చిట్టెమ్మ కొట్టు

చిట్టెమ్మ కొట్టు

రచయిత :: గుడిపూడి రాధికారాణి

కంకర పైకి తేలి గతుకులుగా వున్న తారురోడ్డు మీద వేగంగా ముందుకు పోతోంది పల్లె వెలుగు బస్సు.పేరుకే తారు రోడ్డు..తారన్నదే లేదు.బస్సు లోపల పట్టుమని పాతిక మంది కూడా లేరు.
ఓ కిటికీ సీటు దగ్గర కూర్చుని అందరితోపాటు కుదుపులకి ఎగిరెగిరి పడుతున్నాడు నిరంజన్. ముక్కొల్లు హైస్కూల్ టెన్త్ బ్యాచ్ పూర్వవిద్యార్థుల సమావేశానికి వెళ్తున్నాడు.
చాలా కాలానికి సొంతూరు పోవడం..మూడేళ్ళయిందేమో. ఉద్యోగం వచ్చాక మొదటి నెల జీతంతో అమ్మకి చీర,పళ్ళు కొనుక్కెళ్ళి ఇవ్వడమే.మళ్ళీ ఇదే.
ఆ పండుమిరప రంగుమీద ఆకుపచ్చంచు పట్టుచీర,డజను యాపిల్స్,చక్రకేళీలు చూసి కాక తనని చూసి అమ్మ మొహం మతాబులా వెలిగిపోవడం,సంబరంగా తన మొహం చేతుల్లో తీసుకోవడం,ఆ కాయలు కాసిన చేతుల గరుకుదనానికి తను చిరాకుపడడం, అయినా అమ్మ చిన్నబుచ్చుకోకుండా ఆ చేతులు మెటికలు విరిచి నా బాబే..ఎంత దిష్టో..అంటూ ఉప్పు దిగదుడిచి పడెయ్యడం..అమ్మని సిటీకొచ్చేయమంటే రాననడం.. అంతా నిన్న మొన్నలాగుంది.
అమ్మ..అమ్మ గుర్తుకురాగానే మొహం అయిష్టంగా ముడుచుకుపోయింది అప్రయత్నంగా.
బస్సు ముందుకుపోతుంటే నిరంజన్ బాల్యంలోకి పోయాడు.
ముక్కొల్లు గ్రామంలో పెద్ద వీధి చివర చిట్టెమ్మ కొట్టంటే తెలియని వారు లేరు. సిటీల్లో మాల్స్ లో సర్వం దొరికినట్లు గుండుసూది నుండి గుమ్మడికాయ దాకా తెచ్చి పెట్టుకుని అమ్మేది చిట్టెమ్మ.
కొడుకు చంటిబిడ్డగా ఉండగానే మొగుడు యాక్సిడెంటై పోవడంతో తప్పనిసరి పరిస్థితిలో బడ్డీ కొట్టు నిర్వహణ తీసుకుంది. చిన్నవయసులోనే ముదిమి వచ్చి మీదపడినట్లు కుంగి చిట్టి చిట్టెమ్మగా మారిపోయింది.
అడవిలో లేడి అరవై జంతువులకాహారం అన్నట్లు జనం ఆకలి చూపులకి గురయ్యేది.కానీ నిప్పులా ఉండి అవసరమైతే ఖాతా పెట్టనిచ్చినా వసూలు నవ్వుతూనే నిక్కచ్చిగా చేసుకునేది.
క్రమంగా చిట్టెమ్మ గట్టెమ్మ అనే పేరూ వచ్చింది.మెల్లమెల్లగా ఆమె కొట్టూ విస్తరించింది.
ఒక్కగానొక్క కొడుకు నిరంజన్ హైస్కూల్ వయసుకి వ్యాపార సూత్రాలు ఆకళింపు చేసుకుని చిల్లరకొట్టు చిట్టెమ్మ ఇంకో పనివాడిని పెట్టుకునే స్థాయికి ఎదిగింది.
