చిట్టెమ్మ కొట్టు

చిట్టెమ్మ కొట్టు

రచయిత:: హసీనాఇల్లూరి

చాలా కాలం తర్వాత అమ్మమ్మ ఊరు వెళ్తున్నాం. ఊరు, ఆ మనుషులు,పొలాలు చూస్తూ వెళుతుంటే మావయ్య వాళ్ళ ఇంటి వీధి చివర ఉండాల్సిన చిట్టెమ్మ కొట్టు కనిపించలేదు.

మావయ్య వాళ్ళని అడిగితే “ఇంకా ఎప్పటి కొట్టు ఇప్పుడు ఆలాంటి కొట్లలో తిండి ఎవరు తింటారు. ఇప్పటి పిల్లల తిండి వేరు, చిట్టెమ్మ కూడా ముసలిది అయిపోయి ఆ కొట్టు ఉండాల్సిన చోటులో చిన్న ఇంట్లో ఉంటోంది. ఎవరైనా ఇస్తే వేళకి ఇంత తిని ఏదో కాలం గడుపుతోంది.

ఇంటికి చేరి స్నానాలు కానిచ్చి నడుం వాల్చిన నాకు నిద్ర రాలేదు, చిన్నప్పుడు సెలవులకు ఊరికి వచ్చినప్పుడు చిట్టెమ్మ కొట్లో తాగిన అల్లం సోడా, మరమరాల ఉండలు అలా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

నాకు అల్లం సోడా అంటే ఇస్టమని రోజు నా కోసం ఒకటి ఉంచేది, ఎవరు అడిగిన ఇచ్చేది కాదు ఆ ఒక్కటి మా చిట్టితల్లి కోసం అని చెప్పేది. ఆ రోజులు గుర్తుచేసుకున్నా ఎంతో హాయిగా అనిపిస్తుంది.

@@@

అమ్మమ్మ వాళ్ళది రామపురం.ఊరు మొత్తం కలిపి 150 గడపల దాకా ఉంటాయి, అయినా కానీ ఊరంతటికి కలిపి శెట్టి కొట్టే దిక్కు. శెట్టి చాలా పిసినారి మరియు లోభి.

ఎవరైనా తన దగ్గరే సరుకులు కొనాలి. ధరలు ఎక్కువ చెప్తున్నాడు అని పక్క ఊర్లో కొన్నారంటే ఏదైనా అత్యవసర సమయంలో కొనే సరుకులను మూడింతల ధర ఎక్కువ చెప్పేవాడు.

పోనీ సరుకులు అయిన మంచి రకం ఇచ్చే వాడు కాదు,చౌక రకం ఇచ్చేవాడు. ఏమైన అంటే అవి కూడా ఇవ్వకుండా సతాయించేవాడు. ఊరు మొత్తం రోజువారీ అప్పు మీద తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉండటంతో శెట్టి ఆటలు చెల్లేవి.

ఇలా ఉండగా మా ఊరి భద్రం ని పెళ్లి చేసుకొని వచ్చిన చిట్టెమ్మ ,మొగుడు చనిపోవడంతో ఊరిలో ఇంకొక కొట్టు ఉంటే బాగుంటుంది అని కొట్టు పెట్టడానికి ఏర్పాట్లు చేయసాగింది.

ఈ విషయం తెలిసిన శెట్టి “ఆ…మొగుడు పోయిన వెధవ, అదేం చేస్తుంది నన్ను. అయినా ఈ ఊరికి కొట్టు పెట్టి నడపడం చిన్న విషయం కాదు, మూణ్నాళ్ల ముచ్చట” అని ఊరుకున్నాడు.

చిట్టెమ్మ కొట్టు తయారీ పూర్తి చేసి తనకి చేదోడు వాదోడు గా ఒక 15 ఏళ్ల కుర్రాడిని సహాయంగా పెట్టుకుంది. చిట్టెమ్మ కొట్టులో సరుకులు నాణ్యత గా ఉండేవి ముఖ్యంగా శెట్టి కొట్టు తో పోలిస్తే ధరలు కూడా తక్కువగా ఉంటాయి.

చిట్టెమ్మ సరుకులు మాత్రమే కాకుండా ఊరిలో పండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు రైతుల దగ్గర కొని కొట్టుకి వచ్చే వాళ్ళకి కొంచెం లాభానికి అమ్మేది.దీని వల్ల అటు రైతులు కూడా ఊరంతా తిరగడం లేదా పట్నానికి తీసుకువెళ్లి అమ్ముకునే శ్రమ లేదు ఇప్పుడు. కొట్టులో అన్ని సరుకులు, కూరగాయలు, పండ్లు అన్ని దొరకడంతో వేరే ఎక్కడికి వెళ్లే పని లేదు. ముఖ్యంగా ఆ శెట్టి గోల లేకుండా పోయింది అని జనాలు సంతోషంగా ఉన్నారు.

ఎవరైనా పిల్లలు పిప్పర్ మింట్లు, జీళ్ళు కొనలేక ఆశగా చూస్తే “ఇటు రారా! ఇంద జీళ్ళు తీసుకో అంటూ ఇచ్చేది. వద్దక్కా డబ్బులు లేవు అని అంటే అబ్బో!! నువ్విచ్చే 20 పైసలు కి నేను మిద్దెలు కట్టేస్తాను ఏంట్రా? పర్లేదు ఇందా తిను అని ఇచ్చేది”. పిల్లలు మాత్రమే కాదు ఎవరైనా కాస్త చిల్లర తక్కువ ఇచ్చిన వాళ్ళ స్థితి గతులను బట్టి ప్రవర్తించేది, పద్దు పుస్తకం లో తేదీ అయిపోయిన అప్పు తీర్చని వాళ్ళు ఎవరైనా ఉన్నా కాస్త నిదానంగా అయినా పర్వాలేదు తీర్చండి అని ఊరుకునేది.

