ప్రత్యేకత

ప్రత్యేకత

రచన::సావిత్రి కోవూరు

సాయంత్రం ఏడు గంటలకు ఆనంద ఆఫీస్ నుండి వచ్చేసరికి లాస్య కనిపించలేదు.

“లాస్యా, లాస్యా ఎక్కడున్నావ్” అంటూ ఇల్లంతా తిరిగి చూసేసరికి బాల్కనీలో కూర్చుని బయటకు చూస్తూ దీర్ఘాలోచనలో మునిగి ఉంది. దగ్గరకు వెళ్ళేవరకు తనను గమనించలేదు లాస్య.

“వచ్చారా సారీ నేను చూడలేదు. లేటయ్యింది కదా. ఒకే సారి బోంచేస్తారా? టిఫిన్ తేనా” అన్నది.

“అది సరే కాని ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు” అన్నాడు.

“ఏం లేదండి ఊరికే కూర్చున్నాను” అన్నది డల్ గా.

“ఏమైంది ఎందుకలా ఉన్నావ్” అన్నాడు.

“వరలక్ష్మీ వ్రతం పేరంటానికి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చావా” అన్నాడు ఆనంద్

“వెళ్ళొచ్చాను” అన్నది నెమ్మదిగా.

“అదీ సంగతి. నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వు డల్ గా ఉన్నావు, అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చావని తెలుస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చినప్పుడల్లా నువ్వు డల్ గా ఉండడం అవసరమా చెప్పు. హాయిగా ఫ్రెండ్ ని కలిసి వచ్చావు. సంతోషంగా ఉండాలి కానీ నీవు ఎందుకు అలా ఉంటావో నాకు అర్థం కాదు.” అన్నాడు.

“అది కాదండీ వాళ్ళ దేవుడి గది ఎంత చక్కగా అలంకరించుకుంది. అందరి దేవుళ్ళ ఫోటోలకు రంగు రంగుల పూల మాలలు వేసింది. రంగురంగుల లైట్లు అలంకరించింది. రెండు పెద్ద పెద్ద దీపపు గుత్తులు పైకప్పు నుండి గొలుసులతో వేలాడదీసి దీపాలు పెట్టింది. ఎంత బాగున్నాయో. అన్ని ఫోటోలు ఒకే సైజు ఉన్నవి. దేవుని విగ్రహాలు కూడా ఒకే సైజులో ఉన్నాయి. దేవుని దగ్గర పాత్రలు మిల మిల మెరుస్తున్నాయి. నేల కూడా మెరుస్తూ ఉందండి. అసలు ఆ గదిని చూస్తేనే భక్తి భావం పుట్టుకొస్తుందంటే నమ్మండి.

ఇక అమ్మవారి అలంకరణ చెప్పనలవి కాదు. వెండి కలశంపై కొబ్బరికాయ పెట్టారు. కొబ్బరికాయకు కళ్ళు, ముక్కు, నోరు పసుపుతో చేసి, ఎర్రని పెద్ద బొట్టు, పట్టు చీర, ముక్కు పోగు, నగలు, పెద్ద పూల జడ, జడ కుప్పెలు, పాపిట బిళ్ళ, తలలో నాగరం, జడపువ్వు మొదలైనవన్నీ పెట్టి ఎంత బాగా అలంకరించారు.

నిర్మల ఇల్లు కూడా నీట్ గా ఉంటుంది. వంటింట్లో డబ్బాలన్ని ఒకే రకంగా ఒకే సైజువి కొన్నదండి. వంటిల్లు కూడా ఎంత బావుందో.

ఇక బట్టల సంగతి చెప్పనే అక్కర్లేదు షాపుల్లో మడతలు పెట్టినట్టు చక్కగా మడతలు పెట్టి బీరువాలో పెట్టుకున్నదండి. ఇంట్లో అక్కడ అక్కడ డెకరేషన్ పీసెస్ అసలు ఎంత బాగా అలంకరించుకుందో. ఇండోర్ ప్లాంట్స్, మనీప్లాంట్ ఎంత బాగ పెరిగాయో.

