సరిగమల సారణి మా ధరణీ (కవిత సమీక్ష)

సరిగమల సారణి మా ధరణీ (కవిత సమీక్ష)

సమీక్ష: దొడ్డపనేని శ్రీ విద్య

విస్సాప్రగడ పద్మావతి గారు.. మీ సరిగమల పారాణి మా ధరణి కవిత అత్యద్భుతం. మీ కవితా వర్ణన సాహిత్యానికీ కొత్త హంగులు, అందాన్ని సంతరించుకుంది. ధరణి నుదుట కుంకుమ సూర్య చంద్రులు, సెలయేరులే, నీటి వడ్డాణాలు, వాగు వంకలు అరవంకీలు… ఓహ్ నిత్య నూతనం మీ కవితా సోయగం. కాళ్ళ పారాణి రంగులు, మబ్బుల పలకరింపులతో మరిసింది కవితా లోకం. సూర్య కిరణాల వెలుగులో మీ అక్షరాలు వజ్రాల్లా వెలిగి పోయాయి. చిరు జల్లులలో సాహిత్యం తడిసి ముద్ధయింది . కృష్ణమ్మ గోదారి పరవళ్ళు లా మా మది మీ కవిత్వ పరిమళం లో ఆస్వాదించి మురిసిపోయింది…. కవిత్వం ఆద్యంతం అలరించింది.. ధరణి ని ఆభరణాల తో పెళ్ళి కూతురు లా ముస్తాబు చేసిన తీరు ఎంతో ముచ్చట గొలిపింది. ఇలానే ఎన్నో రచనలు చేసి మమ్ములను ఆనంద పరుస్తారని ఆశిస్తు… కవిత్వ లోకాన నాకు మీరే ఇన్సిపిరేషన్. నాకు చాలా బాగా నచ్చింది మీ కవిత.

మీ కవితా మిత్రురాలు… దొడ్డపనేని శ్రీ విద్య.

***************************************

కవిత: సరిగమల సారణి మా ధరణీ
రచన: విస్సాప్రగడ పద్మావతి

సూర్యకిరణాలు నేలను తాకగానే
పుడమి తల్లి పులకరించి
పచ్చని పంట పొలాలతో
ఆకుపచ్చని చీరను చుట్టి
కాళ్ల పారాణిగా రంగురంగుల
పూబంతుల సోయగాలు అలమి
మబ్బుల పలకరింపుల
చిరుజల్లుల సవ్వడితో మురిసి
కోటానుకోట్ల జంతు జీవాలకు
పుట్టినిల్లు నీవే కదా
అలసి సొలసిన నీకు
పసుపు కుంకుమల గగనం
నీనుదుట సింధూరం
సూర్యచంద్రులే
నీకు మకుటాలు
ఇంద్రధనస్సుల సోయగాలే
నీకు మణి హారాలు
కృష్ణమ్మ, గోదారమ్మ పరవళ్ళు
నీకు ముక్కు పుడకలు
చిందేసే సెలయేరుల ఒంపుసొంపులే
నీకు వడ్డాణాలు
వాగు వంకలే నీకు అరవంకీలు
సప్తసముద్రాల హోరు
నీకు ఓంకార నాదాలు
రమణీయమైన శోభ గల వనాలు
నీకు నిత్యనూతన నందన వనాలు
శిఖి పింఛాల ఆనంద నాట్యాలు
నీ ముంగిట ముత్యాలు
పక్షుల కిలకిల రావాలే
నీకు సరిగమల విన్యాసాలు
పాడి పంటల సిరులే
నీకు ఆనందతాండవాలు
ప్రకృతి అందాలన్నీ నీలోనే నింపుకున్న
అందాల భరిణి
ఊసుల సారణి
వేదాలకు పారాణి
పాడి పంటల మాగాణి
ఋణం తీర్చుకోలేని
అందాల మన ధరణి

***************************

You May Also Like

2 thoughts on “సరిగమల సారణి మా ధరణీ (కవిత సమీక్ష)

  1. ప్రకృతి పులకించే వర్ణన కవిత,
    ఎప్పుడు వీక్షించాలా అనేట్టు సమీక్ష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!