నీలో ఉన్న నీవు (పాట సమీక్ష)

 నీలో ఉన్న నీవు (పాట సమీక్ష)

సమీక్ష: పరిమళ కళ్యాణ్

సినిమా: గమ్యం

పాట: ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు

ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు

సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాటలోని సారాన్ని సారాంశాన్ని మనం తీసుకుంటే, నీ జీవన ప్రయాణం గురించి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎందుకోసం నువ్వు జీవిస్తున్నావు అని ఆలోచించకు. ఎందుకంటే నీ ప్రయాణం ఎంతవరకు రాసి పెట్టి ఉంటే ఆలోపు నీకు కావలసినవి తెలుసుకుంటావు, నీ గమ్యాన్ని నువ్వు చేరతావు.
అసలు ప్రపంచం అన్నది నీలోనే ఉందని ఎప్పుడు తెలుసుకుంటావు? అని ప్రశ్నిస్తారు రచయిత. అదే తెలిస్తే నువ్వెళ్ళిన ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుంటావు కదా! అంటారు.

కనపడేవెన్నెన్ని కెరటాలు…
మనకి కనిపించేది కెరటాలు, అలలు విడివిడిగా ఉన్నా కూడా వాటన్నిటినీ కలగలిపి సముద్రం అనే పిలుస్తారు కానీ, అల గా ఎవరూ పిలవరు. అంటే మనం అందరం మనుషులం, నువ్వైనా నేనైనా, ప్రత్యేకంగా నిన్ను నన్ను చెప్పరు, మనుషులు, ఈ మనుషులు అంటారు. గాలి, వెలుతురు, మన్ను, మిన్ను, నీరు అన్నీ పంచభూతాలు. ఇవన్నీ నీలోనే ఉన్నాయి కదా? అంటారు.

అసలైన మనిషి నీ హృదయం లో ఉన్న నువ్వే. అద్దంలో ప్రతిబింబం, బయట చూసిన ప్రతిబింబాలు ఏమీ నువ్వు కాదు. ఈ ప్రపంచం మొత్తం నీలోనే నిక్షిప్తం అయ్యి ఉందని రచయిత చెప్తారు.

ప్రశ్నలోనే బదులు ఉంది, గుర్తుపట్టే గుండెనడుగు..
నువ్వు ఏ ప్రశ్న వేసుకున్నా దానికి సమాధానం కూడా నీలోనే ఉంటుంది. అది గుర్తుపట్టు అని చెప్తారు.

మనసులో నీవైన భావాలే…

నువ్వు చూసే ప్రపంచం నీ కళ్ళను బట్టే ఉంటుంది. నీ మనసులోని భావాలే నీకు పైకి ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నీ ఇష్టాలు స్నేహితులు, నీ లోపాలు నీ శత్రువులు, ఋతువులు నీ భావ చిత్రాలు. నీ చెలిమి మందహాసం, ద్వేషం రోషం అనేవి నీ మదికి పట్టిన మకిలి (మురికి).

పుట్టుక, మరణం అనేవి మాత్రం నీ చేతుల్లో లేవు, మిగతా ప్రపంచం అంతా నీ చేతుల్లోనే ఉంది, ఏ రంగులు వేస్తావో నీ ఇష్టం అని. నీకు నచ్చినట్టు ఉండమని చెప్పారు.

ఋతువులు మారినట్టే, నీ ఇష్టాఇష్టాలు కూడా మారతాయి. అలాగే నీకు నచ్చనివి నీ శత్రువులు, నీకు నచ్చినవి నీ మిత్రులు అంటూ మన మనసులోని భావాల గురించీ చెప్తారు.
శాస్త్రి గారు ఇక్కడ ఇంకొక విషయం చెప్తారు, నీ ప్రయాణంలో నువ్వు కలుసుకునే ప్రతి చోటా నీ స్నేహితులే ఉంటారు, నీ స్నేహం కోసం ఆ చెలిమి చిరునవ్వు చిందిస్తూ ఉంటుంది అని. నీ లోపాలు, ఇష్టాఇష్టాలు తెలుసుకుని నిన్ను నువ్వే జయించుకోవలన్నది ఇక్కడ రచయిత ఉద్దేశం.

గమ్యం సినిమా చాలా ఉత్తమమైన చిత్రం. నాకు ఎంతో నచ్చిన సినిమా ఇది. కథ, కథనం, పాటలు అన్నీ దేనికవే అద్భుతం. శాస్త్రి గారు రాసిన ఒక్క పాటతో సినిమా మరింత ఎత్తుకి చేరింది. మనం బ్రతికి ఉన్నంతవరకు మన జీవితం, మన చేతుల్లోనే ఉంది. మనకి నచ్చినట్టు బ్రతకాలని చెప్తూ, మనల్ని ప్రేరేపిస్తారు.
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!