అసలు ఇంటి ముందర ఉన్న ప్లేస్ లో ఎన్ని రకాల పూల చెట్లు పెట్టుకుందో చెప్పలేను. అసలు వాళ్ళింటికి వెళ్తేనే ఎంతో బాగా అనిపిస్తుందండి. అసలు నిర్మల టేస్టే వేరు.

వాళ్ళ ఇంటి నుండి మన ఇంటికి రాగానే ఒకలాంటి స్తబ్దత ఏర్పడుతుంది నాలో. నేనెందుకు అలా చేయలేక పోతున్నాను. అసలు తనకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది. అన్ని పూలు కోసి, అన్ని మాలలు గ్రుచ్చి దేవుళ్లకు వేయడానికి. మొదట వాళ్ళ ఆయన ఒక గంట పూజ చేస్తాడట. తర్వాత తాను ఒక గంట పూజ చేసుకుంటుందట.

ప్రతి పండక్కి స్పెషల్ గా పూజలు చేస్తారు. పారాయణాలు పూజలు నడుస్తూనే ఉంటాయి.  రెండింటికీ భోజనాలు చేస్తారట. ఏంటో అంత శ్రద్ధ నాకైతే లేదు” అన్నది దిగులుగా.

“చూడు లాస్య ఇలా అంటున్నానని ఆమెను కామెంట్ చేస్తున్నానని అనుకోకు. ఆమె ఊరిలో పెరిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళు చేసే విధానం అంతా చూసింది. అంతే కాకుండా ఆమె పోద్దునే ఉరుకులు పరుగులు పెడ్తూ వెళ్ళి ఉద్యోగం చేయటం లేదు. అలా అని ఆమెను అవమానించడం లేదు. ఎవరెవరి ఇంటి పరిస్థితులు,అభిరుచులను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. ఆమె ఉద్యోగం చేయడం లేదు కనుక ఆమెకు ఉన్న వ్యాపక మంత ఇంటిని ఎలా అలంకరించుకోవాలి అనీ, మంచిగా వంట చేయడం ఎలా అనీ, సాంప్రదాయాలు పాటించడం ఎలా అనీ వీటిపైన ఆమె శ్రద్ధ చూపెడుతుంది.

ఇంటిని చక్కగా అలంకరించుకోవడం, షాపింగ్ చేయడం, చేతి నిండా డబ్బులుంటాయి కనుక, ఇంటికి కావలసినవి ఎప్పుడు అంటే అప్పుడు వెళ్లి, ఎలా కావాలంటే అలా తెచ్చుకొని వాటిని అలంకరించడం ఆమె ధ్యాసంతా ఇల్లు, ఇంట్లోని మనుషులపైననే ఉంటది.

లేదంటే హాయిగా టీవీ చూడటం, మధ్యాహ్నం హాయిగా కాసేపు నిద్రపోవడం.ఆ అదృష్టం అందరికీ లభించదు.

ఇక నీ సంగతి చూసుకో మీ అమ్మ వాళ్లకు దూరంగా ఉండి చదువుకున్నావు. కాబట్టి ఇంట్లో ఏం చేస్తున్నారు, ఏంటి అన్నది నువ్వు అసలు చూడలేదు. చదువు తర్వాత పెళ్లి, పిల్లలు. నీవు మాత్రం ఖాళీగా ఎప్పుడున్నావు.

పెళ్లయిన, పిల్లలైనా చదవాపకుండ, ఇంటిపనులు చేసుకుంటూ,  పిల్లలను పెంచుకుంటూనే డిగ్రీ కంప్లీట్ చేశావు, పీజీ కంప్లీట్ చేశావు, ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నావు.

ఉద్యోగం కొరకు బీహెచ్ఈఎల్ నుండి సిటీకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్లీ ఇంటికొచ్చి ఇంట్లో వంట పని, పిల్లల పని చేశావు కదా. ఉద్యోగం చేస్తూనే పిల్లలను చూసుకుంటూనే వాళ్ల పెళ్ళిళ్ళు, పేరంటాలు,  అన్ని కంప్లీట్ చేశావు.

