పాఠం నేర్పిన రూపాయి (యధార్థ గాథ)

(అంశం:: “సాధించిన విజయం”)

పాఠం నేర్పిన రూపాయి (యధార్థ గాథ)

రచన :: పద్మావతి తల్లోజు

అవి నేను మూడవ తరగతి చదివే రోజులు. తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే మా నాన్నగారు తన ఆఫీస్ పని తప్ప మా చదువు గురించి పట్టించుకునేవారు కాదు. అసలు మేం ఏం చదువుతున్నామో కూడా ఆయనకు తెలిసేది కాదు.

                ఆ టైం లో మా కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో కానీ.., మా పెద్దన్నయ్యకు బ్లెడ్ క్యాన్సర్ అటాక్ అయింది. విపరీతమైన ఖర్చు, మెంటల్ టెన్షన్ తో, ఇంట్లో అమ్మ కూడా నన్ను పట్టించుకోవడమే మానేశారు. ఎక్కువ శాతం నేను మా ఇంటి ఓనర్ వాళ్ళ ఇంట్లోనే కాలక్షేపం చేసేదాన్ని.

                    వారి ఒక్కగానొక్క కూతురు భర్తనీ వదిలేసి,పుట్టింట్లోనే ఉండేది. ఆవిడకు సినిమాల పిచ్చి! నన్ను వెంటబెట్టుకొని సినిమాలకి వెళ్ళేది. తన ఒక్కదానికే టికెట్టు తీసుకునీ,థియేటర్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్లగానే చటుక్కున నన్నులేపి చంకలో వేసుకునేది.(అప్పుడు మరీ సన్నగా,పీలగా ఉండేదాన్ని లెండి!) అంటే నాకు ఫ్రీ అన్నమాట! అలా ఆవిడ వెంట వెళ్లి చూసిన సినిమాలే, ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు.

                 విధి మమ్మల్ని చిన్నచూపు చూసింది!మా అన్నను మానుండి దూరం చేసింది. ఆ బాధలో మా అమ్మ అక్కడ ఉండలేక, నన్ను తీసుకొని మా సొంత ఊరు వచ్చేసింది. మళ్లీ నాకు కొత్త స్కూలు… కొత్త జీవితం మొదలయ్యాయి. కొత్త స్కూల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరికి సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో స్కూల్ టాపర్ అనిపించుకున్నాను.

                    మధ్య మధ్యలో మాత్రం సినిమాలు చూడాలని మాత్రం బలంగా అనిపించేది.అలవాటైన ప్రాణం కదా! నేను 8 వ తరగతిలో ఉండగా… ఓ రోజు! మా అమ్మను

            ” సినిమాకి వెళ్తాను. ఒక రూపాయి ఇవ్వమ్మ” అని అడిగాను. అప్పుడు నేల టికెట్ ఒక రూపాయి మాత్రమే!

                నా సినిమాల పిచ్చితో చిర్రెత్తుకొచ్చిన మా అమ్మ” నేను ఇవ్వను. పెద్దదానివి అవుతున్నావు. ఇప్పటికైనా., ఆ సినిమాల పిచ్చి వదులుకో! లేదంటే నీ బతుకు కూడా ఆ ఓనర్ కూతురులా అవుతుంది” అని కసిరింది.

            ” ఒక్క రూపాయి ఇవ్వడానికే ఇన్ని మాటలు అంటున్నావేంటి?” అని కోపంగా అరిచాను నేను.

               ” సంపాదిస్తే తెలుస్తుంది రూపాయి విలువ. డబ్బులు ఏమన్నా చెట్లకి కాస్తున్నాయి అనుకున్నావా?” అని మా అమ్మ నాకు క్లాసు పీకింది.

                 చిన్న కూతురునీ కావడంతో గారాబంగా పెరిగాను. మాటంటే పడేదాన్ని కాదు.ఆ ఉక్రోషంలో అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. చచ్చినా  ఇక ముందు ఎవరి దగ్గర చేయి చాపకూడదని.

               వెంటనే చుట్టుపక్కల నాలుగిళ్లలోకి వెళ్లి “ట్యూషన్స్ చెబుతున్నాను. మీ పిల్లల్ని పంపించండి.” అని చెప్పి వచ్చాను.

               “నువ్వు చదివేదే, ఎయిత్ క్లాస్ ట్యూషన్స్ ఏంటి?” అని కొద్దిమంది నవ్వినా కూడా సెవెంత్ బోర్డ్ ఎగ్జామ్స్ లో స్కూల్ టాపర్ ని కాబట్టి, తమ పిల్లల్ని పంపించడం మొదలు పెట్టారు.

             అలా అలా 10 మంది పిల్లలు జమయ్యారు. ప్రతిఒకరి దగ్గర పది రూపాయలు ఫీజు తీసుకునే దాన్ని. ఐదవ తరగతి లోపు పిల్లలే అందరూ! అందులో ఇద్దరు పిల్లలు, పూర్తిగా పూటగడవని వారు. వారిద్దరికీ ఫ్రీగా చదువు చెప్పేదాన్ని.

మొదటి నెల 80 రూపాయలు వచ్చాయి. సినిమా కోసమే నా సంపాదన మొదలైంది కాబట్టి, వాటితో ఫ్యామిలీ మొత్తాన్ని సినిమాకు తీసుకెల్దామని అనుకున్నాను.ఆ మాటే అమ్మతో చెప్తే అంది కదా…

           “కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇది.ఎప్పటికీ నీకు గుర్తుగా ఉండేలా ఏదైనా వస్తువు కొనుక్కో! సినిమా ఇప్పుడు చూస్తే కొన్ని రోజుల్లో మర్చిపోతాం. మొదటి సంపాదన అమూల్యమైనది! దానిని ఇలా సరదాల కోసం ఎందుకు ఖర్చు చేస్తావ్” అంది.

            ఆ మాట నా మనసును తాకింది. అందులో పది రూపాయలు దేవుని హుండీలో వేశాను. మిగిలిన 70 రూపాయలతో ఒక వాల్ క్లాక్ కొన్నాను. అమ్మ చెప్పినట్టుగానే, అందులో టైం చూస్తున్నప్పుడల్లా ఒక మధురానుభూతికి లోనయ్యేదాన్ని. ఇంటికి ఎవరు వచ్చినా అమ్మ వాళ్ళు అడగకపోయినా “మా పద్మ! మొదటి సంపాదనతో ఈ గడియారం కొన్నది” అని గర్వంగా చెప్పేది:

               అలా రెండేళ్ళు ట్యూషన్లు చెప్పి, నా పేరు మీద ఇంకొన్ని వస్తువులు కొన్నాను.  సినిమాలకు మాత్రం ఖర్చు పెట్టలేదు. ఇప్పటికీ ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను. గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం వచ్చిన మావారి… అప్రెంటిస్ పీరియడ్ లో  కూడా.. నా పొదుపు వల్ల ఆర్థిక కష్టాలు మమ్మల్ని ఎక్కువగా బాధించలేదు. పెళ్లి తర్వాత కూడా దాదాపు ఓ పదేళ్లు ట్యూషన్స్ చెప్పి మావారి సంపాదనకు వేడి నీళ్లకు,చన్నీల్లలా తోడు అయ్యాను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!