పని మనిషి

పని మనిషి

రచన: నెల్లుట్ల సునీత

” అమ్మ గారు భోజనం రెడీ ” మడతలు పడి మాసిన చీర కొంగుతో. పొంగుతున్న చెమటను తుడుచుకుంటూ. వచ్చి చెప్పింది అర్చన. అంతవరకు సోఫాలో కూర్చొని పుస్తకం చదువుతున్న రేఖ తల పైకెత్తి చూసింది ” వస్తున్నాను అర్చన ” అంటూ సోఫాలో నుంచి పైకి లేచి వంటగదిలోకి నేరుగా నడిచింది.
అప్పటికే అర్చన డైనింగ్ టేబుల్ పై అన్ని నీటుగా సర్దేసింది. అమ్మాయి లోని చురుకుదనం, పనితనం, మెచ్చుకొని రోజంటూ లేదు రేఖ, అయినా అర్చన కళ్ళల్లో ఏదో తీరనిలోటు కనిపించేది. ఒక్కోసారి కళ్ళు చెమర్చేవి ఇప్పుడే కాదు ఇలా చాలా సార్లు గమనించింది రేఖ. అయినా అర్చన బాధ పూర్తిగా అంతుబట్టలేదు రేఖకు. తనేమో కొత్త కోడలు, అర్చన తనకన్నా ముందు నుండి ఈ ఇంట్లో పని మనిషి, కళ్ళల్లో తడి చూసి ప్రతిసారి అడిగినట్లే ఈసారి అడిగింది లేఖ, ” ఎందుకు ఏడుస్తున్నావ్ ” అని ” ఏమీ లేదు అమ్మ గారు, చనిపోయిన అమ్మానాన్న ,గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుపొస్తుంది, అంతే ” ప్రతిసారి ఇలాగే సమాధానం చెబుతూ వచ్చింది, ” ఎందుకు చనిపోయారు? ఎలా చనిపోయారు? ” అని రేఖ అడగ్గానే ఆపుకోలేని దుఃఖంతో అర్చనకు నోరు పెగిలేది కాదు.
ఏది ఏమైనా ప్రతిసారి వినయంగా ” అమ్మగారు ” అంటూ సంబోధిస్తూ ఆప్యాయంగా పలకరించే అర్చన మనసు వెన్నపూసని ఎప్పుడో గ్రహించింది రేఖ. తన భర్త గారైన రవి తో చాలాసార్లు అర్చన గురించి చెప్పింది, ” ఎవరూ లేరని బాధపడకు, నీకు ఏ లోటూ రాకుండా చూసుకుంటాము, రేపటి నుండి ఈ పాత చీరలు చుట్టి పెట్టి మంచి చీరలు కట్టుకో, మాతో పాటే భోంచెయ్, ఒక పని మనిషిలా ఊహించుకోవద్దు, మా ఇంట్లో నువ్వు కూడా ఒక సభ్యురాలివే అనుకో అర్థమైందా ” అని రేఖ అనిన చివరి మాటకు అర్చన తల పైకెత్తి చూసింది. నాలో దురదృష్టం తిష్ట వేశాక, ఎవరెన్ని చెప్పినా ఈ బ్రతుకుని మార్చడం ఎవరి తరం కాదని మనసులో గట్టిగా అనుకుంది. కానీ ఏ పరిస్థితినైనా చాకచక్యంగా పరిష్కరించగల రేఖ లాంటి మనిషి, తనకు తోడుగా దొరికినందుకు సంతోషపడింది అర్చన.
రేఖ అత్తగారైన నాగమణి ఎప్పుడూ అగ్గిమీద గుగ్గిలం లా ఉడుకుతోనే ఉంటుంది. చాదస్తం లోనే కాదు, పనికి పురమాయించడంలో ముందు ఉంటుంది. ఆమె ముఖ కవళికలోనే ఆ గ్రహం ఉట్టిపడుతూ ఉంటుంది. కొడుకు రవి తల్లికి తగ్గ తనయుడు. ఊసరవెల్లిలా రంగులు మార్చడం తనకు వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళిద్దరూ ఊరెళ్లి వారం రోజులైంది, ఇల్లు ప్రశాంతంగా ఉంది. నిన్నే వస్తామని ఫోన్ చేశారు అయినా ఇంకా రాలేదు, విషయం కనుక్కుందామని ఫోన్ దగ్గరకు వెళ్ళింది రేఖ, అంతలో ఫోన్ మోగింది, రిసీవర్ అందుకుంది, ఉన్నఫలంగా రేఖ చేతిలోని రిసీవర్ అప్రయత్నంగానే జారిపోయింది. తూలి పడిపోతున్న రేఖను వేగంగా వచ్చి పట్టుకుంది అర్చన. ముఖాన నీళ్లు చల్లి లేపింది. మెలకువ వచ్చిన రేఖ హడావిడిగా బయలుదేరమంటూ తొందర పెట్టింది అర్చనను. రేఖ వెంట బయలుదేరింది అర్చన.
