జేమ్స్ బాండ్ నాయక్

జేమ్స్ బాండ్ నాయక్
  (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

అమ్మా! అంటూ అరుస్తున్నట్టు పిలిచాడు నాయక్. అబ్బా! ఏంట్రా పని చేసుకోనివ్వవు అంటూ వచ్చింది శాంతమ్మ. చూడమ్మా నీ కొడుకు పెద్ద డిటెక్టివ్ అవుతున్నాడు. సాయంత్రం ఓ కేస్ చేజింగ్ కోసం పక్క ఊరు వెళ్తున్నా. రెండు మూడు రోజులు పడుతుంది. పోరా! నువ్వు చేసే పనికి కేసూ, చేజింగూ, నీ మొహం పోయి పని చూసుకో! బుద్దిగా ఎదో ఉద్యోగం చేసుకోవడం మానేసి నువ్వూ నీ యవ్వారం, ఇంకా ఎప్పటికి బాగు పడతావురా!
అబ్బా కొడుకుని నమ్మవే, నేను తొందరలోనే మంచి పేరు తెచ్చుకుంటా, అప్పుడు చూద్దూ గానీ.
ఇంతలో వెనుక నుంచి తండ్రి వచ్చి వాడిని పోనీ, వినడు పెట్టడు. పో ..పోయి తిరిగి రా. నీకిచ్చిన గడువు ఇంకో నెలే. ఈ లోపు స్థిర పడకపోతే పట్టుకెళ్ళి ఆ మిల్లులో పడేస్తా, మూటలు మొయ్యడమే. అంతే, మీరు నన్ను ఎంకరేజ్ చెయ్యరు అంటూ బయటకు నడిచాడు నాయక్. డిటెక్టివ్ నాయక్ జిందాబాద్ అనుకుంటూ.
ఓ మిత్రుడు వెంకీ ని తీసుకుని పక్క ఊరు వెళ్ళాడు నాయక్. రాత్రి సమయం, చుట్టూ చీకటి ఏమీ కనబడడం లేదు. నక్కల అరుపులు దూరం నుంచి వినిపిస్తున్నాయి. ఊరికి కొంచెం దూరంలో స్మశానం పక్కగా ఉండే తోట లోకి వెళ్ళారు. అక్కడ ఓ రోజు ముందే హత్య చేయబడినట్లు కనబడుతోంది. శవాన్ని పోలీసులు తీసుకు వెళ్ళి, ఆ ప్రదేశం చుట్టూ గీతలు గీసి, రక్షణ కవచంలా తాళ్ళు కట్టారు.
అది చూసి నాయక్ అన్నాడు చూడరా, ఇది కచ్చితంగా హత్య, అదీ ఒక ఆడపిల్లది అన్నాడు.
అవును బాస్, నువ్వు చాలా తెలివైన వాడివి, ఎలా కనిపెట్టావ్ అన్నాడు కూడా వచ్చిన వెంకీ.
అదేరా నా ప్రత్యేకత, ఇక్కడ చూడు కత్తి పోట్లకు వచ్చిన రక్తం మరకలు, అటు ఆ శవం చుట్టూ గీసిన గీతల భంగిమ చూడు, ఆ పక్కన అమ్మాయి గింజుకున్నట్టు చెట్టు ఆకులు చెల్లా చెదురుగా ఉన్నాయి. వావ్ బాస్, అవి కత్తి పోట్లు అనీ, ఏదో మానభంగం జరిగినట్టు, మీరే చేసినట్టు, సారీ చూసినట్టు భలే చెప్తున్నావ్, నిజంగా నీతో పని చెయ్యడం నా అదృష్టం అన్నాడు వెంకీ.
మరే… ఫాలో మి అంటూ నడిచాడు, వెనుక వెంకీ.
ఇప్పుడు మనం ఈ హత్య ఎలా, ఎందుకు జరిగింది. ఎవరు చేశారు, పోలీసుల కన్నా ముందే కనిపెట్టాలి. నడు రూమ్ కి పోయి ఆలోచిద్దాం, బాగా చీకటి పడింది. ఇంతలో వెనుక నుంచి వీపు మీద దభేల్ మని పడింది ఏదో. అంతే హడలిపోయి.. బాబో అంటూ అరిచాడు. అసలే చీకటి ఏమీ కనపడక మరింత గట్టిగా అరిచాడు వెంకీ. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని ఒణికి పోతూ పక్కకి జరిగారు. ఓ పనస చెట్టు నీడగా కనిపించింది, పక్కనే పెద్ద పనసకాయ. ఓరీ! ఏదో జంతువు అనుకున్నాం కదా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. మరి కొంత దూరం వెళ్ళాకా ఓ పెద్ద ఆకారం ఒకటి అడ్డుగా కనిపించింది. అంతే మన వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లైంది. ఆ ఆకారం లోంచి అదోరకమైన శబ్దం వస్తోంది కానీ కదలడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక సగం బిక్క చచ్చి చూస్తున్నారు. ఆ ప్రదేశం కొంచెం దాటితే ఇక ఊరి లోకి వెళ్లి పోవచ్చు, కానీ ఇప్పుడెలా, ఇది మనల్ని మింగేస్తుంది ఏమో, ఎలారా భగవంతుడా అని అలాగే కూర్చుని కదలకుండా