అడ్డుగా  పెట్టడంతో వాడు బొక్క బోర్లా పడిపోయాడు. వెంటనే తన చేతిలో ఉన్న కారం డబ్బా మూత తీసి వాడి కళ్ళల్లో కారం చిమ్మేసింది.కూర్చున్న చోటు నుంచే వెదురు కర్రతో వాడి వంటి మీద గట్టిగా ఇష్టం వచ్చినట్టు పొడవసాగింది.

ఇది చూసి రెండవ వాడు కూడా పరిగెత్తుకుంటూ దుర్గ దగ్గరికి రాబోయాడు. చాలా త్వరగా వాడి కంట్లో కూడా కారం విసరడంతో వాడు అమ్మో అంటూ మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటూ అక్కడే నిలబడి పోయాడు. దుర్గ వాడికి మరింత దగ్గరగా జరుగుతూ కూర్చునే కర్రతో వాణ్ని కొట్టసాగింది.ఇక నవ్య దగ్గర ఉన్న ఒక్కడికి చాలా కోపం వచ్చేసింది. ఒసేయ్  రాక్షసి ఏం చేస్తున్నావే నువ్వు అంటూ రై మంటూ ఆమె దగ్గరికి దూసుకొచ్చాడు. ఒక చేత్తో ఆమె జుట్టు పట్టుకుని మరో చేత్తో ఆమె చెంపలు వాయించేసాడు. దుర్గ బాధని అనుభవిస్తూనే ఓయ్ పిల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపో త్వరగా వెళ్ళు అని గట్టిగా అరవడంతో నవ్య కాస్త సృహ లోకి వచ్చింది ఏడుపు ఆపి నెమ్మదిగా లేచి వింటి నుంచి విడిచిన బాణంలా అండర్ గ్రౌండ్ బయటికి దూసుకుపోయింది.

కింద పడిన వాడు దుర్గ కర్రతో పొడిచిన పోట్లకు పైకి లేవలేక పోయాడు. మరొకడు కళ్ళు తెరవలేక నవ్య ని ఆపలేక పోయాడు. మూడో వాడు మాత్రం దుర్గను ఆపకుండా కొడుతూనే ఉన్నాడు. ఫోనిలే అది పోతే పోయింది నువ్వు ఉన్నావుగా నీ సంగతి చూస్తాం అంటూ  వాగుతూ ఉండగానే దుర్గ కి  కొంచెం అవకాశం చిక్కడంతో వాడి మీద కూడా కారం మొత్తం డబ్బా తో సహా పోసేసింది.వాడు రెండు కళ్ళు పట్టుకుని నిలుచున్న చోటే కూలబడిపోయాడు.ఇక దుర్గ అసలు ఎలా కొడుతుందో తెలియకుండా పిచ్చిగా కర్రతో అందిన వాణ్ని అందినట్టు కొడుతూనే ఉంది.ఒరేయ్ చెత్త వెధవల్లారా ఆడది ఒంటరిగాకనిపిస్తే చాలు  పశువుల్లా తయారవుతారురా మీరు అంటూ తన శక్తికి మించిన పని అయినా సరే పిచ్చి కోపంతో వాళ్ళని కొడుతూనే ఉంది. జుట్టు మొత్తం విడిపోయి మొఖం అంత ఎర్రగా అయిపోయి పెదవులు చిట్లి రక్తం కారుతూ అపర కాళిక లా ఉంది దుర్గ.తన మొహం చూస్తేనే భయంకరంగా అనిపించింది వాళ్ల ముగ్గురికి.

ఇంతలో అండర్ గ్రౌండ్ బయటికి వెళ్ళిన నవ్య అక్కడికి కొంచెం దూరంలో ఉన్న ట్రాఫిక్ ఎస్ ఐ కి ఏడుస్తూ విషయం చెప్పడంతో   అతను ఆమెని అక్కడే ఉండమని చెప్పి పరుగు పరుగున అండర్ గ్రౌండ్ లోపలికి వచ్చాడు. అప్పటికే దుర్గ పిచ్చిదానిలా ఊగిపోతోంది. అసలు లేవలేకపోయినా ఉన్న చోట కూర్చునే వాళ్ల పాలిట శక్తి లా మారి వాళ్ళ అంతు చూస్తుంది. ఇంతలో అక్కడికి ట్రాఫిక్ ఎస్ ఐ పరుగెత్తుకు వచ్చాడు.దుర్గ ని  ఆమె వాలకంచూస్తే అతనికి కూడా భయంగానే అనిపించింది. కానీ ఆమె ధైర్యానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని మానాన్ని పణంగా పెట్టిన దుర్గ నీ చూస్తే తమకోసం తాము ఆలోచించుకొని ఇంతటి నిస్వార్ధమైన ఆడవాళ్లు కూడా ఉంటారా ఈ భూమ్మీద  అనుకుంటూ ఆమెకు రెండు చేతులు ఎత్తి నమస్కారం  చేయాలనిపించింది అతనికి.

టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఈ పోకిరి వెధవల్ని తీసుకువెళ్లడానికి పోలీసుల్ని రమ్మని చెప్పాడు.వాళ్లు మరి లేవకుండా అతను కూడా మరో నాలుగు గట్టిగా తగిలించాడు. మెల్లిగా ఆమె చేత కాసిని మంచినీళ్లు తెచ్చి తాగించాడు.నిజంగా మీ ధైర్యం చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీకు హ్యాట్సాఫ్ అండి.ఆడవాళ్లు అందరూ మీలాగా ధైర్యంగా  ప్రమాదానికి ఎదురు నిలిచి ఇలా సాహసంగా పోరాడితే ఆ ప్రమాదం
కూడా మిమ్మల్ని చూసి భయంతో తోకముడిచి పారిపోతుంది. ఇలాంటి వెధవలు ఆడవాళ్ళ జోలికి రావడానికే భయపడతారుఅంటూ ఆమె మెచ్చుకున్నాడు ఎస్ ఐ.అతని మాటలకి దుర్గ చిన్నగా నవ్వింది. అంత బాధలో కూడా ఒక పచ్చని చెట్టు లాంటి ఆడపిల్ల బ్రతుకుని నాశనం కాకుండా కాపాడగలిగాను అనే విజయగర్వం ఆనందం ఆమె కళ్ళల్లో తొంగిచూశాయి.

ఈ సంఘటన మా జిల్లాలో నిజంగానే జరిగింది.ఆ ఘటన చుట్టూ కొంచెం కథ అల్లి పేర్లు మార్చి రాసాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!