ఔరా

ఔరా

రచన – మంగు కృష్ణకుమారి

సరళా వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకొని కోలనీలోకి మారిపోయేరు. భర్త శివరావు బేంక్ మేనేజర్. చాలా బిజీ. ఇద్దరుకొడుకులు, కూతురు ఎమ్ బిఎ, ఇంజనీరింగ్ చదువుతూ తినడానికి కూడా టైముల్లేక ఉంటారు. పిల్లలకి ఎవరిగదులు వాళ్ళకి ఉండేట్టు డూప్లెక్స్ కట్టించేడు శివరావు. బొంగరంలాగ తిరుగుతూ సరళ అన్నీ చక్కపెట్టుకుంటూనే ఉంటుంది.
కొత్తగా కుదిరిన పనిమనిషి ‘కవిత’ చాలా మాటకారి అని కుదిరిన వారం రోజుల్లోనే బోధపడింది. “ఏదోలే టైమ్ కి వచ్చి తనపని తను చేసుకుంటే చాల్లే” అనుకొని సరిపెట్టుకుంది. ఇంటి గృహప్రవేశంకి రాని కొందరు బంధువులు ‘వస్తున్నాం’ అని ఫోన్ లు చేసేరు.

శివరావు తనకి సెలవలు లేవని తను ఇంట్లో ఉన్నసమయంలో వాళ్ళతో గడుపుతానని చెప్పేసాడు. పిల్లలు సరేసరి. తమకి పరీక్షలు, తీరిక ఉండదని తేల్చేసేరు.

శివరావు మేనమావ కొడుకులు ఇద్దరు, పినతల్లి కొడుకులు ఇద్దరు నలుగురు ఒక్కసారే దిగేరు. ఇల్లు చూడ్డంతోపాటు ‘వాళ్ళ వాళ్ళ’ సొంతపనులు కూడా చక్కపెట్టుకోడం కూడా వాళ్ళకి ఉంది. దగ్గరలో వారం ఉంటారు. సరళ మర్యాదల బాధ్యత స్వీకరించి అందరికీ అన్నీ చేసి రెడీ చేసింది. కవిత వచ్చేసరికి అందరూ వచ్చి పది నిమిషాలయింది, అంతే. కవిత అతిథులను చూసి కొంగు బిగించింది. సరళకి చాలా సాయం చేసింది.

వాళ్ళు ఉన్న వారం రోజులూ సరళ అడగకపోయినా చాలా పనులుచేసింది. అతథుల బట్టలు ఉతికి ఆరవేసి ఎండినవి తీసి మడతలు పెట్టి మరీ దాచేది. ‌ఉల్లిపాయలు కట్ చేయడం, చిన్న చిన్న బజారు పనులు, తోమిన గిన్నెలు తుడిచి‌ ఎండలో‌‌ పెట్టి మళ్ళా జాగ్రత్తగా సద్ది మరీ ఉంచేది. మధ్యాహ్నం కూడా వచ్చి గిన్నెలు తోమి గదులు
తుడిచి శుభ్రాలు చేసేది.

సరళ చాలా ఆనందపడింది. “ఒక్కదానివి ఏటి సేసుకుంటావులే” అనేసింది సరళ కృతఙ్ఞతలు చెపితే.

నెల రోజులు గడిచింది. ఈసారి సరళ అత్తగారు, ఆడపడచులు ఇద్దరు వస్తాం అని ఫోన్ చేసేరు. అత్తగారికి మడిగా అన్నీ చేయాలి. పెద్దాడపడచుకి బిపి సుగర్. ఎందులోనూ
ఉప్పు, నూనె ఉండకూదడు.

అత్తవారింటి పద్ధతుల్లో కోడలు ఉంటే కోడలే పనంతా చేయాలి. ఆడపడచులు మర్యాదలు అందుకోవలసిన వాళ్ళే. మహా అయితే వాళ్ళు తిన్న కంచాలు తోమే దగ్గర వేసి, టేబుల్ తుడుస్తారు. అంతే. అదే అత్తగారికి చిటపట.

“సరేలే పైపనులన్నీ కవిత సాయం చేస్తుంది” అని ధైర్యపడి కవితకి చెప్పింది తమ అతిథుల రాక గురించి. “అట్టనా…” అంది కవిత.

రాత్రి రైలుకి దిగేరు అత్తా, ఆడపడచులు. ఒకరికి ఉప్పుడుపిండి, ఒకావిడకి రాగి జావ, ఇంకో ఆమె ఉప్పుడుపిండి తినదని అన్నం, సాంబారు నంచుడు పచ్చళ్ళతొ
సహా సిద్ధం చేసింది.

తెల్లారి చూస్తే కవిత రాలేదు. రెండుసార్లు ఫోన్ చేసినా తియ్యలేదు. మూడోసారి చేస్తే తీసి “అరిజెంటు పని తగిలి ఊరెళ్ళినానమ్మా..ఓ వారం రాను” అంది. సరళకి నసాళానికి కోపం ఎక్కింది. “అదేమిటి కవితా? మా అత్తగారు, ఆడపడచులు వస్తారని చెప్పేను కదా.. నీ ప్రయాణం తరవాత పెట్టుకోవచ్చు కదా… నన్ను ఇబ్బంది‌ పెట్టేవే?” అంది.

కవిత నింపాదిగా “అదేటిదమ్మా, ఒచ్చిన సుట్టాలు ఆడాళ్ళే కదా, సెప్పి సేయించుకో… మొగోళ్ళయితేనవే సెయ్యాల. ఆడోళ్ళకెందుకూ?” అని పెట్టేసింది. ఆ లాజిక్‌కి‌నోరు విప్పి ఒక్కమాట అనలేక “ఔరా కవిత తెలివి నాకు లేదే?” అంటూ నిట్టూర్చింది సరళ.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!