దరికిచేరని ప్రేమ

దరికిచేరని ప్రేమ

రచన: వాడపర్తి వెంకటరమణ

జీవితం చాలా విచిత్రమైనది.

కొన్నిసార్లు మనసులో గూడుకట్టుకున్న మాటలు చెప్పాల్సిన సమయంలో పెదవిదాటిరాకపోతే,ఆ చేసిన చిన్న తప్పుకు గుండెను గాయంచేసి జీవితాంతం సలపరం కలిగేలా పెద్ద శిక్ష వేస్తుంది జీవితం.

“సుజీ గారు…సుజీ గారు…” ఎవరో తననే పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసింది సుజాత.

కాస్త దూరంగా తనవైపే వస్తూ కనిపించాడతను.దగ్గరగా వచ్చాక గుర్తుపట్టింది అతన్ని.అతను తన కాలేజ్ మేట్ రామకృష్ణ.తన ప్రాణ స్నేహితుడు కూడానూ.

చాలా రోజుల తర్వాత ఇలా రోడ్డుపై రామకృష్ణ కనిపించేసరికి ఆశ్చర్యపోయింది సుజాత.ఒక్కసారి ఇది కలా లేక నిజమా అనిపించి…అది కల కాదు నిజమే అని తెలిసాక ఆ ఆనందంలో అతని వైపే చూస్తూ ఉండిపోయింది.

“ఏవండోయ్ సుజాత గారు…ఏంటలా ఉండిపోతారు!”

“అనుకోకుండా నిన్ను చూసిన ఆనందంలో మాటలు రాక…అయినా కొత్తగా నువ్వుకు బదులుగా మీరు తగిలించావేంటి!”

“చాలా రోజులయ్యింది కదా నిన్ను చూసి, దూరం నుంచి చూసి నిన్ను గుర్తుపట్టక…!’

రామకృష్ణ వైపు తేరిపారా చూసింది సుజాత.అప్పటికీ ఇప్పటికీ కొంచెం బట్టతలొచ్చి అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి.అప్పటి చలాకీతనం కనిపించలేదు అతని మొహంలో.సంసార జంజాటంలో పడితే ఇంకా ఆనాటి చలాకీతనం ఎలా ఉంటుంది అనుకుంది.వారి సంసారం బాగుండాలని మనసులోనే కోరుకుంది సుజాత.

“ఏంటీ మీరు ఈ ఊరిలోనే ఉంటున్నారా…?ఎప్పడూ కనపడలేదే…?” ప్రశ్నార్థకంగా అడిగాడు రామకృష్ణ.

“అవును కృష్ణా… కానీ నేను పెద్దగా బయటకు రాను.నాలుగు రోజులుగా కూరగాయల వాడు వీధిలోకి రాకపోయేసరికి ఇదిగో ఇలా పొద్దున్నే మార్కెట్టుకు రావాల్సొచ్చింది!” సమాధానంగా చెప్పింది సుజాత.

“సరే పద…కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం” ఎదురుగా ఉన్న హోటల్లోకి దారితీస్తూ ఆహ్వానించాడు రామకృష్ణ.

అతని ఆహ్వానానికి ముందు కాస్త తటపటాయించినా, చాలా కాలానికి కలిసిన అతని మాట కాదనలేకపోయింది సుజాత.

****

కాలేజీలో ఏ పోటీ జరిగినా మొదటి రెండు స్థానాల్లో రామకృష్ణ, సుజాత పేర్లే ఉండేవి.

ఆ రకంగా వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది.ఆమె కలుపుగోలుతనం,అతని చలాకీతనం కలగలిపి రానురానూ ఇద్దరికీ స్నేహం కుదిరింది.కొంతకాలానికి ఆ స్నేహం చిగురించి ప్రేమ మొగ్గలు తొడిగింది.ఆ మొగ్గలు ఇప్పుడు విచ్చుకుని ప్రేమ పుష్పాలుగా వికసించాయి.పూర్తిగా ప్రేమ మైకంలో పడిపోయారు.ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు వారు.

ఆ రోజు కాలేజీ ఫేర్ వెల్ డే సంబరాలు ఆడిటోరియంలో మిన్నంటాయి.

వీడ్కోలు సందర్భంగా కండక్ట్ చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో స్టూడెంట్స్ అంతా హుషారుగా పాల్గొన్నారు.ఎప్పటిలానే డ్యూయట్ కేటగిరీలో రామకృష్ణ, సుజాతలిద్దరూ ఒక అందమైన ప్రేమ గీతానికి తమ చక్కని అభినయాన్ని ప్రదర్శించి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు.వారి పెర్ఫార్మెన్స్ కి చప్పట్ల మోతతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.రామకృష్ణ, సుజాతల మొహాలు పున్నమి చంద్రుడిలా వెలిగిపోయాయి.

సాయంత్రమయ్యింది.

ఇన్నాళ్లూ తమతో మెలిగి, కష్టసుఖాల్లో పాలుపంచుకున్న సహచర మిత్రులకు వీడ్కోలు పలికుతూ ఎవరి స్వస్థలాలకు వారు బయలుదేరుతున్నారు స్టూడెంట్స్.

రామకృష్ణ, సుజాతలకు తమ హృదయ స్పందన వేగం తెలుస్తూనేవుంది.’నిన్ను ప్రేమిస్తున్నాను’ అన్న మాట కోసం ఆ రెండు మనసులు ఎదురుచూసాయి.

కొన్ని నిమిషాలు కరిగిపోయాయి.

ఒకరికి ఒకరు వీడ్కోలు చెప్పుకుని భారమైన హృదయాలతో వెనుదిరిగారు రామకృష్ణ, సుజాతలు.చిత్రంగా ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే ప్రేమ పలుకు ఆ మనసులు దాటి రాలేదెందుకో…!?

బేరర్ తీసుకొచ్చిన కాఫీ కప్పుల శబ్ధానికి ప్రస్తుత పరిస్థితికి వచ్చాడు రామకృష్ణ.

కాఫీ చిప్ చేస్తున్న సుజాత వంక చూశాడు రామకృష్ణ.

కాలేజీలో బ్యూటీ క్వీన్ గా పిలవబడే ఆమిప్పుడు నెరిసిన జుట్టుతో,కళ్ళ క్రింద ఏర్పడిన నల్లటి చారికలతో చూడ్డానికి ఆమె వయసుకంటే పెద్దగా కనిపిస్తోంది.బహశా సంసార చట్రంలో ఇరుక్కుంటే అంతేనేమో అనుకున్నాడు.పోనీలే తనైనా పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవున్ని కోరుకున్నాడు రామకృష్ణ.

“నేనిక వెళ్ళొస్తాను కృష్ణా…” లేచి నిలుచుంది సుజాత.వీడ్కోలు పలికాడు రామకృష్ణ.

విచిత్రమేమిటంటే… ఇద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడి,తమ ప్రేమను ఒకరితో ఒకరు పంచుకోని తప్పిదానికి శిక్షగా సుజాత, రామకృష్ణలు ఇంకా అవివాహితులుగానే మిగిలిపోయారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!