సంకల్పం

సంకల్పం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

మనసులో సాధించాలన్న ఆశ ఉండాలే కానీ ఎంతటి విజయం అయినా, ఎంత కష్టతరమైనా గమ్యాన్ని చేరుకునే తీరతాము ఇది నిజం. ఈ పట్టుదలనే సంకల్పబలం అంటారు. సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో, పొందే విజయం కూడా దానికి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. చెర్రీ, కాలేజీకి టైం అవుతోంది. లే తల్లీ అంటూ పిలుస్తోంది అమ్మ.
గాఢనిద్రలో ఉన్న నేను, కళ్ళు తెరిచాను.
అవును కదా, ఈరోజు మాకు లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మొదలు అవుతాయి. రాత్రి ఎక్కువసేపు చదివేసరికి, అసలు నిద్ర మెలుకువ రాలేదు అనుకుంటూ, ఇంక ముందు లేపవచ్చు కదా అని అమ్మను విసుక్కున్నాను. ఎగ్జామ్స్ అప్పుడు నేను టెన్షన్ గా ఉంటాను అని అమ్మకు తెలుసు. నన్ను చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది.
మన విసుగును గమనించేవారు మన బాధను అర్థం చేసుకునేవారు ఆనందంలో పాలుపంచుకునే వారు దొరకటం నిజంగా అదృష్టం. హడావిడిగా రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్లాను. నేను టెన్షన్ పడినంత కష్టంగా ఉండదు పేపర్ నాకెప్పుడు, హమ్మయ్య అని ఊపిరి పీల్చు కున్నాను. ఇదే నాకు ఎగ్జామ్స్ నాలుగు రోజులు దినచర్యగా మారింది. ఏంటి చెర్రీ, ఎందుకు అంత టెన్షన్ పడతావు. నువ్వు రాయకపోతే ఇంకా ఎవరు రాస్తారు? ఫస్ట్ క్లాస్ (రాంక్ కాదు) నీకు కాక ఎవరికి వస్తుంది? కాసేపు మాతో ఉండొచ్చు కదా!!! ఎప్పుడు ఇల్లు అంటావు అంటూ మందలించారు నా స్నేహితులు.
ఆప్తులు మందలిస్తారు. స్నేహితులు ఆదరిస్తారు సన్నిహితులు సలహాలిస్తారు, నేను, నాకు నచ్చినట్టు ఉంటాను. ఇంటికి రాగానే చదువుకోవడం, నిద్రపోవడం, లేచి కాలేజీకి వెళ్లడం, పరీక్ష రాసి మళ్లీ రావడం ఇదే దినచర్య మరో లోకం తెలియదు నాకు. ఎప్పుడు మనకి నచ్చినట్లు ఉండదు జీవితం. జీవితంలో మార్పు సహజం.
అన్నిటికీ అలవాటుపడడం మానవ సహజం.
సర్దుబాటులను ఆహ్వానించడం. ఆడపిల్ల లక్షణం
తెలివైన పిల్లగా పేరు తెచ్చుకున్న నేను, మారుతున్న నా జీవితాన్ని అర్థం చేసుకోలేనా? పరీక్షలు అయిపోవడంతో, ఒక రోజు టీవీ చూస్తూ కూర్చుని ఉండగా అమ్మానాన్న మాట్లాడుకునే మాటలు చెవిన పడ్డాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోవస్తుంది. ఇంకా పెళ్ళి చేయటం ఆలస్యం చేయవద్దు అంటూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
నాకు నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అనిపించింది. నాకు గవర్నమెంట్ జాబు సంపాదించాలన్న కోరిక. చదువులో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు. కానీ అంత పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావడం? అన్న ఆలోచన. టీవీలో రవితేజ సినిమాలో చెబుతున్న ఒక డైలాగ్ నా చెవిన పడింది. పగలంతా సంతోషంగా గడిపి, రాత్రిపూట నిద్ర పోదామని ఆత్రంగా బెడ్ పైకి చేరతాను. కానీ, పడుకోవడానికి నిద్ర పట్టడానికి మధ్యలో ఒక నిమిషం వ్యవధిలో ఏంటి ఈ జీవితం అనిపించే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ డైలాగ్ నేను మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాననే విషయం నాకు అప్పుడు తెలియదు. నేను కోరుకున్న జీవితం నన్ను వెక్కిరించి పోతుంది. అద్దంలో ప్రతిబింబం నన్ను చూసి నవ్వుతుంది. నాకై ఎదురుచూసే విజయం నన్ను ఉడికిస్తుంది. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను! పెళ్లి అయితే విజయం దూరమవుతుందని ఎందుకనుకోవాలి? అన్న ఆలోచనలు, అన్న మొండి పట్టుదలతో పెళ్లికి ఒప్పుకున్నాను. చూస్తుండగానే ఐదు సంవత్సరాలు అయిపోయింది. కొంతమంది స్నేహితులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇంకొంతమంది ఫోన్లో చెప్పే హాయ్, హలోల కోసం వేచి చూడటం సరిపోతుంది. నేను పెంచుకున్న ఆశలు అంటారా, ఆ విత్తనం కాస్తా నా మెదడులో పెరిగి పెద్దయి, మహావృక్షమై ఉంది. కానీ నా కోరిక తీరలేదు.
