మా సినిమా ప్రహసనమ్

మా సినిమా ప్రహసనమ్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

సూమారు ఐదు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా ప్రహసనమ్.
“బాబయ్యగోరూ! సినిమాకెళ్దారండి, పాతాల్లోనీ, కొత్తాల్లోనీ ఎన్టీవోడి బొమ్మలేనట, బండి కట్టేత్తాను, ఇయ్యాలో, రేపో ఎల్లొచ్చేద్దారండి” అని పురమాయించాడు నమ్మినబంబులాంటి నల్లకృష్ణుడు యజమానిలాంటి రామభద్రయ్య గార్ని. ఆ నల్లకృష్ణుడుకి రామభద్రయ్యగారంటే గౌరవం, చొరవ, అభిమానమూను. కృష్ణాష్టమి నాడు పుట్టేడనీ, కారునలుపుగా ఉన్నాడనీ, వాడికి ఆ పేరు ఈయనే పెట్టేరు. వాడికే కాదు ఇంకో ఇంట్లో శివరాత్రినాడు పుట్టినోడికి ఈశ్వర్రావు అనీ, ఇలా చాలామందికి నామకరణాల్లో సాయపడ్డారు. అంతే కాదండోయ్! ఆ పల్లెటూర్లో చాలా మందికి చిరస్థాయిగా నిలిచిపోయే ముద్దుపేర్లు పెట్టడం ఈయనగారి అభిరుచి. బండి కృష్ణుడి మాట విని, సినీమాకెళ్తామన్న సంబరంలో ఎగిరి గెంతేశారు రామభద్రయ్యగారి అరడజనున్నరమంది పిల్లలూను. సరిగ్గా అదే సమయానికి వంటింట్లోంచి వచ్చిన వేదవతమ్మగారు ఈ సినిమా మాటలు విని, ఎప్పటిలాగే కాస్త రుసరుసలాడేరు. నిజానికి ఆవిడ అలా చిరాకు పడడానికి కారణాల్లేకపోలేదు. సినీమాకెళ్ళడానికి ఏర్పాట్లశ్రమతోపాటు, తిరిగొచ్చేక కనీసం రెండురోజులపాటు అందరూ నీరసపడినా తనకు తప్పని వంటపని, ఇంటిపని అన్నీ తనొక్కర్తే చేసుకోవలసిరావడం కష్టం అయ్యేది. అయితే ఇదంతా మర్చిపోయేలా సంతోషమూ ఉండేది. ఆ పల్లెటూరికి పదిమైళ్ళ దూరాన ఉన్న మరో పెద్ద పల్లెటూరిలో ఉన్న రెండు టూరింగ్ టాకీస్ లలో ఏదో రెండుమూడు నెలలకోసారి సినీమాలు చూసివచ్చి, మళ్ళీ సినీమాలకెళ్ళేవరకూ ఆ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆనందపడిపోయేవారు. ఎట్టకేలకు మర్నాడు సాయంత్రం నల్లకృష్ణుడి సినిమా రథం బయల్దేరింది. ఉదయం నుంచే అందరూ తలో పనీ సాయంచేసేశారు సినిమానందాన్ని తలచుకొని. బండికి గూడుకూడా లేనందున అందరూ అటు ఇటు చూస్తూ ఊరు దాటేవరకూ అడిగినోళ్ళకీ అడగనోళ్ళకీ అందరికీ తాము సినీమాకెళ్తున్నామని చెప్పుకొంటూ వచ్చారు. రాళ్లు, మట్టి, గోతులు, కాలువలు, వగైరాలతో కూడిన ఆ గతుకుల దారిన ఎడ్లను పరుగులు తీయించాడు మన నల్లకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామాన అర్జునిడి రథాన్ని తోలిన కృష్ణుడిలాగ. దగ్గరచేసి, ఓ మైలుదూరం సిమెంట్ రోడ్డు మీద ప్రయాణం మాత్రం నిదానంగా జరింగింది. పరుగులెట్టిస్తే గిత్తలు పడిపోతాయట వాటి గిట్టలకున్న నాడాల కారణంగా. అయితే ఇది వీళ్ళకూ కాస్త మంచిదే అయింది. అంతవరకూ బండి కుదుపులవల్ల ఒళ్ళంతా హూనం అయి, ఇప్పుడు కొంచెం తెప్పరిల్లేరు‌. ఒకటో హాలుకి చేరడం, బండిని