నేరుగా హాస్పటల్ కి తీసుకు వెళ్ళింది. అక్కడ తీవ్ర గాయాలతో పడి ఉన్న రవిని చూడగానే చలించిపోయింది అర్చన, ద్విచక్ర వాహనంలో వెళుతున్న రవిని లారీ ఢీకొట్టిందట.. చాలా రక్తం పోయింది, రక్తం ఇస్తే గాని బ్రతకడం కష్టం, అతనికి సరిపడా రక్తం దొరకడం చాలా కష్టమైంది. చివరి నిమిషంలో, అర్చన ముందుకు వచ్చి, రక్తం ఇచ్చింది, ఇప్పుడు అతని ఆరోగ్యం మెరుగు పడింది, ఇదిలా ఉండగా ఒకసారి భర్తతో ” ఏమండీ అన్నీ మనమే అనుకుని, మనల్ని నమ్ముకుని, మన ఇంట్లో పని మనిషిగా చేరింది అర్చన, అమాయకురాలు, పైగా అమ్మానాన్న ఎవరూ లేరు, చొరవ తీసుకుని, మంచి సంబంధం వెతికి తెచ్చి, పనిమనిషిని ఒక ఇంటిదాన్ని చేద్దామండి ఏమంటారు ” ఇలా అర్చన ఎదుటే రేఖ, చాలాసార్లు రవితో, ఈ మాట అనింది, కానీ అతను ఏమీ పట్టనట్లు, విననట్లు ఉండేవాడు, పొద్దున్నే లేచిన దగ్గర నుండి, పడుకునే వరకు, ప్రతి పని అర్చన చేయాలి, రేఖ మాత్రం పుస్తకంలో మునిగిపోతే, నాగమణి టీవీలో వచ్చే సీరియల్ వదిలేది కాదు, రవి మాత్రం ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు కాలక్షేపం చేసి పడుకునేవాడు.
ఈరోజు ఒకటో తారీకు, వేకువజామున ఇంటి ముందు పెరట్లో మొక్కలకు నీళ్లు తోడి, పాత్రలు క్లీన్ చేసి వంట చేయడానికి సిద్ధపడుతున్న అర్చన దగ్గరికి వచ్చి నిలబడింది నాగమణి, ” అన్నీ సవినయంగా జరుగుతున్నాయా. ఏవైనా తేడాలు వస్తున్నాయా ” కోపంగా అడిగింది నాగమణి ” అన్నీ బాగానే జరుగుతున్నాయి ” మెల్లగా భయంగా సమాధానమిచ్చింది అర్చన, ” జాగ్రత్త ” అంటూ బయటికి వెళ్తున్న నాగమణి కళ్ళల్లో ఆగ్రహం పెల్లుబికింది, అక్కడే నిలుచున్న రేఖకు, నాగమణి వాలకంలో అనుమానం కలిగింది, ” అర్చన, ఏంటి..అత్తగారు కోపంతో వెళుతున్నారు, ఏదైనా తప్పు చేసావా ” అడిగింది రేఖ ” అవును అమ్మ గారు చాలా పెద్ద తప్పు చేశాను ” అర్చన బాధగానే సమాధానం చెప్పింది. ” ఏం చేశావు ” అని ఆతృతగా అడిగింది రేఖ. ” అబ్బే ఏం లేదు అమ్మ గారు, సిలిండర్లో గ్యాస్ లీక్ అయితే పేలిపోతుందని, దానికున్న నాబ్ ను సరిగా తిప్పాలని జాగ్రత్త చెప్పి వెళ్ళింది అంతే ” అంది అర్చన ” సర్లే ఈరోజు ఒకటో తారీకు ,ఇదిగో నీ జీతం డబ్బులు, రేపు నెల నుండి ఇంకా ఐదు వందలు పెంచుతున్నాను, దీనికి మా ఆయన ఒప్పుకోలేదు, నేనే బలవంతంగా ఒప్పించాను, ఎందుకంటే మా ఆయన ప్రాణాలు కాపాడింది నీవు, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అర్చన ” చివరి మాటకు రేఖ కళ్ళు చెమ్మగిల్లాయి, అర్చన కళ్ళలో నుండి నీళ్ళు జలజల రాలిపోయాయి. మళ్లీ ఆశ్చర్యపడింది రేఖ. ” అర్చన ఏంటిది ఊరుకో, ప్రతి నెల జీతం డబ్బులు తీసుకున్నప్పుడల్లా ఏడుస్తుంటావు అసలేం జరిగింది ” ఆతృతగా అడిగింది లేఖ. ” ఏమీ లేదు అమ్మ గారు మా అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు ” అని కన్నీళ్ళు తుడుచుకుంటూ, పక్కకు తిరిగి, అర్చన వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ” మేమంతా లేమా అర్చనా, ప్రతి సారీ ఎందుకు బాధ పడతావు ధైర్యంగా ఉండు ” అంటూ భుజంతట్టి హాల్లోకి నడిచింది రేఖ.
రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రేఖ కళ్లు తిరిగి పడిపోయింది. హడావిడిగా హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు, డాక్టర్ పరీక్ష చేసి నెలసరి ఆగిందని, కడుపు పండిందని, సంతోషకరమైన వార్త చెప్పాడు, అది రవికి, నాగమణికి, మింగుడు పడలేదు, కొద్దిరోజుల తర్వాత, రేఖ పెరట్లో తులసి మొక్కకు పూజ చేస్తూ ఉంది, అర్చన వసారాలో నుండి వంటగదిలోకి వెళుతూ ఉండగా, బెడ్ రూమ్ లో నుండి ఏవో గుసగుసలు వినిపించాయి, వెళ్లి కిటికీ వద్ద నిలబడింది అర్చన, ” ఎలాగైనా రేఖా పీడ వదిలించుకొని మరో పెళ్లి చేసుకుని, హ్యాపీ గా ఉండాలని” తల్లి కొడుకు అనుకుంటుండగా అర్చన వినింది, పాలల్లో విషం కలిపి కడుపు నొప్పితో చనిపోయిందని, పుకార్లు పుట్టించి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు, ఈ విషయం రేఖతో చెప్పింది అర్చన, ” పొరబడుతున్నావు అర్చన, అత్తగారి మీద నాకు నమ్మకం ఉంది, పెళ్లి అయిన దగ్గర్నుంచి పల్లెత్తు మాట కూడా అనలేదు, నీవు పొరబాటుగా విన్నట్టు ఉన్నావ్ ” అంటూ తేలిగ్గా తీసిపారేస్తూ ముందుకు అడుగేసిన రేఖ కాళ్లు అమాంతం పట్టుకుంది అర్చన, ” ప్లీజ్ అమ్మ గారు. నేను చెప్పేది నిజం. ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి ఇప్పుడే వస్తాను ” అంటూ అర్చన పరుగుతో వెళ్లి, పెరట్లో పాతిపెట్టిన తాళిబొట్టు, కాలి మెట్లు, నల్లపూసల దండ తెచ్చి రేఖకు చూపించింది, రేఖకు ఏమీ అర్థం కాలేదు, ” దేనికివి? ” ఆశ్చర్యంగా అడిగింది లేఖ, ” చెప్తాను అమ్మగారు, వివరంగా చెప్తాను, నేను చెప్పిన తర్వాత అయినా, ఆ విషం పాలు తాగడం మానేయండి, మానేస్తారు కదూ ” అంటూ గతాన్ని వివరించడం మొదలు పెట్టింది అర్చన.