మనం వెళ్లే మార్గం సరి లేకపోతే వేరే మార్గం గుండా గంయాన్ని చేరతాం అంతేగాని గమ్యాన్ని మార్చుకోలేను కదా! అలాగే నా ఆశయం నెరవేరటం ముఖ్యం, నా తెలివితేటలు, చదువు నలుగురికీ ఉపయోగపడడం ముఖ్యం. అందుకే గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూసి సమయాన్ని వృధాగా గడపకుండా, నాకు వీలైన మార్గంలో నేను నడవదలచాను. మంచి ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నాను. నాకు నచ్చిన విధానంలో చిన్న పిల్లలకు పాఠాలు చెబుతున్నాను. వాళ్ల అందరికీ మంచి నేస్తాన్ని అయ్యి, వారితో ఆడుకుంటున్నాను.
వెళ్లే మార్గం కాదు, చేరే గమ్యం గొప్పది.
చేసే పని కాదు, సాధించే విజయం గొప్పది.
అలా అనుకుంటూ, నేను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని, గౌరవంతో ఎంతో నైపుణ్యంతో చేస్తున్నాను.
మన పని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు అదే వస్తుంది అన్నది నా ఆలోచన. ఇలా నేను డైరీ లో రాసుకుంటూ ఉండగా, ఫోన్ రింగ్ అయ్యిందిి. మాట్లాడాను. నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు, సాంఘిక సాంస్కృతిక విషయాలకు సంబంధించిన విభాగాన్ని కూడా అప్పగించారు. అప్పుడప్పుడు నేను చేసే రచనలు, నేను రాసే కవితలు చదివి మా ఆఫీస్ లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. అందుకే ఇంత భారీ విజయాన్ని నా చేతికి అందించారు అంటూ మావారితో నా సంతోషాన్ని వ్యక్తపరిచాను. అంతా నీ సంకల్ప బలం. కోరుకున్నది దక్కే వరకు వదిలి పెట్టవు కదా అన్నారు నవ్వుతూ. కంగ్రాట్యులేషన్స్ అమ్మ అంటూ, మా పిల్లలిద్దరూ నన్ను చుట్టేసారు.
కోరింది దక్కనప్పుడు, మనకు దక్కిన దాన్ని మనం కోరుకున్నట్టుగా మార్చుకోవడమే, నాకు తెలిసిన విజయం. ఇంటర్ ఎక్సామ్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య టెన్త్ పరీక్ష వ్రాయటానికి భయమేసి ఆత్మహత్య , లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య
అమ్మ, నాన్న, టీచర్ మందలించారు అని ఆత్మహత్య ఇదే ఇప్పటి తరం పిల్లల మనస్తత్వం.
ఆ నిమిషం ఆగి, ఆ గంట ఆగి, ఆ రోజుకీ ఆగి ఆలోచించండి. జీవితం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. బ్రతికి చూడండి, జీవితంలో సంతోషం తెలుస్తుంది. ఏదైనా సాధించి చూడండి, చైతన్యం వస్తుంది. బతుకు మీద ఆశ పెరుగుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!