ఉన్నారు. బిక్క చచ్చిపోయి, పైకి శబ్దం రాకుండా ఉండి పోయారు. అలా ఎంత సేపు అయ్యింది తెలీలేదు. ఇంతలో తెల్లవారింది, పొలం పనులకు వెళ్ళే వారి అలికిడి విని మెళుకువ వచ్చి చూసారు. వీరిని చూసి అందరూ నవ్విపోతున్నారు. అయ్యో మనం ఇక్కడే పడుకుండి పోయాము అనుకుని లేచి కళ్ళు నలుపుకున్నారు. రాత్రి చూసిన ఆ ఆకారం కోసం చుట్టూ చూసారు. కొంచెం దూరంలో అది కనిపించింది. అయ్యో బొమ్మ అది అనుకుని, దారిన పోయే ఒకతన్ని ఆపి అదేమిటి అని అడిగారు.
అరే పిచ్చోల్లారా దడుసు కున్నారా అది చూసి? ఈ ప్రదేశం దాటి ఊరిలోకి క్రూర జంతువులు రాకుండా మేమే రోజూ ఈ ఏర్పాటు చేశాం అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అన్నిటికీ భయ పడితే మనమేం డిటెక్టివ్ లం రా అనుకుని రూమ్ కి పోయి స్నానాదులు కావించి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, రాత్రి చూసిన ఆ హత్య తాలూకు వివరాలు కనుక్కుందాం అని. అక్కడ ఎంత అడిగినా ఎవరూ వీరిని పట్టించుకోరు.
అందరినీ అడిగి అడిగి అలసి పోయారు. కాస్త టీ తాగుదాం అని ఎదురుగా ఉన్న బడ్డీ దగ్గరకు వెళ్తారు. ఆ బడ్డీ యజమానికి రెండు టీ చెప్పి, చూడు బాబు మేం పెద్ద  గూడచారులం, నిన్న మీ ఊరిలో జరిగిన హత్య గురించి చాలా వివరాలు, ఎవరు చేశారు అన్నీ మేం కనిపెట్టాం. మీ పోలీసుల కన్నా ముందే మేం కోర్టు లో వివరాలు ఇస్తాం అని అదో లెవెల్లో బిల్డ్ అప్ ఇస్తారు. దానికి అతను బాగా నవ్వుకుని కొంపదీసి మీరు గానీ చేశారా అంటాడు.
ఛీ! నీకు ఏం అర్థం కాదులే, మా టీ మాకు ఇవ్వు చాలు అంటారు. టీ కి డబ్బులు తీసుకుంటూ మళ్లీ అడుగుతాడు ఆ బడ్డీ యజమాని, ఇంతకీ మీరు ఏ హత్య గురించి చెబుతున్నారు అని. అదేనయ్యా, ఓ అమ్మాయిని బలాత్కారం చేసి చంపేశారు కదా! దాని గురించి అంటాడు నాయక్ ఊరుకోండి బాబూ మా ఊర్లో అట్టాంటివి ఏమీ జరగవు అంటాడు.
మరి రాత్రి ఈ ఊరు చివర ఏదో హత్య జరిగినట్టు అక్కడ అంతా తాళ్ళు కట్టి, శవం మార్కు అవీ అంటూ గొణిగాడు నాయక్..ఓ! అదా మొన్న రాత్రి మా మునసబు గారి పొట్టేలుని ఓ అడవి పంది చంపేసింది, అది వారికి ఎంతో ఇష్టమైన పొట్టేలు పైగా మాంచి బలంగా పెరిగింది, దాని దెబ్బకి ఆ అడవి పంది కూడా లేవలేక పడి పోయింది లెండి. దాన్ని మా అటవీ శాఖ వాళ్ళు తీసుకుపోయారు. అని పోయి పని చూసుకోండి అంటాడు. నాయక్ మాత్రం నిరుత్సాహం తో అలా కాదు! ఇది హత్యే, జంతువుది కాదు కాదు, ఊరంతా అబద్దం ఆడుతోంది అని బిగ్గరగా అరుస్తున్నాడు.
ఇంతలో అతని అమ్మ వచ్చి మొహం మీద నీళ్ళు జల్లి వెధవ కలలు, పాడు నిద్రా నువ్వూ, లే తెల్లారి ఎండెక్కి రెండు జాములు అయింది, రోజూ నీతో ఈ వెధవ సంత ఎక్కువ అయిపోయింది. లే లే, లేచి ఊరు మీద పడు, నీ పని లేని మిత్రులు అప్పుడే వచ్చి పోయారు. అని లేపుతుంది. హా! ఇదంతా కలా, ఛ ఛా భలే కేసు రా ఇది నిజమైతే ఈ దెబ్బకి పెద్ద డిటెక్టివ్ ని అవుదును అంటూ పైకే అనేశాడు.
చాల్లే అవుదూ గానీ ముందు కలలు గనడం ఆపు! లేస్తావా, చీపురు తిరగెయ్యానా! హా! చీపురు దాకా ఎందుకు లే మళ్లీ నీకు చేతులు నొప్పి అంటూ మంచం దిగాడు మన నాయక్, అదే డిటెక్టివ్ నాయక్.

You May Also Like

4 thoughts on “జేమ్స్ బాండ్ నాయక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!