నువ్వు నేను ప్రేమ

(అంశం::” ప్రేమ”)

 నువ్వు నేను ప్రేమ

రచయిత: వడ్ల పాండురంగాచారి

ఆదివారం వారపత్రిక చదువుకుంటూ హాల్లో కూర్చున్న బడితెల వరుణ్ కు, “అబ్బా..” అన్న చిన్నపాటి అరుపు వినిపించింది. ‘ఏమైందో?!’ అనుకుంటూ హాల్లో నుండి పడక గదిలోకి వెళ్ళాక అర్థం అయ్యింది, ‘ఆ అరుపు, వాళ్ళావిడ శ్రావ్య కాలికి మెట్టెలు తొడుక్కుంటూ అది గీరుకుపోవడంతో అరిచిన అరుపని’.
వరుణ్ వెళ్లి మంచం మీద కూర్చుని ఆ మెట్టెలు ఆమె చేతిలో నుండి తాను తీసుకుని ఆమె పాదాలను తన ఒడిలో పెట్టుకుంటూ “కాలి పగుళ్లు తగ్గినట్టున్నాయిగా?” అన్నాడు.

“ఈ కరోనా సమయంలో వద్దు అని నేను అంటున్నా, వినకుండా బయటకు వెళ్లి ఎక్కడ ఎక్కడ తిరిగి తెచ్చారో నా కోసంగాని, మీ ప్రేమ వల్లే కాబోలు రెండ్రోజుల్లో తగ్గిపోయింది” అంది శ్రావ్య నెమ్మదిగా కుడి కాలి వేలికి ఆ మెట్టెలు తొడుగుతూన్న వరుణ్ ని చూస్తూ.

వరుణ్ “వెళ్ళక ఏం చేయమంటావు మరి, పగిలిన కాళ్లతో నొప్పితో నడుస్తూ నువ్వు బాధ పడుతుంటే అలాగే కూర్చోమంటావా? ” అన్నాడు కాళ్ళు అలాగే పట్టుకుని చూస్తూ.

మెట్టెలు తొడిగాక కూడా తన కాళ్ళని ఆలాగే పట్టుకుని చేతితో స్పృశిస్తున్న వరుణ్ చేతిలో నుండి తన కాళ్ళని తీసుకుని మెట్టెల వైపు చూస్తూ ” పెళ్ళైన రెండేళ్లకు నీకు మెట్టెలు తొడగడం వచ్చిందా బావా?” అంది ఆటపట్టిస్తూ.

“మరి పెళ్లప్పుడు అంటే ఏదో తొందర, ఉత్సాహం నాకుకూడా పెళ్లి అయిపోతుందని, ఆ ఆత్రంలో సరిగా తొడగడం రాలేదు, ఇప్పుడు ఆలా కాదుగా” అన్నాడు వరుణ్.

“అవునవును.. రెండడుగులు వేయగానే వేలి నుండి ఊడిపోయాయిగా ఆత్రం పెళ్లి కొడకా..” అంది శ్రావ్య పెళ్లి అప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి నవ్వుతూ.

“ఎప్పుడు పడిపోయిందో. ఎక్కడ పడేసుకున్నావో నీకు కూడా తెలియకపొతే నేనేగా వెతికి తెచ్చింది మొద్దు పిల్లా.. ” అన్నాడు వరుణ్ శ్రావ్య నవ్వులు తన నవ్వులు కలుపుతూ.

“అప్పుడే రెండేళ్లు అయ్యిందా బావా మన పెళ్లి జరిగి?” అంది శ్రావ్య పరిగెడుతున్న రోజుల వేగాన్నిలెక్కేసుకుంటూ. ముద్దొచ్చినపుడు వరుణ్ ఇంటి పేరును కూడా కలిపి షార్ట్కట్ గా బావా అని పిలవడంశ్రావ్యకి అలవాటు.

“ప్రేమలో పడితే అంతే కాలం తెలియదు,” అన్నాడు పెళ్లి అయినా రోజు నుండీ తమ మధ్య జరిగిన సంఘటనలు ఒక్కోటి గుర్తొస్తుంటే.

“తల్లిదండ్రుల ప్రేమ తప్ప, వేరే ప్రేమల మీద అసలు నమ్మకమే లేని నన్ను, స్నేహితులకు పెళ్లిళ్లు అవుతుంటే అసలు పరిచయమే లేని వ్యక్తితో ఒకే ఇంట్లో ఒకే గదిలో అలా ఎలా కలిసి ఉండగలరు అని అనుకునే నన్ను, మీ ప్రేమలో నన్నే మరిచిపోయేలా చేసారు”. అంది శ్రావ్య వరుణ్ కళ్ళల్లోకి చూస్తూ.

“ఇంకా ఏమేం చేశాను?”శ్రావ్య మాట్లాడుతుంటే ఆసక్తిగా ఇంకా ఎం చెప్తుందో విందాం అని ఆసక్తిగా అన్నాడు వరుణ్ శ్రావ్య ఒడిలో పడుకుంటూ.

“ఎన్ని సార్లు చెప్పినా ఎంత చెప్పినా నీ ప్రేమ గురించి తక్కువే బావా… నన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రం చెప్పవు, చేసేవన్నీ చేసేస్తావు, నాకు ఇష్టం అయినవన్నీ. అసలు నేను ఏ బాధ పడకుండా చూసుకుంటావు. ఆరోజు నాకు చిన్న జ్వరం వస్తే, నీకే వచ్చినంత బాధపడిపోయి, చిన్న పిల్లాడిలా నానా హంగామా చేసేసి నన్నుకూడా కంగారు పెట్టేసావు. ఆ కంగారులో నాకు జ్వరం ఎప్పుడు తగ్గిపోయిందో కూడా తెలీలేదు.” అంది శ్రావ్య తన చేతులతో వరుణ్ చెంపల మీద తడుముతూ.

“నువ్వు మాత్రం తక్కువా, మీ అమ్మావాళ్లు ఎన్నిసార్లు పుట్టింటికి రమ్మని పిలిచినా వెళ్ళలేదు, నన్నొదిలి ఉండడం నీకు ఇష్టం లేక”.

“హ్మ్మ్.. అక్కడికి వెళ్లినా మీ గురించే దిగులు.. అందుకే వెళ్ళను.”

వాళ్ళు అలా కబుర్లలో ఉండగానే మెయిల్ నోటిఫికేషన్ వచ్చిన శబ్దం విని తన ఫోన్ తీసుకుని చూస్తే, నిన్న శ్రావ్య సాంపిల్స్ కలెక్ట్ చేసుకుని వెళ్లిన ల్యాబ్ నుండి. ఓపెన్ చేసి “పాజిటివ్” అని చూసి ఎగిరి గంతేశాడు. “ఏమైంది బావా?” అని అడుగుతున్న శ్రావ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పుదాము అనుకునే ఆలోచనని విరమించుకుని తన చేతులు పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ కనురెప్పలు మూసి తెరిచాడు “అవును” అన్నట్లుగా. మరో ఆరు నెలల్లో వాళ్ళ ప్రేమకి ప్రతిరూపం వాళ్ళ ముందుకు రాబోతుంది అని సంతోషం పట్టలేక గట్టిగా అరిచేస్తోంది శ్రావ్య వరుణ్ తో కలిసి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!