చుంభన మేళా

మా అత్తమామలకి
ఒక్కగానొక్క కొడుకు
వాడిని చూడంగానే
అందరికీ వణుకు
ముట్టుకుంటే ఏడుస్తాడు
ముద్దు పెట్టుకుంటే అరుస్తాడు
ఎత్తుకుంటే కరుస్తాడు
ఒళ్లోకి తీసుకుంటే తడిపేస్తాడు
పాపం…
మురిపాలాటలో
అరటిపండు వాడు
ముద్దుల మమకారం
తెలియక కేర్ మంటాడు
ఎవరు దగ్గరికొచ్చినా బేర్ మంటాడు
ఎంతైనా
నా అంత అదృష్టం లేనోడు
బోసి నవ్వులతో ఆకట్టుకోవడమే
తెలియని అమాయకుడు
అందుకే అందరికీ నేనే ముద్దు
నన్ను చూడంగానే వాళ్ల ప్రేమకు
ఉండదు ఇక హద్దు
ఇంటికొచ్చి మరీ ఎదురుచూస్తారు
డైపర్ వేయంగానే ఎత్తుకుపోతారు
రోజంతా ఆడిస్తారు
రెస్ట్ లేకుండా నవ్విస్తారు
తిన్నదంతా అరిగించేసి
కడుపుకింత పెట్టమంటే
ఏడ్చి చస్తారు… ఉత్తి పిసినారులు
మేకప్ కోసం మాత్రం
అంకుళ్ల జేబులు ఖాళీ చేయిస్తారు…
అదంతా తెచ్చి
నా ఒంటికి అంటిస్తారు
ముద్దుల వర్షంలో తడిపేసి
బురదంతా నా మీద వదిలేస్తారు
అమ్మ చేతికి బోలెడు పని అప్పజెబుతారు
ఏదైతేనేం
అలుపెరుగని ఆనందాలు నావి
అవస్తలు మాత్రం అంకుళ్లవి
అందుకే వాళ్లంతా కలిసి
నా పేరుకో తోక తగిలించారు
కృష్ణను ముద్దుకృష్ణగా మార్చేశారు
రచన: కుమార్ నాగేంద్ర
