ప్రేమ ఖైది

(అంశం::”ప్రేమ”)

ప్రేమ ఖైది

రచయిత :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)
chaitra sri

చింతచెట్టు కొమ్మలు తుఫాను గాలికి ఊగుతూ ఉండగా చెట్టు మీద కోతులు భయంతో అరుస్తున్నాయి.సూరీడు మబ్బుల చాటుకి చేరే సాయం సమయమైనా వర్షాకాలమవడంతో చీకటి కమ్ముకొనేసింది.ఆ దారిలో బిక్కు బిక్కుమంటూ వడివడిగా అడుగులేస్తున్న చిట్టి ఉన్నట్లుండి గట్టిగా కేకేసింది.ఎదురుగా ఉన్న దుకాణాదారులు వచ్చి ఏమైందని అడిగారు.కుక్క చున్నీని లాగేసింది అనడంతో వెళ్ళిపోయారు.ఆ దుకాణాల్లో పని చేసే పవన్ మాత్రం ఆ అమ్మాయి భయపడిపోయి ఉందని గ్రహించి మా షాపు దగ్గరకి రా కాసేపు కూర్చొని గాలి తగ్గాక వెళ్దువు గానీ అంటూ కొంచెం అభిమానంగా మాట్లాడాడు.చిట్టి ఏం కాలేదు కాలికి కొంచెం గీక్కుంది అంతే నేను ఇంటికి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయింది. చిట్టి రెండిళ్ళలో పాచిపని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచిన పద్దెనిమిదేళ్ళ అమ్మాయి. పేదరికంలో నలిగిపోతూ అనుభవిస్తున్న కష్టాల ముందు కుక్క గీకిన గాటు లెక్కలోకి రాని అభాగ్యురాలు. పవన్ చూపించిన అభిమానానికి చిట్టి గుండె ఆర్థ్రతతో నిండింది ఎందుకంటే అంత అభిమానంగా మాట్లాడేవారు కరువైన జీవితం కదా.
పదిళ్ళలో పని చేసుకొనే తల్లి కసురుతో కూడిన మాటలు,తాగుబోతు తండ్రి విసురు మాటలు విని విని
ప్రేమ ,ఆప్యాయతలకు ఆమడ దూరంలో బతుకుతున్న చిట్టి ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలా ఉంటుంది.
చిట్టి ఇంటికెళ్ళి కుక్క గీకిన చోట ఫౌడర్ రాసుకుంటుండగా అమ్మ కాంతమ్మ చూసి ఏమైందే అని అడిగింది.వచ్చే దారిలో కుక్క కాలిపై గీకింది , చున్నీని నమిలేసింది అని చెప్పడంతో చూసుకొని కదా వచ్చేది.సరేలే రేపు గవర్మెంట్ ఆస్పత్రికెళ్ళి ఇంజక్షన్ వేయిస్తా కాని.ఆయింట్ మెంట్ తెచ్చుకో వెళ్ళి అంటూ ఇరవై రూపాయలు చేతిలో పెట్టింది.వాన ఇంకా స్టార్ట్ కాలేదు.చిట్టి దగ్గర్లో ఉన్న షాపులో ఆయింట్ మెంట్ అడిగింది.అక్కడ అబ్బాయి ముప్పై ఐదు రూపాయలు అడిగాడు.చిట్టి ఇరవైరూపాయలే ఉంది అని ఆ అబ్బాయి వైపు చూసింది.అతనెవరో కాదు ఇంతకు ముందు కనిపించిన పవనే.పవన్ కూడా గుర్తుపట్టి అమ్మాయి నువ్వు ఇందాక ఏంకాలేదన్నావ్.చిల్లర రేపిస్తువులే కాని నీళ్ళల్లో తడవకు అంటూ సలహా ఇచ్చి ఇరవై తీసుకున్నాడు.ఇంతలో జోరువాన మొదలైపోయింది. చిట్టి వాన తగ్గే వరకు అక్కడే ఉండాలనుకుంది.పవన్ స్టూల్ వేసి కూర్చో తగ్గాక వెళ్తువ్ అన్నాడు.చిట్టి షాపు మీదేనా అని అడిగింది. లేదు నేను పనిచేస్తున్నాను పదివేలిస్తారు అని చెప్పాడు పవన్ .అవునా నిజంగా పదివేలిస్తారా అని అడిగింది చిట్టి .హా నిజంగానే ఇస్తారు అని పవన్ అనడంతో నాకు ఏదైనా షాపులో పని చూస్తావా అని అడిగింది చిట్టి.ఏం చదువుకున్నావ్ అని అడిగాడు.చిట్టి “పది పాసయ్యా రాజారావు ఇంట్లో పనికెళ్తున్నా” అని చెప్పడంతో పవన్ “ఇంటరన్నా చదవాలి లేకపోతే మా ఓనర్ ఒప్పుకోడు.సరే నేను ఎలాగోలా సెట్ చేస్తాలే.మధ్యలో మానేయకూడదు” అన్నాడు.ఈ షాపులోనేనా సరే మాట్లాడు అని చెప్పి చిట్టి వెళ్ళిపోయింది.
కాంతమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉండగా తన భర్త రాజయ్య వచ్చి కాలితో ఒక్క తన్ను తన్నడంతో పొయ్యి మీద పాత్రలు గోడకు తగిలి బద్దలయ్యాయి.ఏమయ్యా రోజూ తాగొచ్చి గొడవ చేయడం తప్ప ఇళ్ళు ఎలా గడుస్తుందో పట్టించుకోవా అంటూ కాంతమ్మ కోపంగా రాజయ్య చెంపలు వాయించేసింది.మత్తు వదిలిందో ఏమో రాజయ్య ఏమే కాంతం ఇంక మొందు ముట్టనే నీ మీదొట్టు అంటూ మంచం మీద పడుకొనేశాడు.చిట్టి ఇదంతా చూసి అమ్మా నేను ఎక్కువ సంపాదిస్తే నాయన డబ్బియ్యకపోయినా పరవాలేదు ,నువ్వు కూడా కొన్నిళ్ళళ్ళోనే పని చేస్తే సరిపోద్ది అని చెప్పింది.ఎక్కువ ఎట్టా సంపాదిస్తావే తిక్కదానా అని మొట్టకాయ వేసింది.నేను పది పాసయ్యానమ్మా పదివేలయినా సంపాదించనా అనడంతో అబ్బా పదేలా..! ఈమి పెద్దాఫీసరనీ పదేలిస్తారు అంటూ దెప్పిపొడిచింది.
చిట్టి రెండు మూడు రోజులు వరుసగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు విక్స్ బిళ్ళలకెళ్ళినట్టు సాకుతో పవన్ తో మాట్లాడి వస్తుండేది.పవన్ చిట్టి తనని ఇష్టపడి మాట్లాడడానికి వస్తుందనుకొని ఇంకొంచెం క్లోజ్ గా మువ్ అయి మెడికల్ షాపులో చేర్చేశాడు.పవన్ ప్రేమగా మాట్లాడుతుండడంతో చిట్టి కూడా క్లోజ్ అయింది.ఇద్దరూ షాపు అయిపోయాక చెట్టాపట్టాలేసుకొని తిరగడం ,ఆప్యాయతతో మాట్లాడే తోడు దొరకడంతో ఇంట్లో పడే బాధల్ని చిట్టి మరిచిపోయింది.కొన్ని రోజులయ్యాక పవన్ చిట్టి పార్క్ లో కూర్చొని “చిట్టి నువ్వంటే నాకిష్టం .ఐ లవ్ యు “అంటూ చేతులు పట్టుకున్నాడు.చేతులు విదిలించిన చిట్టి మా ఫ్యామిలీ గురించి తెలుసా పవన్ నాన్న తాగుబోతు,అమ్మ గయ్యాళి ఇలాంటి కుటుంబంలో నువ్వు ఇమడలేవు.దయచేసి మనం ఫ్రెండ్స్ గానే ఉందాం అని చిట్టి ఒప్పుకోక పోవడంతో పవన్ “సరేకానీ మా కుటుంబం గురించి ఇంతకుముందు నేను చెప్పినవన్నీ అబద్ధాలే.నువ్వు నన్ను లవ్ చేస్తున్నాను అంటేనే నిజం చెప్తా అంటూ బెదిరించాడు.దానికి చిట్టి “ఏదో ఒకటి చెప్పి ఐ లవ్ యు చెప్పించుకుందాం అనుకుంటున్నావేమో నేను పడను అంటూ చిట్టి గర్వాన్ని చూపించడంతో పవన్ “నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు.నా గురించి నీకు నిజాలు చెప్తే నువ్వు నాతో మాట్లాడేదానివి కాదు అందుకే నా గురించి చెప్పలేదు.నేను నీ క్లాస్ మేట్ ని.నువ్వూ నేనూ విద్యాభారతిలో చదువుకున్నాం. నువ్వు బాగా చదివేదానివి.అదే మీ అమ్మ పనిచేసే ప్రిన్సిపాల్ బళ్ళో.అప్పటి నుంచే మీ కష్టాలను నేను చూశాను.నిన్ను ఆరోజు చింతచెట్టు దగ్గర చూసినప్పుడే గుర్తుపట్టా.నువ్వంటే అభిమానంతో నీకు హెల్ప్ చేశా.నీ ఫ్యామిలీ పరిస్థితి చూశాక,నువ్వు చదువుకి దూరమయ్యావని అర్థమైంది.నీ టాలెంట్ నాకు లేదు చిట్టి.మనిద్దరం పెళ్ళి చేసుకున్నాక నిన్ను బాగా చదివిస్తా .మంచి ఉద్యోగంలో నిన్ను చూడాలని ఆశ అంటూ అసలు విషయం చెప్పాడు.చిట్టి అంటే నా మీద జాలితో ఐ లవ్ యూ చెప్తున్నావా అంది. “కాదు చిట్టి నువ్వంటే నిజంగా ఇష్టం” అంటూ గట్టిగా కౌగిలించుకుని నుదిటిపై ముద్దు పెట్టాడు.చిట్టి కూడా ఐ లవ్ యూ అంటూ తొలిముద్దు పెట్టేసింది.

