చిల్లరకొట్టు కిట్టయ్య

చిల్లరకొట్టు కిట్టయ్య

రచయిత: పరిమళ కళ్యాణ్

ఇప్పుడంటే వీధికో షాపు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, ఇంకా ఆన్లైన్ బజార్లు అన్నీ వచ్చాక చిల్లరకొట్టు సంగతే మర్చిపోతున్నారు ఈతరం చిన్న పిల్లలు.

చిల్లరకొట్టు అనగానే గుర్తొచ్చేది మా ఊర్లో ఉండే చిల్లర కొట్టు కిట్టయ్య. మా సందు చివర కాకావారి ఇడ్లీ హోటల్ ఉండేది. పేరుకే హోటల్ అయినా అది చాలా చిన్నది మన వంటిల్లు అంత ఉంటుంది. ఆ హోటల్ పక్కనే ఉండేది కిట్టయ్య చిల్లరకొట్టు.

కిట్టయ్య మా వయసు వాడే. చిన్నతనంలో బాగానే ఆడేవాడు. కానీ పాపం కిట్టయ్యకి పుట్టినప్పటి నుంచే ఏదో మానసిక లోపం ఉంది. దాంతో మేము పెరిగి పెద్దైనా కిట్టయ్య మాత్రం ఆ లోపం వల్ల చిన్న పిల్లాడిలా ఉండిపోయాడు.

చదువు అబ్బని కిట్టయ్యనీ వాళ్ల అమ్మ తనతో పాటు కొట్టుకి తీసుకుని వెళ్ళేది. జాగ్రత్తగా అన్ని విషయాలు చెప్పి, కొట్లో ఉండే సరుకులు అన్నీ చెప్పేది.

ఎంత చెప్పినా కిట్టయ్య బుర్రకి ఏమీ ఎక్కేది కాదు. వాళ్లఅమ్మ ఎప్పుడైనా కిట్టయ్యని కొట్లో పెట్టీ, ఇంటికి వెళ్ళేది ఏదైనా పని మీద. ఈలోగా ఎవరోకరు వచ్చి, ఏదోకటి డబ్బులు ఇవ్వకుండా తీసుకుని వెళ్ళిపోయేవారు.

కిట్టయ్య అమాయకత్వం చూసి ఊర్లో అందరూ, చివరికి నా స్నేహితులు కూడా అతన్ని చాలా హేళన చేసేవారు. అంతేకాదు నా స్నేహితులు చాలా మంది కిట్టయ్య కొట్లో వాళ్ల అమ్మ లేనప్పుడు, వెళ్ళి కిట్టయ్యని మాటల్లో పెట్టీ, వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకుని పోయేవారు. వాళ్ల అమ్మ తిరిగి రాగానే, విషయం తెలుసుకుని కిట్టయ్యని చితక్కొట్టేది, బాగా తిట్టేది. జరిగే విషయాన్ని నక్కి నక్కి చూసే నా స్నేహితులు కిట్టయ్యని చూసి నవ్వుకునేవారు.

మా బామ్మ పిల్లలందరినీ బాగా తిట్టేది. “ఒరేయ్ వెధవ సన్నాసుల్లారా, ఎందుకురా వాడిని అలా ఏడిపిస్తూ ఉంటారు ఎప్పుడూ? మీరు చేసేది తప్పు కాదు పాపం. ఆ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు. పొండి వెధవల్లారా!” అని తిట్టేది.

మా బామ్మ నోటికి భయపడి వాళ్ళు పారిపోయే వాళ్లు. నాకెందుకో వాళ్ళలాగా అల్లరి చెయ్యాలి అనిపించేది కానీ, కిట్టయ్య విషయంలో మాత్రం వాళ్ళలా ఉండలేక పోయేవాడిని. వాళ్ళు చేసే ప్రతి అల్లరి పనికి వద్దని చెప్పేవాడిని.

ఆ వయసు ప్రభావంతో వాళ్ళు నా మాట వినేవాళ్ళు కాదు. ఏమాట కామాట కిట్టయ్య కొట్లో సరుకులు బాగుండేవి. మిఠాయిలు మాత్రం చాలా రుచిగా ఉండేవి. వాటిలో స్పెషల్ కిట్టయ్య వాళ్ళమ్మ చేసే రేగొడియాలు, చక్కిలాలు. వాటికోసం తెగ ఆరాట పడే వాళ్ళం.

ఏదైనా పండగలకి కిట్టయ్య వాళ్ళమ్మని మా బామ్మ ఇంటికి పిలిచి పిండి వంటలు చేయించేది. ఆవిడ చేత్తో చేసిన ఏవైనా మంచి రుచిగా ఉండేవి. అందుకే చాలా మంది ఫంక్షన్లకు ఆవిడతో చేయించుకునేవారు.

క్రమంగా మేము అందరం పెరిగి పెద్దయి ఉద్యోగాలు కూడా సంపాదించాము. కిట్టయ్యని ఏడిపించిన నా స్నేహితులు కొందరు కూడా జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారు.

నా ఇంటర్ అవ్వగానే ఎంబీబీఎస్ చెయ్యటానికి విదేశాలకు పంపేసారు మా నాన్నగారు. ఆ తర్వాత MD అయ్యేవరకు ఇక్కడికి పెద్దగా వచ్చింది లేదు. మధ్యలో సెలవులకు ఓసారి వచ్చి వెళ్ళేవాడిని కానీ బయటకి వెళ్ళేవాడ్ని కాదు.

