నేను ఎక్కడ?

(అంశం:: “సాధించిన విజయం”)

నేను ఎక్కడ?

రచన :: పి. వి. యన్. కృష్ణవేణి

ఎదుటివాళ్లు  నన్ను చూసే దృష్టి ని బట్టీ నా స్థానం వాళ్ల మనసులో ఉంటుంది.

నా మనసులో మాత్రం నా స్థానం ఎప్పటికీ పదిలమే. ఎప్పటికీ ఉన్నత మైనదే.

అమ్మనాన్న దగ్గర ఒక మంచి కూతురుగా, అన్నయ్య దగ్గర ఒక గారాల చెల్లి గా, చుట్టాల దగ్గర ఒక మంచి చురుకైన అమ్మాయిగా, స్నేహితల దగ్గర తెలివైన ఫ్రెండ్ గా, టీచర్ల మనసులో బాగా చదివే విద్యార్ధి గా నాకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్నాను.

ఆ గుర్తింపులు  పొందడం కోసం నేను ప్రత్యేకం గా చేసింది ఏమి లేకపోవచ్చు. కానీ వారి అందరి ప్రేమ పొందగలిగాను.

ఇంకా కాలేజీలో అడుగుపెట్టాక కూడా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనే నిలిపారు. లెక్చరర్ల దగ్గర  కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నా అనే చెప్పాలి.

చదువులో విజయం సాధించిన నన్ను చూసి, మా అమ్మనాన్న కన్నుల్లో దీపావళి కాంతులు వెల్లి విరిసిన ఆ వేళ, నాకింకా గుండెల్లో మదురంగా ఓ మెరుపు మెరుస్తుంది.

అంత ఉన్నతంగా, అదీ  కాలేజి లో నెగ్గుకు రావటం ఎంత కష్టమైన పనో ఆ స్థానం లో ఎదిగిన వారికే తెలుస్తుంది.

తర్వాత పెళ్లి, పిల్లలు. వారి ఆలనా పాలనా చూస్తూ, నన్ను నేను మరచిపోయిన రోజున కూడా అందరి మనసుల్లో నా స్థానం విలువ పెరిగింది అనే చెప్పాలి.

కానీ, పిల్లలను చూసుకోవడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఆరోగ్య సమస్యలు తట్టుకున్నానో  నాకు మాత్రమే తెలుసు.

పిల్లల పెళ్లిళ్లు, వాళ్ళ ఫంక్షన్ లు అన్నీ చేస్తునప్పుడు, నేను పిలిచిన వారు అందరూ వచ్చి, నన్ను అందరూ మెచ్చుకుంటుంటే, ఆ సంతోషం ఎంతని చెప్పను.

అప్పటి సందర్భంలో ఆ  ఆనందం కోసమే కదా అందరూ తపన పడేది అనుకుంటూ నవ్వుకుంటున్నాను.

కానీ ఆ విజయం కూడా నేను అనుకున్నట్టుగా మరువలేని అనుభూతిని అందించలేదు.

మనసు నిండా దిగులు, ఇంకా ఏదో సాధించాలన్న తపన, మనసులోతుల్లో నిండి ఉన్న వేదన. కారణం తెలియదు, కానీ కన్నీరు వస్తాయి. ఏంటో నాలో ఈ సంఘర్షణకు కారణం ఆలోచనల్లో పడ్డాను.

ఇంతలో మా వారి పిలుపు. కౌసల్య నీకు ఫోన్ అని.

వెళ్లి ఫోన్ మాట్లాడి వచ్చిన నాకు ఆనందానికి అవధులు లేవు.

ఏంటి అంటారా, నేను సరదాగా రాసే కధలు, కవితలు, వ్యాసాలు అన్నీ మా వారు నాకు తెలియకుండా పత్రిక ప్రింటింగ్ కి ఇవ్వడం, అవి పబ్లిష్ అయ్యి, నా ఫ్రెండు మెచ్చుకుంటూ నాకు చేసిన ఫోన్ కాల్ అది.

నా ఉనికినే మర్చి పోయిన నేను, మళ్లీ నా కోసం నేను బతకటం మొదలుపెట్టాలి అనుకున్నాను.

మా వారికి థాంక్సండి అని చెప్పాను నెమ్మదిగా.

తను నవ్వి, నీకు ఇంకో సర్ ప్రైజ్ అన్నారు.

నేను ఆశ్చర్యం గా తననే చూస్తున్నాను.

తను ఒక సర్టిఫికెట్ తెచ్చి నా చేతి లో ఉంచారు.

ఏంటా అని ఆత్రంగా తెరిచిన నాకు నిజంగా హ్యాపీ నే.

నేను పిల్లలకి సంగీతం, డాన్స్, డ్రాయింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పటం కోసం, సొంతంగా కాలేజ్ పెట్టటం అనే నా కల తీర్చడం కోసం మా వారు కష్టపడి తెచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఎయిడెడ్ సర్టిఫికెట్ అది.

నా మనసు లో భాద అర్థం చేసుకుని, నాలో కళ లని గుర్తించి, నాకు సహాయం అందిస్తున్న,  తన స్థానం నా మదిలో నిలిచిపొయింది.

అందరి మదిలో నా స్థానం పెంచడానికి, తను చేసే ఈ సాయం వల్ల , నా గడిచిపోయిన జీవితం మళ్లీ  నాకు తిరిగి  వచ్చినంత సంతోషం గా ఉంది.

నేను కోరుకుంటున్నంత గొప్ప విజయం ఇది కాకపోవచ్చు కానీ, నా మనసు అలజడిని తగ్గించి, నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించి, నాకు ఆనందం కలిగించింది ఈ విజయం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!