అంతర్జాల మాయ

అంతర్జాల మాయ

రచన::మోదేపల్లి. శీనమ్మ

నాయనా శీను, ఒకసారి మీ లక్ష్మక్కకు ఫోన్ చేసి ఇయ్యరా…మాట్లాడాలి అంటూ వచ్చింది సుబ్బమ్మ.
ఇందాకే కదా పెద్దమ్మ అక్కతో మాట్లాడావు గంట కూడా అయిందో
లేదో…ఏమైంది అని అడిగాడు శీను.
ఏమి లేదులేరా అక్కతో మాట్లాడాలి అంటుండగానే…ఇదిగో
అక్క ఫోన్ లైనులో ఉంది మాట్లాడు అన్నాడు శీను.
అమ్మా లక్ష్మీ…అంది సుబ్బమ్మ.
ఆ…ఏంటమ్మా…మళ్ళీ ఫోన్ చేసావు అని అడిగింది లక్ష్మీ.
ఏమి లేదమ్మా…నువ్వు పని చేసుకుంటూ…ఆ ఫోన్ ఎక్కడ పెడుతున్నావో ….ఏంటోనని… చేశానమ్మ.
ఫోన్ ఇంట్లోనే దగ్గర ఉంటుంది కదమ్మా…ఎక్కడో ఎందుకు పెడతాను.
సరే అమ్మా జాగ్రత్త అయితే ఫోను .ఉంటానమ్మా…ఆ…అదే…
పిల్లలు బొమ్మలు అవి చూసుకోవడానికి బయటకు తీసుకెళ్తారేమో జాగ్రత్తమ్మా…అనగానే..
ఫోన్ తో ఇంట్లోనే ఆడుకుంటారు లేమ్మా పిల్లలు, అయినా ఎప్పుడు లేనిది ఈ రోజు ప్రత్యేకంగా ఫోన్ జాగ్రత్త అని చెప్తున్నావేంటమ్మా నువ్వు అంటూ , సరేమ్మా,నాకు మీ అల్లుడు ఫోన్ చేస్తున్నాడు తర్వాత చేస్తాను అని పెట్టేస్తుంది లక్ష్మి.
అదంతా వింటున్న.. సుబ్బమ్మ మరిది కొడుకు శీనుకు అర్ధం కాక,
అవును పెద్దమ్మా… నవ్వేoటి…ఎప్పుడైనా అక్క జాగ్రత్త అని, పిల్లలు జాగ్రత్త అని ,ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తావు. ఇవాళేoటి కొత్తగా…ఫోన్ జాగ్రత్త అని ఇన్నిసార్లు చెప్తున్నావు అని అడిగాడు.
ఏమి లేదు నాయనా…మీ అక్క మొన్న డబ్బులు కావాలని ఫోన్ చేసింది కదా…నాకు డబ్బులు ఇవ్వవలసిన సుబ్బారావు లెక్క చూసి మొత్తం 45 000 ల రూపాయలు వరకు ఇవ్వాలి అని చెప్పి, నాకు ఇవ్వకుండా అక్కకు పంపాలి అనేసరికి అక్కకు ఫోన్ చేసి అక్క ఫోన్లో వేసాను అన్నాడు.
అది అప్పుడేమో వచ్చాయి అని చెప్పింది. ఇక్కడి నుండి అక్క వాళ్ళ ఊరికి డబ్బులు పోవడం ఏంటో… ఏమోనని,
మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తే మీ బావ ఊరి నుండి రాగానే
వాడుకుంటాము అని చెప్పింది.ఒకసారి చూడమ్మా ఉన్నాయో లేవో అంటే …
అబ్బా…ఉన్నాయిలేమ్మా…అని విసుక్కుంటుంది.
అసలు అన్ని డబ్బులు కంటికి కనపడకుండానే ఆ సుబ్బారావు పంపడం ఏంటో…. మీ అక్క అసలే అమాయకురాలు ఉన్నాయి
అంటుంది. అన్ని డబ్బులు అజ్ ఫోన్ ఎలా పట్టాయో…ఏమో…అవి
ఎవరైనా తీసుకుంటారేమోనని
ఇందాక ఫోన్ చేస్తే అలానే ఉన్నాయి అని చెప్పింది. అది అసలే ….ఇక్కడ వస్తువు పెట్టి మర్చిపోయి ఎక్కడో వెతుక్కుంటూ ఉంటుంది. మీ బావ
వచ్చేలోగా…ఆ ఫోన్ ఎక్కడ పెడుతుందో…ఆ డబ్బులు పుసుక్కున ఎవరు తీసుకుంటారో నని నేను తెలివిగా అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నా శీను, జాగ్రత్త గా ఉంటుందని అని చెప్తుంది సుబ్బమ్మ.
అబ్బో…పెద్దమ్మ…నీ తెలివి బ్రహ్మాండంగా ఉంది కానీ, అది ఏమి పర్సో, కవరో కాదు డబ్బులు
ఎవరైనా దోచెయ్యడానికి…ఇప్పుడు
ఫోనుల్లో… అలా కొన్ని యాప్ లు ఉన్నాయి. వాటికి కొన్ని పేర్లు ఉంటాయి.
డబ్బులు పంపించవచ్చు, తెప్పించుకోవచ్చు ఎంతదూరమైనా…అందులో లెక్కే వస్తుంది కానీ, నోట్లు రావు. అలా రావాలంటే …కొన్ని సీక్రెట్గా అంకెలు
వాడుతారు . అలా ఎవరి ఫోన్ లలో వాళ్లే ఏర్పరుచుకున్నందున అవి పక్క వాళ్లకు కూడా తెలియవు.
కాబట్టి నువ్వు అక్కకు పంపిన పైసలు ఎవరూ దోచుకోరు నువ్వు భయపడి, నువ్వు అలా ఊరికే ఫోన్ చేసి అక్కను కంగారుపెట్టకు
అన్నాడు శీను.
అయ్యో…ఇదేమి మాయరా నాయనా అంది సుబ్బమ్మ.
అదే అంతర్జాల మాయ పెద్దమ్మా అని చెప్పాడు శీను.

సమాప్తం

You May Also Like

One thought on “అంతర్జాల మాయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!