హైస్కూలులో కొత్త వాతావరణం, కొందరు కొత్త స్నేహితులు,కొత్త టీచర్లు…మొదటి పిరియడ్ తెలుగు మాస్టారు పేరు చెప్పి పరిచయం చేసుకోమన్నారు.
” సార్! నా పేరు ఉమాసాయి.మా నాన్న బ్యాంక్ మేనేజర్ గోపాల కృష్ణ. ”
” సార్! నా పేరు ఉదయక్రాంతి. మా నాన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ జయరామ్.”
” సార్! నా పేరు నవీన్ వర్మ. మా నాన్న నా చిన్నప్పుడే కాన్సర్ తో చచ్చిపోయారు. అమ్మ,నేను అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంటాం.”
నిరంజన్ వంతు వచ్చింది.
అతను నోరు తెరిచేలోపే ” నువ్వు చిట్టెమ్మ కొడుకువి కదూ.కొట్టుకొచ్చినపుడల్లా చూస్తుంటాలే.ఏంటి పేరు?” అడుగుతున్నారు మాస్టారు.
వెనకాలెవరో చిల్లరకొట్టు చిట్టెమ్మ కొడుకు అన్నారు మెల్లిగా.
నిరంజన్ కి ఏడుపొచ్చింది.
ఆ సాయంత్రం ఇంటికెళ్ళి అమ్మతో గొడవ పడ్డాడు..అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళిపోదామని పేచీ పెట్టాడు.
ఒకళ్ళ మీద ఆధాపడకుండా ఊడిగం చేస్తూ కూడా అన్నావదినల ఈసడింపుకి లోనవకుండా గౌరవంగా పని చేసుకోవడంలో తప్పు లేదని ఎలా చెప్పాలో అమెకి చేతకాలేదు.అర్ధం చేసుకోగలిగే వయసు వాడికి లేదు.
” ఇబ్బంది పడవచ్చు గానీ మాట పడకూడదు నాయనా!” అని మాత్రం చెప్పగలిగింది.
క్రమంగా తల్లీకొడుకుల మధ్య ఏదో తెలియని దూరం పెరిగింది. ఆ పిచ్చి తల్లి మటుకు వాడికి మంచి చదువులు చెప్పిస్తూ దేనికీ లోటు లేకుండా చూసుకుంటూ గడిపేసింది.
తనకీ తన స్నేహితుల్లా మంచి హోదా గల తండ్రి ఉంటే బాగుండని,తనఖర్మకీ కొట్టు నడుపుకునే తల్లి ఏమిటని కుమిలిపోయేవాడు నిరంజన్.కాలేజీ చదువుకి తప్పిందే చాలన్నట్లు బెంగపడకపోగా సంతోషంగా హాస్టల్ లో చేరిపోయాడు.
చివరికి ఇంజనీరింగ్ పూర్తవడంతోనే ఎనిమిది లక్షల ప్యాకేజీతో కేంపస్ సెలక్షన్ వచ్చింది. తొలి నెలజీతంతో అవీ ఇవీ కొనుక్కెళ్ళాడు.మాటవరసకి అమ్మని వచ్చేయమన్నాడు.ఆమె కాదంటే వద్దన్నదే చాలన్నట్లు ఊరుకున్నాడు.
బస్సు ఒక్క కుదుపుతో ఆగడంతో ఉలికిపడి ప్రస్తుతానికొచ్చాడు నిరంజన్.బ్యాగ్ తగిలించుకుని బస్ దిగాడు..కుదుపులకి ఒళ్ళు పట్టినట్లయింది.నవీన్,ఉమా గాడు వాళ్లంతా వచ్చే ఉంటారీపాటికి.