నేను ఎప్పుడు వెళ్లినా నాకిష్టమైనవి అడగకనే నా చేతిలో పెట్టేది. మద్యాహ్నం వెళితే అల్లం సోడా ఇచ్చేది నాకు అప్పుడు తాగటం ఇష్టమని. నేను అంటే ఎంతో ప్రేమ చూపించేది. ఎండాకాలం అయితే నా కోసం మామిడి పండ్లు తెప్పించి ఇంటికి పంపేది.

ఊరంతా తన దగ్గరే కొంటున్నారు కాబట్టి తినుబండారాలు ఎక్కడి నుంచో దేనికి తెప్పించాలి అని ఊరి వాళ్ళందరిని పిలిచి”మన ఊరు మరి చిన్నదేమి కాదు 200 గడపలు ఉన్నాయి, ఆలాంటిది వేరే ఎక్కడి నుంచో తినుబండారాలు తెప్పించడం దేనికి అదే మన ఊరి వాళ్ళు చేస్తే మీకు ఉపాధి దొరుకుతుంది. మనము కాస్త లాభపడొచ్చు. రామక్క! నువ్వు లడ్డులు, నువ్వు జీళ్ళు బాగా చేస్తావు కదా నువ్వు అవి చేసివ్వు. సావిత్రి పెద్దమ్మ.. నువ్వు అరిసెలు, మైసూర్ పాక్ బాగా చేస్తావు కదా నువ్వు అవి చేయి, రంగన్న నువ్వు కారప్పూస, జంతికలు చేయి. ఇలా మీకు వచ్చినవి చేసి నాకు అమ్మండి. నేను పక్కన ఉన్న చిన్న చిన్న పల్లెలో కూడా అమ్మి మీకు లాభాలిస్తాను” అని అందరికి ఎదో ఒక ఉపాధి కల్పించింది.

అప్పటి నుంచి ఊరందరికి చిట్టెమ్మ అంటే ప్రేమ, అభిమానం ఎక్కువ అయింది. చిట్టెమ్మ కూడా ఊరిలో ఏ ఇబ్బంది ఉన్న తన వంతు సహాయం చేసి అందరికి తోడుగా ఉండేది.

@@@
చిట్టితల్లి! పడుకోలేదా? అన్న పిలుపుతో జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చిన నాకు చిట్టెమ్మ ని చూడలనిపించి” మావయ్య పిల్లల ను కాసేపు చూసుకో! నేను ఇప్పుడే వస్తాను అని చెపితే”.

ఎక్కడికమ్మా!?

“ఒకసారి చిట్టెమ్మ ని చూసి వస్తాను” అని చెప్పి బయలుదేరాను.

ఇంటికి వెళ్లి తలుపు తడుతుంటే “ఎవరు?” అని ఒక వొణుకుతున్న గొంతు వినిపించింది. అది తనదే అని తెలిసి ” నేను చిట్టితల్లి ని” అని చెప్పగానే ” రామ్మా, గడియ తీసే ఉంది” అని అనగానే లోపలికి వెళ్ళాను.

ఒకప్పటి చిట్టెమ్మ కి ఇప్పటి చిట్టెమ్మ కి ఎంత తేడా! నిజమే తను ఈ ఊరు వచ్చి దాదాపు 15 ఏండ్లు అవుతోంది.అమ్మమ్మ పోయాక ఇటు రానే లేదు.

పెళ్లి పిల్లలు వాళ్ళతో కాలం గడిచిపోయింది. ఇదిగో ఇప్పుడే మళ్ళీ రావటం.”బాగున్నవా చిట్టెమ్మ?” అని అడగగానే” నాకేం తల్లి చాలా బాగున్నాను.నువ్వు ఎలా ఉన్నావు.పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు అని విన్నాను వాళ్ళు బాగున్నారా అని అడిగింది”.

“హ..బాగున్నారు.వాళ్ళు నిద్రపోతుంటే నిన్ను చూద్దామని వచ్చాను”.

” సంతోషం చిట్టితల్లి..ఇంకా నన్ను గుర్తుపెట్టుకొని మాట్లాడనికి వచ్చావు.ఇందా తీసుకో అని మరమరాల ఉండ ఇచ్చింది.”

నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంకా నా ఇష్టాలు గుర్తు ఉన్నాయి అని అది తీసుకొని “ఏది మర్చిపోలేదు చిట్టెమ్మ నువ్వు, అయినా ఇవి ఎవరు ఇచ్చారు అని అడిగితే” ” నువ్వు వస్తున్నావు అని మొన్న మీ మావయ్య అంటుంటే విన్నాను.నీకోసమే తెప్పించి పెట్టాను” అని అనగానే తను నవ్వింది, నేను జత కలిపాను.

ఇద్దరం బోలెడు విషయాలు మాట్లాడుకున్నాం.”వీలు కుడిరినపుడు వస్తుంటాను” అని చెప్పి “తను ఇచ్చిన ఉండ తింటూ చిన్నప్పుడు ఇలాగే రోడ్డు మీద వెళ్తూ తినేవాళ్ళం కదా ఆ రోజులు మళ్లీ ఎప్పటికి తిరిగి రావు.”

చిట్టెమ్మని కలిసిన ఆనందంతో ఇంటి బాట పట్టాను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!