వీళ్ళ సంగతి అంతా తెలిసిపోయాక కాంతమ్మ చీపురు కట్ట తిరగేసి చిట్టిని చితక్కొట్టేసి గదిలో పెట్టి తాళమేసేసింది.రెండురోజుల తర్వాత పక్కింటి పద్మ వచ్చి “చిట్టి…నీకో విషయం చెప్పనా ..!పవన్ ఎవరనుకుంటున్నావ్ దుబాయ్ లో ఉన్న మీ అత్త కొడుకు.ఆ షాపింగ్ కాంప్లెక్సే పవన్ ది.నీ కోసం అక్కడ పని చేస్తున్నట్లు ఓనర్ తో మాట్లాడి సెట్ చేశాడు.నువ్వంటే పిచ్చి ప్రేమ వాడికి.ఈరోజు మీ వాళ్ళతో మాట్లాడుతానని చెప్పాడు .హ్యాపీగా ఉండు “అంటూ ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది.పవన్ అనుకున్నట్లుగానే రాజయ్య కాంతమ్మలను కూర్చో బెట్టి పెద్దల సమక్షంలో పెళ్ళిసంబంధం మాట్లాడి చిట్టితో పెళ్ళికి రెడీ అయిపోయాడు.
చిన్నతనం నుంచి మామ కూతురి ప్రేమకి బంధీయైన పవన్ చిట్టి ఆస్థిపరుడంటే ఆమడదూరముంటుందని తెలిసి ,ప్రేమకి ఆస్థి అంతస్తులు అడ్డుకావనీ, ఆ పేద కుటుంబం అసహాయతను పట్టించుకోకుండా,వాళ్ళ యొక్క సమస్యలన్నింటినీ తీర్చడానికి పవన్ చేసిన ప్రయత్నం సఫలమై చిట్టికోసం ప్రేమఖైదీ అయ్యాడు.
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!