వాళ్ళకీ దిక్కుమాలిన బస్సెక్కే ఖర్మేమిటి? కార్ తీసుంటారు.నేనూ ముందు కార్ కొనాలి.తర్వాత లోన్ తీసుకుని ఒక అపార్ట్‌మెంట్ కొనుక్కోవాలి. ఆ తర్వాతే పెళ్ళి.
డొంకదారిలో నడక నెమ్మదిగా సాగుతున్నా ఊహలు జోరుగా పరుగెడుతున్నాయ్. ముందు ఇంటికెళ్ళి స్నానం చేసి ఫ్రెష్షయ్యి ఊరి మీద పడదాం . రేపే మీటింగ్ కనుక అందరొచ్చేసుంటారీపాటికి.అనుకుంటూ ఇల్లు చేరాడు నిరంజన్.
అమ్మ తెగ హడావిడి పడుతూ ఏవేవో సరుకులు అమ్మేస్తోంది.రేపటి డెకరేషన్ వగైరాలన్నిటికీ సప్లై అమ్మేనేమో. ఈ ముక్కే చెప్తారిక రేపు నన్ను చూడగానే. నిరంజన్ మొహం మళ్ళీ ముడుచుకుపోయింది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిరంజన్ ఈ ఊరు రాగానే చిల్లరకొట్టు చిట్టెమ్మ కొడుకు అయిపోతాడు.అనుకుంటూ వేపకాయ నమిలిన వాడిలా మొహం పెట్టాడు.
చిట్టెమ్మ మాత్రం కొడుకు ధోరణి తెలిసిందే కనుక అదేమీ పట్టించుకోలేదు.
కొడుకు తెచ్చిన డ్రై ఫ్రూట్స్ కవర్ పక్కన పెట్టి బిడ్డను ప్రేమగా కళ్ళనిండా చూసుకుంది.
తల్లికళ్ళకు రంగుతేలి ఒళ్ళొచ్చిన కొడుకు కాకిలా నల్లబడి చిక్కినట్లే కనిపించడం సహజమేగా!
మర్నాడు మీటింగ్,ఈటింగ్,ఫొటోలు,సందడి ముగిసి ఫ్రెండ్ కార్ లో బెంగళూరు బయలుదేరిన కొడుకుకి కజ్జికాయలు,సున్నుండలు,జంతికల డబ్బా పెట్టిన సంచి చేతికిచ్చింది ఆప్యాయంగా.
ఆమె కళ్ళలో కోటి కాంతులు.కాదనకుండా తీసుకుని మౌనంగా కారెక్కాడు నిరంజన్..రూమ్ కి చేరాక తెరిస్తే సంచిలో ఒక కవరు. అందులో ఉత్తరం.
బోలెడు అక్షరదోషాలతో తల్లి స్వహస్తాలతో వ్రాసిన ఉత్తరం.కూడబలుక్కుంటూ చదివిన నిరంజన్ నిరుత్తరుడయ్యాడు.
” నాయనా! మాది ప్రేమ పెళ్లి.మీ అమ్మమ్మ వాళ్ళు కలవారు.మా పెళ్ళికొప్పుకోలేదు.రాలేదు కూడా.మీ నాన్న పోయేనాటికి నువు నెలల బిడ్డవు. అప్పుడొచ్చారు మా వాళ్ళు.
నిన్ను అనాధ శరణాలయంలో చేర్పించి నాకు వేరే పెళ్ళి చేస్తామని పట్టుబట్టారు. బిడ్డను దూరం చేస్తే చస్తానన్నాను.ఇలాంటి దర్మార్గపుటాలోచనలు కడుపులో పెట్టుకున్న మీ కొంపకిక వచ్చేదిలేదని ఒట్టు పెట్టుకుని వాళ్ళను వెళ్ళగొట్టాను.