నీ బాధ్యతలన్ని సక్రమంగా చేసావు. నీవు మన పిల్లలకు కుట్టిన డ్రస్సులు చూసి, మన చుట్టాలు, ఫ్రెండ్స్ ఎంత మెచ్చుకుంటారు. నీవు పిల్లలకు చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళు అయిందాక నీవే కదా డ్రెస్సులుకుట్టావు.  ఎంత బాగ కుట్టే దానివి.

మరి నీకు ఆ ఆర్ట్ ఉంది చేతిలో. ఆమెకు డెకరేషన్ ఆర్ట్ ఉంది చేతిలో. అందరు ఒక్కలా వుండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అన్ని అందరికి రావు.

మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి నీవు ఆత్మన్యూనతకు గురై బాధపడుతుంటే నేను చూడలేను. మన ఇల్లు కూడా ఎక్కడి వస్తువులు అక్కడ నీట్ గానే ఉంటాయి. మనం కూడా మనకు తగ్గట్టు అలంకరించుకుంటాము.

ఉదయం ఏడు గంటలకు బయలుదేరి ముప్పై  కిలోమీటర్లు ప్రయాణం చేసి జాబ్ చేసే  నీకు, పూజలు పునస్కారాలకు టైం ఎక్కడ దొరుకుతుంది చెప్పు. ఇంట్లో ఉండే వాళ్ళతో  నిన్ను నీవు పోల్చుకుని నీ మనస్సు చిన్నగా చేసుకోకు. నీలాగా ఆమె ఉండ లేదు. ఆమె లాగా నీవు ఉండలేవు.

ఆమెకు బోలెడు టైం మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటుంది. కనుక  పిల్లలు వచ్చిన తర్వాత వాళ్లతో కబుర్లు చెబుతూ కావలసినవి అన్నీ చేసి పెడుతూ సంతోషంగా గడుపుతోంది. నీవు అంత దూరం ప్రయాణం చేసి వచ్చి పిల్లలతో మాట్లాడటానికి కూడ టైం ఉండక, వెంటనే వంట పని, రేపటి ప్రిపరేషన్. నీ లోకమే వేరు. అందుకని నీవు చేసే ఉద్యోగం ఆమె చేయట్లేదు, ఆమె చేసే ఉద్యోగం నువ్వు చేయట్లేదు.

ఆమె ఇంటిని చూసి ఆనందిస్తే  మంచిదే. కాని ఇన్ఫీయారిటీకి లోను కావద్దు. ఈ భూమి పైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆమెకు ఇంటి డెకరేషన్ చేసుకునే స్పెషాలిటీ ఉంది. పూజగది అలంకరణ స్పెషాలిటీ ఉంది. నీకు డ్రెస్ మేకింగ్ కెపాసిటీ ఉంది. ఉద్యోగం చేసే కెపాసిటీ ఉన్నది. కనుక నీ దారి వేరు, ఆమె దారి వేరు.

ఆమెను చూసి సంతోషపడు. మెచ్చుకొని సంతోషం పంచు. అంతేగాని నిన్ను నీవు చిన్నబుచ్చుకుని బాధపడకు. ఆమె ఇంటిని చూసి ఆనందించు అంతేకానీ నువ్వు బాధ పడితే నేను చూడలేను.” అన్నాడు ఆనంద్.

“మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారండి మనుషులను. కొందరైతే ఆవిడ ఇల్లు చూడు, మన ఇల్లు చూడు ఎలా ఉంది, అని వెక్కిరిస్తారు. కానీ మీరు నన్ను అర్థం చేసుకుని, అర్థమయ్యేలాగా ఎంత చక్కగా చెప్పారు. సరే ఎవరిని చూసి ఇంక నేను బాధ పడకుండా, నన్ను నేనే తీర్చిదిద్దుకుంటాను” అన్నది తేలికైన మనసుతో లాస్య.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!