పార్కింగ్ (ఓరన నిలబెట్టి, ఎడ్లను విప్పి, వాటికి మేతపెట్టి, పక్కన ఉన్న పాక హొటల్ వారికి అప్పజెప్పడం) చేసి, టిక్కెట్టు తీసుకొని లోనికి పరుగులు తీశారు. తొందరతొందరగా వెళ్ళి కూర్చుంటేగాని సరైన బెంచీలు దొరకవు. రామభద్రయ్యగారు ఎప్పుడూ బెంచీకే తీసుకెళ్ళేవారులెండి. నేల అయితే ఇసుక/మట్టిలో కూర్చోవాలనీ, కుర్చీలు మనలాంటోళ్ళకుకాదు ఆఫీసర్లలాంటోళ్ళకనీ అనేవారు. కాస్సేపటికి ఆట మొదలైంది. అందులో వచ్చే పేర్లు చదువుకొని, అదుగో నాపేరు వచ్చిందంటే, నాపేరు కూడా ఉందనీ గొప్పపడిపోయేవారు అందరూ. ఆట ప్రారంభంకాగానే ఒకటే ఈలలు, చప్పట్లు నేల టిక్కెట్టోళ్ళు. మనోళ్ళేమీ తక్కువకాదు, వీళ్ళలో వీళ్ళు ‘నీకు కనపడుతుందా? ముందోడి బుర్ర అడ్డేస్తుందా? అటుజరుగు, ఇటుజరుగు, చోటుమారు, లేకపోతే ఒళ్ళో కూర్చో, నిలబడు, ఇలా రకరకాల సలహాల సహాయాల సరదాలతో సంబరపడిపోయేవారు. వీళ్ళలో ఒకరిద్దరు నిద్రకు ఆగలేక జోగిపోతుంటే, వాళ్ళను బలవంతాన లేపి, చూడమనేవారు మిగతావాళ్ళు. ఆ జోగడంలో ఒక్కసారి ముందు బెంచీవోడిమీద పడడం, చిన్నగా గొడవలు పడడం కూడా అయ్యేది. అప్పుడప్పుడు ఫిలిం తెగిపోతే, ఆపరేటర్ అతికి మళ్ళీ ఆట నడిపేలోపున ఆ రెండు నిముషాలు ఈలలు, అరుపులు, తెర దగ్గరకు పరుగులు, బేట్రీలైట్లు వెలిగించి, అగ్గిపుల్లలు వెలిగించి వికట్టహాసాలు చేసేవారు ముందు వరసల్లోవాళ్ళు కొందరు. అప్పట్లో ఆట నాలుగు పార్టులుగా వేసేవారు. ప్రతీ పార్టుపార్టు మధ్యలోనూ ఇదే తంతు. మొత్తం మీద ఆ ఆట పూర్తయ్యిందనిపించుకొని, బండిదగ్గరకొచ్చి, ఇంటినుండి వేదవతమ్మగారు తయారుచేసి పట్టుకొచ్చిన రొట్టెలు మస్తుగా తిని, ఆపక్కనున్న హోటల్లో టీనీళ్ళు (టీ బాగుంటాదని కాదు, బండికి కాపలా ఉన్నందుకు)తాగి, అవతలిపక్కనున్న రెండోహాలుకి రెండో ఆటకుపక్రమించేరు. ఆ తర్వాత, తంతు అంతా యధాప్రకారమే! షరా మామూలే అన్నట్లు! అయితే కాస్త ఎక్కువ ఎమిటంటే కొంతసేపటివరకూ వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు నిద్రలేపేవారు. ఆతర్వాత అంతా నిద్రలోకి జారుకొనేవారు గురకపెట్టిమరీ! అప్పుడప్పుడు నిద్రలో జోగి పడిపోవడంలో వచ్చిన మెలకువతో మళ్ళీ నిద్రలోకి జారుకోలేదు భయంతో. ఇంచుమించు సగంమంది సగం సగం సినీమానే చూశారు. ఈ ఆట కూడా పూర్తి చేసేశారండి మొత్తంమీద. ఇంటికి వెళ్ళేదారిలో ఈ సగంసగం సినిమా కథని చెప్పుకుంటూ అన్నింటినీ అతుక్కొని, ఒక చక్కని కథను అల్లుకొని తయారు చేసేసుకోగలిగేరు. అందుకేనేమో పెరిగి పెద్దయ్యాక వారు హింట్స్ డెవలప్మెంట్, స్టోరీ టెల్లింగ్, వగైరాల్లో బాగా రాణించేశారు.

          ఇదండీ మా సినిమా ప్రహసనమ్!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!