నాయనా! నువ్వే నా ప్రపంచం. నీకు మంచి చదువులు చెప్పించాలి.పదుగురిళ్ళకెళ్ళి పాచిపనులు చేసైనా నిన్ను పెద్ద చదువులు చదివించాలి.పొద్దుగూకులు ఇదే యావ.ఏం చెయ్యాలి? ఎట్లా బతకాలి? నా కడుపున పుట్టినందుకు నువు తలెత్తుకోవాలి గానీ తలదించుకోకూడదు.
బాగా ఆలోచించి ఇంటిముందు చిన్నగా రెండు బల్లలేసి అంగడి పెట్టా.మనది పెద్ద వీధి,పైగా బడికి దగ్గర కావడంతో అటు సరుకులు,ఇటు బిళ్ళలు,బిస్కెట్లు,పుస్తకాలు,పెన్నులు అన్నీ వేగం అమ్ముడుపోయేవి.మెల్లిగా కొట్టు పెంచుకుంటా వచ్చా.ఒకర్ని మాటనింది లేదు.ఒకరితో మాట పడింది లేదు.
బిడ్డా! తప్పు పని చేయొచ్చు తప్పుడు పని చెయ్యకూడదు.నేనా రెండూ చెయలా. నీ బాధ తెలుసు.కానీ చేసేది గౌరవమైన పనే కదా! పెద్దయితే నువ్వే అర్ధం చేసుకుంటావని సరిపెట్టుకున్నా.
నిన్న సుధీర్ తో చెప్పావుట కదా! ఇల్లు,కారు కొనడానికి బ్యాంకి లోను పెడతావని.వాళ్ళమ్మ చెప్పింది.
నేను అప్పుడూ అప్పుడూ చేతిలో కాస్త డబ్బాడినపుడల్లా చుట్టుపక్కల పట్నాల్లో స్థలాలు కొన్నా. బ్యాంక్ లో డబ్బు దాచే బదులు మనమట్టా చేద్దాం.జనం పెరుగుతుంటారు కానీ భూమి పెరగదు. అని నువు కడుపులో పడ్డప్పటినుండే నాన్న చెప్పేవారు.అందుకే విశ్వనాథం మాస్టారి సహాయంతో అలా చేశా.ఇప్పుడా భూముల ధరలు బాగా పెరిగాయట.నేను గజం వందల్లో ఉండగా కొన్నవి ఇప్పుడు వేలల్లోనేట. వాటి వివరాలు కూడా ఇస్తున్నా. వాటిలో రెండు మూడు స్థలాలమ్మినా నీకు సిటీలో ఇల్లు,మంచి కారు వస్తాయి.ఆస్తులున్న విషయం చదివే దశలో చెబితే చదువులో పట్టుదల తగ్గి అశ్రద్ధ పెరుగుతుందేమోనని మాస్టారు ఇన్నాళ్ళూ చెప్పొద్దన్నారు.”
నిరంజన్ కళ్ళలో నీళ్ళు కారిపోతుంటే అక్షరాలు కనబడడం మానేశాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్దామని పీడించినా అమ్మ ఒప్పుకోనిది ఇందుకా! అమ్మ ప్రేమ ఇంత గొప్పదా!! అమ్మ తలుచుకోకుంటే అనాధనేగా నేను.
ఇటువంటి త్యాగమూర్తిని నేను విసుక్కుంటూ ఇన్నేళ్ళు ఆమెని అనాథని చేశానా?
ఆమె కూడబెట్టిన ఆస్తి కంటే ఈ విషయమే అతడిని ఎక్కువగా కదిలించింది. పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు నిరంజన్. గాలికన్నా వేగంగా వెళ్ళి అమ్మ ముందు వాలిపోవాలని ఉన్నా సాధ్యం కాదు కనుక వెంటనే వెళ్ళి బస్సెక్కాడు.
ఈసారి ఆ గతుకులు చిరాకు పుట్టించలేదు.అమ్మ ప్రేమతో ఊపిన ఉయ్యాల ఊపుల్లా తోచాయి.

***

You May Also Like

One thought on “చిట్టెమ్మ కొట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!