ఏమాయెనో
రచయిత:నవీన్ చంద్ర హోతా
ఏమాయెనో
ఆ మేఘం చిందించిన నీరు…
ఏమాయెనో
ఎడతెగక కురిసిన నింగి పన్నీరు…
ఏమాయెనో
ఆకసం అందించిన అమృత ధారలు…
ఎర్రగా కాగిన నేలపై పడగానే ఆవిరాయెనా…
నెర్రెలిచ్చిన భూమాత ఒడిలోకి చల్లగా జారిపోయెనా…
ఇంకిన చేలల్లో మెత్తగా పాకే పాములా చప్పుడు చేయక జారిపోయెనా…
పట్టుకోవడం చేతకాని మనుషులంటూ
పాదరసము మల్లె చిక్కకుంటూ
ఉరికి ఉరికి సంద్రంలో కలిసిపోయిందా…
అయ్యో మేఘుడా…
నీవిచ్చిన నీటి అందమంతా
అడవి కాసిన వెన్నెలాయే…
సాగరాన కలిసి ఉప్పు నీటి చందమాయే…!!