ప్రేమా ప్రేమా

(అంశం ::”ప్రేమ”)

ప్రేమా ప్రేమా

రచయిత్రి పేరు – మంగు కృష్ణకుమారి

“నా కర్మ ఈ సంసారం, ఈ పిల్లలు, అన్నిటికన్నా ఈ మొగుడూ!” కసిగా, కోపంగా అరుస్తున్నాది సరస్వతి.

రమణమూర్తి తక్కువ తినలేదు. “ఇంతోటి మిస్ ఇండియాకి, ఎవరురావాలనో? కథా నాయకుడు రావాలి కాబోలు? పులుసులో ఉప్పు ఎంత వేయాలో తెలీదు”

“అందుకే కాబోలు తాగేసారు, మీరు మీ పిల్లలూ” వెటకారంగా చేతులు తిప్పింది సరస్వతి.

“మరేం చెయ్యాలి? ఓ కూర, పప్పు ఏదీ వండవు. ఇన్నేళ్ళయినా, మొగుడు ఎంతతింటాడో,
కొడుకు ఎంత తింటాడో తెలీదు. అయితే గిన్నెలకి గిన్నెలు వండి‌ పడేస్తావ్! లేదంటే పిడతడు చేస్తావ్! సవ్యంగా ఒక్కరోజు వండేవా?” రమణమూర్తి విసుర్లు.

పక్కింట్లోంచి వినడుతున్న సంవాదానికి సుస్మిత “ఏమిటత్తా, నేను ఎప్పుడు వచ్చినా వినిపిస్తూ ఉంటుంది. దెబ్బలాడుకుంటూనే ఉంటారు వాళ్ళు” అంది భారతితో.

భారతి పకాలున నవ్వి అంది. “సుస్మీ, మొన్న ‘ప్రేమ పెళ్ళిళ్ళే మంచివి’ అని నాతో వాదించేవు కదే? నీకో నిజం చెప్తా, విను” అంది.

“ఏమిటత్తా!” సుస్మిత

“మా పక్కింటి రమణమూర్తి గారు, సరస్వతి గారు ప్రేమించుకొని పెద్దలకి ఇష్టం లేకపోతే, ధిక్కరించి వాళ్ళకి తెలీకుండా పెళ్ళి చేసుకొని దండలతో వెళ్ళేరుట” భారతి చెప్పింది.

“ఆఁ నిజంగానే?” నోరు వెళ్ళబెట్టింది సుస్మిత.

“అవును. వాళ్ళకి మొదట కొడుకు
పుట్టినప్పుడు పెద్దవాళ్ళు క్షమించి పిల్లడికోసం వీళ్ళని కలుపుకున్నారుట”

“అయితే, మరెందుకు అలా ఎప్పుడు
చూసినా దెబ్బలాడుకుంటారు?”
సుస్మిత అడిగింది.

“అదే ప్రేమవేరు, కాపురం వేరూను. కలిసి బతకడానికి కావలసినది
కొన్ని అలవాట్లు భోజనాల దగ్గర కలవాలి. ఒకరు శాకాహారి, మరొకరు
మాంసాహారి అయితే అసంతృప్తులూ
చికాకులూ వస్తాయి. అలాగని అందరూ
ఇలా అవుతార‌నుకోకు. కాంప్రమైజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు.
ఇలా దెబ్బలాడుకున్నా సరే, వీళ్ళమధ్య చాలా ప్రేమ ఉంది”

పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళలో మాత్రం తగువులు ఉండవా, అత్తా” సుస్మిత అన్నాది‌.

“ఎవరన్నారే? తప్పకుండా ఉంటాయి. ప్రేమ దంపతులకయితే, పెళ్ళి
తరవాత ఉండాలి. అసలు ప్రేమ కేవలం భార్యా భర్తలకే చెంది‌న
విషయం కాదు. ఏ బంధం అయినా
ప్రేమతో ముడిపడ్డదే… ప్రేమ లేకుండా
ఒక చూపు చూస్తే పసిపిల్లలు కూడా
ఎదుటివాళ్ళ దగ్గరకి వెళ్ళరు. అదీ ప్రేమ
సత్తా!” భారతి చెప్తుంటే, రమణమూర్తి
పరుగెత్తుకుంటూ వచ్చేడు. “అమ్మా, మా ఆవిడ కళ్ళు తిరిగి
పడిపోయింది. ఒక్కసారి రారూ?” అంటూ ఉంటే అతని వెనకాతలే
భారతి, సుస్మిత పరిగెత్తేరు.

సరస్వతి మొహం మీద నీళ్ళు జల్లి ఉల్లి వాసన ఆమెకి చూపిస్తూ ఉంటే
తెలివి వచ్చింది సరస్వతికి.

రమణమూర్తి గబగబా కాఫీకలుపుతూ ఉంటే భారతి వెళ్ళి కాఫీ గ్లాసులో పోసి “వదినగారూ, కొంచెం కాఫీతాగండి, ఓపిక వస్తుంది” అంటూ
కాఫీగ్లాసు చేతిలో ఉంచింది.

సరస్వతీ “ఈయన ఏరీ?” అంటూ దిక్కులు చూస్తున్నాది. రమణమూర్తి గమ్మున వచ్చి, “సరసూ ముందు కాఫీతాగు. పిల్లలు వచ్చేవేళయింది.
కంగారు పడతారు” అంటూ సరస్వతి
భుజాల చుట్టూ చేతులు వేసి కాఫీ తాగించడం మొదలెట్టేడు.

“మేం వస్తాం అన్నగారూ… వదిన గారూ కాఫీతాగి కాసేపు
పడుకోండి! రాత్రికి నేను అన్నం, కూరా చేసి తెస్తాను” అంది
“మీకెందుకమ్మా శ్రమ!” అని రమణమూర్తి అంటున్నా వినకుండా
“నయం ఇరుగు పొరుగు ఉన్నది ఎందుకు? ఇలాంటప్పుడు సాయపడ్డానికే కదా!” అంటూ నడిచింది భారతి.

“నీకూ మనుషులంటే ప్రేమ ఎక్కువే
అత్తా!” గొణిగింది సుస్మిత.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!