ఇన్నేళ్లలో ఊర్లో ఎన్నో మార్పులు. పల్లెటూరు కాస్తా సిటీలా మారిపోయింది మా ఊరు. మా చిన్నప్పుడు ఊరికి ఒకే ప్రైవేట్ స్కూల్ ఉండేది, కానీ ఇప్పుడు వీధికి ఒకటి వచ్చాయి. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ తో బ్లాక్ అండ్ వైట్ లో ఉండే మా ఊరు, కలర్లోకి వచ్చేసింది.

మా నాన్న గారికి నన్ను డాక్టర్ని చేసి ఊర్లోనే హాస్పిటల్ పెట్టించి, బీదలకు, కార్పొరేట్ హాస్పిటళ్లలో డబ్బు కట్టలేని వారికి, ఉచిత వైద్యం అందించాలని ఆయన ఆశయం. ఆయన మాటకోసమే నేను నా చదువు పూర్తికాగానే ఊర్లో హాస్పిటల్ పెట్టాలి అని ఇక్కడికి వచ్చాను. నా అంబిషన్ తెలిసిన నా క్లాస్మెట్స్ నలుగురు నాతో పాటు ఊర్లో ఉచిత వైద్యం చెయ్యటానికి వచ్చారు.

మా స్నేహితులం అందరం కలిసినప్పుడు ఎప్పుడో మాటల్లో ఒకసారి చిల్లర కొట్టు కిట్టయ్యని గుర్తు చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అక్కడ కొట్టు లేదు, వాళ్ళు ఈ ఊర్లోనే లేరు.

మా బామ్మని అడిగితే కిట్టయ్యకి పెళ్ళి అయ్యిందని, వేరే ఊరు వెళ్లిపోయారని చెప్పింది. నిజమే అనుకొని, పోనీలే ఇప్పటికైనా బాగుంటే చాలు అనుకున్నాను.

కెనడాలో మెడికల్ సైకాలజీలో ఎండి చేసిన నేను ఊర్లో హాస్పిటల్ పెట్టి, మానసిక రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని అనుకున్నాను. పెట్టిన కొద్ది కాలానికే మా హాస్పిటలుకి మంచి పేరు వచ్చింది. దానికి కారణం నాతో పాటు వచ్చిన మా డాక్టర్లు, ఇంకా స్టాఫ్ అంతా ఎంతో కృషి చెయ్యటం. పేషెంట్లని స్నేహంగా చూడటం, వాళ్ళకి నచ్చిన వాతావరణాన్ని కలిగించడం.

మా ఊరే కాకుండా చుట్టుపక్కల ఊర్లకి కూడా మా హాస్పిటల్ పేరు తెలియడంతో, అక్కడినుంచీ కూడా పేషెంట్లు వచ్చేవారు. అలా ఓరోజు వచ్చిన పేషెంటుని చూసి షాక్ అయ్యాను. ఆ పేషెంట్ ఎవరో కాదు కిట్టయ్య, అదే మా చిల్లర కొట్టు కిట్టయ్య.

ఆ తీస్తే తెలిసిన వివరాలు ఏంటంటే… కిట్టయ్యకి పెళ్లి చేస్తే కాస్త సర్దుకుంటాడు అని ఎవరో చెప్పారట, అందుకని పెళ్ళి చెయ్యాలని చూసినా ఉన్న ఊర్లో అందరూ వేళాకోళం చేయటంతో ఊరిని వదిలి వెళ్లిపోయారట. ఎవరో తెలిసిన అమ్మాయితో పెళ్లి చేశారట. కానీ కిట్టయ్య వ్యాధి నయం కాకపోగా ఎక్కువ అయ్యిందట.

దాంతో ఇంట్లో నుంచీ ఎవరికి చెప్పకుండా బయటకి వచ్చేసాడట. కిట్టయ్య కోసం ఊరంతా వెతికించారట వాళ్ళ మనుషులు. పదిహేను రోజుల తర్వాత వేరే ఊర్లో చెట్టు కింద, ఆహారంలేక, బలహీనంగా పడిపోయి, మాసిపోయిన అవతారంలో కనిపించడంతో వెంటనే నా హాస్పిటల్ గురించీ తెలిసి, ఇక్కడికి తీసుకుని వచ్చారట.

కిట్టయ్య గురించి తెలిసిన తర్వాత నా గుండెల్లో ఎదో ముల్లు గుచ్చుకున్నట్టు అయ్యింది. ఎలాగైనా అతన్ని నా హాస్పిటల్లోనే ఉంచి, ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటానని, కిట్టయ్యకి తొందరలోనే నయం అవుతుందని వాళ్ళకి ధైర్యం చెప్పాను. తనని ఎలాగైనా మములువాడిని చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నా చదువుకు సంబంధించిన, తన కేసుకు సంబంధించిన పుస్తకాలు, వివరాలు అన్నీ చదవటం మొదలు పెట్టాను.

కిట్టయ్య గురించీ ఇంట్లో చెప్పినప్పుడు, నాన్నా, బామ్మ కూడా కిట్టయ్యకి నయం అవుతుందని, నేను చెయ్యగలను అనీ, నాకు ధైర్యం చెప్పారు.

దేవుడిపై భారం వేసి తనకి ట్రీట్మెంట్ మొదలుపెట్టాను.

***

You May Also Like

4 thoughts on “చిల్లరకొట్టు కిట్టయ్య

  1. చాలా బాగుంది చెల్లి. ఆ డాక్టర్ మంచి పని చేసాడు. మంచి ప్రయత్నం👏👏👏👍😊🌹🌹

  2. 👌👌👌 అక్క కథ చాలా చాలా బాగుంది 👍😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!