అర్చన వాళ్ళది చాలా పేద కుటుంబం, వాళ్ళ అమ్మానాన్న కూలి పనికి వెళ్తే గాని ఇంట్లో జరగడం కష్టం, అయినా కూడా అర్చనను చదివిస్తున్నారు, కాలేజీకి వెళ్లే రోజుల్లో రవి తనకు పరిచయం అయ్యాడు, రోజులు జరగగా, అర్చన తల్లిదండ్రులతో కూడా ఒద్దికగా ఉండసాగాడు, వాళ్లతో బాగా పరిచయం పెంచుకున్నాడు, అంతేకాదు తను ప్రేమిస్తున్న సంగతి నిదానంగా చెప్పాడు, అమితమైన ఇష్టం పెంచుకున్నాడు, అసలు విషయం అర్చన తల్లిదండ్రులకు చెప్పేశాడు, ” మీరు గొప్ప వాళ్ళు, డబ్బున్నవాళ్ళు, మేము పేదవాళ్లం ” అని అర్చన తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా రవి వినలేదు, పైసా ఆశించకుండా పెళ్లి చేసుకుంటానని అన్నాడు, ఎలాగోలాగా అర్చనను రవి చివరికి పెళ్లి చేసుకున్నాడు,
ఇది వినేసరికి రేఖ చలించిపోయింది ” అంటే నువ్వు ” ఆశ్చర్యంగా అడిగింది రేఖ ” నేను రవి మొదటి భార్యను ” అంతే రేఖ ఆశ్చర్యం అవధులు దాటింది, ఇక మాట్లాడ లేక నోరు మూగబోయింది ” త త తర్వాత ” అంది తొట్రుపాటు గా. ” పెళ్లి జరిగి కనీసం నెలలు కూడా కాలేదు, కుటుంబాన్ని పట్టణానికి మార్చేశాడు, అప్పుడప్పుడు మా అమ్మ నాన్న వచ్చి వెళ్ళేవాళ్ళు, రానురాను రవి లో చాలా మార్పు వచ్చింది, తాగుడుకు బానిసయ్యాడు, చెడు వ్యసనాలకు లోనయ్యాడు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశాడు, పెళ్లికి ముందు చేసిన వాగ్దానాలు తుంగలోకి తొక్కి వేశాడు, నన్ను ఒక ఆట బొమ్మల ఆడుకున్నాడు. వంటింటి కుందేలుగా మార్చేశాడు, అదనపు డబ్బు కోసం నన్నే కాకుండా మా అమ్మానాన్నను కూడా చాలా హింస పెట్టాడు. అది భరించలేక వాళ్లు ఉరి వేసుకొని చనిపోయారు ” అంటూ అర్చన కన్నీరు మున్నీరుగా విలపించింది. కాస్త ఊపిరి పీల్చుకొని మళ్ళీ చెప్పడం ప్రారంభించింది ” మరో పెళ్లి చేసుకోవడానికి సమాయత్తమై, మీ సంబంధం కుదిరిన తర్వాత, ఒక రోజు ఆ ఊరికి దూరంగా ఉన్నా, ముత్యాలమ్మ గుడి దగ్గరకు తీసుకువెళ్లారు, అక్కడికి వెళ్ళిన తరవాత, బలవంతం పై నన్ను బెదిరించి, మెడలో తాళిబొట్టు, కాలి మెట్లు, నల్లపూసల దండ, తొలగించి చేతిలో పెట్టారు, నన్ను కన్యగా మార్చేశారు, పని మనిషిలా పడుండమన్నారు. గృహ నిర్బంధంలో ఉంచారు, ప్రాణాలు మిగిలి ఉంటే, ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో, పనిమనిషిగా కాలం వెళ్లబుచ్చుతున్నాను ” అంటూ అంగలార్చింది అర్చన,
అంతలోపే నాగమణి బయటికి వచ్చి ” అమ్మ రేఖ, ఎక్కడికి వెళ్ళావ్ ఇంతసేపు, అలా తిరిగితే ఎలాగమ్మా ,అందులోనూ వట్టి మనిషివి కూడా కాదు, ఇదిగో పాలు చల్లార్పి తెచ్చాను తాగు ” ఎంతో ఆప్యాయత నటిస్తూ పాలగ్లాసు రేఖకు అందించబోయింది నాగమణి, ” పరవాలేదు అత్తయ్య, అక్కడ పెట్టండి, తరువాత తాగుతాను ” అంటూ మేడ గదిలోకి నడిచింది రేఖ, ఫోన్ రిసీవర్ అందుకుంది, ముందుగా మహిళా సంఘం అధ్యక్షులు విజయలక్ష్మికి, తరువాత పోలీస్ స్టేషన్ కు, ఆ తర్వాత పాత్రికేయ బృందానికి, తన ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేసి పిలిపించింది.
ఒకే సారి అందరూ రావడంతో అవాక్కయ్యారు రవి నాగమణి, ముందుగా అత్తగారు కలిపిన పాలగ్లాసు, డాక్టర్ సుధారాణి పరిశీలించగా, అందులో విషం ఉందని తేలింది, తర్వాత అర్చన మంగళ సూత్రం, కాలి మెట్లు, ఎస్సై కి చూపించి. తనకు జరిగిన దారుణం అక్కడున్న వారందరికీ వివరించింది, విజయలక్ష్మి ఆవేశం అవధులు దాటగా.. నాగమణి జుట్టుపట్టి బజారుకు లాగింది, ఈ విషయంలో వారు ఎంత ప్రాధేయపడినా వదల్లేదు, ఉన్న ఆస్తులు ఇద్దరు భార్యలకు చెరిసగం రాసేసి, వాళ్లు మాత్రం జైలులో ఊసలు లెక్కపెడుతూ కూర్చున్నారు, ఇప్పుడు అర్చన పని మనిషి కాదు సొంత ఇంటి మనిషి,

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!