నమ్మిన  మోసం

నమ్మిన  మోసము

రచన: పరిమళ కళ్యాణ్

తన స్నేహితుడి శవాన్ని భుజాల మీద వేసుకుని స్మశానంలో దించి, కట్టె కాలుస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు బసవన్న. అది చూసిన కాపరి “ఎవరూ ఈలోకంలో శాశ్వతం కాదు. అందరూ పోయేవాళ్లే. అంత బాధపడకు. ఇంతకీ పోయిందెవరు?” అనడిగాడు..

“ప్రాణప్రదంగా నాతో పాటు పెరిగిన నా స్నేహితుడు” చెప్పాడు బసవన్న.

శవంపై ఉన్న గాట్లు, రక్తం చూసి “ఎలా జరిగింది, ఎం జరిగింది?” అనడిగాడు కాపరి.

“నేనే చంపాను. ఈ నీచుడికి తగిన శిక్ష నేనే వేసాను, వీడికి బ్రతికే అర్హత లేదు” గంభీరంగా అరిచాడు బసవన్న. శవం కాలే దాకా ఉండకుండా వెనుతిరిగాడు.

అసలేం జరిగిందంటే…

బసవన్న చిన్నతనంలో గోపాలం పరిచయం అయ్యాడు. గోపాలం తల్లీ తండ్రి లేని అనాధ. అతని పరిస్థితి చూసి మొదట జాలి పడ్డాడు, కానీ తర్వాత ఇద్దరి మధ్యా మంచి స్నేహం కుదిరింది.

ఎవరూ లేని వాడని జాలితో కాకుండా స్నేహితుడనే భావంతో, ప్రేమతో గోపాలన్ని చేరదీసాడు బసవన్న. తనతో పాటే తనింట్లో ఉండనిచ్చాడు. బసవన్న మొండి పట్టుదల చూసి అతని తల్లిదండ్రులు కూడా ఏమీ అనలేకపోయారు. ఒక మనిషికి ఇంత అన్నం పెట్టి, జాగా ఇవ్వలేమా అనుకున్నారు. నెమ్మదిగా తమ ఇంట్లో మనిషిలా మారిపోయాడు గోపాలం. కానీ ఇప్పుడిలా జరుగుతుందని అప్పుడు వాళ్లు ఊహించలేక పోయారు.

బసవన్నతో పాటు గోపాలన్ని కూడా చదివించి పెద్ద చేశారు. బసవన్న తండ్రి కాలం చేస్తే ఆ వ్యాపారం ఇద్దరు మిత్రులూ కలిసి చూసుకోవడం మొదలుపెట్టారు. వ్యాపారం అన్నాక లాభనష్టాలు ఒడిదుగుకులు మాములే కదా! వాళ్ళకి కూడా కష్టనష్టాలు అలాగే అడ్డుపడుతూ వచ్చాయి. కానీ గోపాలం, బసవన్న వాటిని అధిగమిస్తూ ఉన్నత స్థితికి వచ్చారు.

బసవన్నకి తన మరదలు శ్రీలతతో పెళ్ళి జరిగితే, గోపాలం తనలాంటి ఒక అనాధని చేసుకోవాలి అనుకుని ఏరికోరి సుజాతని చేసుకున్నాడు.

మొదట్లో అంతా బాగానే ఉన్నా, వాళ్ళ వ్యాపారం లాభాల బాట పట్టేసరికి గోపాలం దృష్టి మళ్లింది. అతని మెదడులో కలిగిన ఒక ఆలోచన ఇప్పుడతన్ని ఇలా కాష్టంలో పడేసింది.

ఒకరోజు ఎవరూ లేని సమయం చూసుకుని స్నేహితుడు బసవన్న ఇంటికి వెళ్ళాడు గోపాలం. గోపాలన్ని చూసిన శ్రీలత “రండి అన్నయ్యా, బావ లేడు పని మీద ఊరికి వెళ్ళాడు. మీరు కూర్చోండి, నేను మంచినీళ్లు తెస్తాను” అంటూ లోపలకి వెళ్ళింది.

బసవన్న ఊర్లో లేని సంగతి తనకి ముందే తెలిసినా, పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా, “సరే అమ్మా!” అని హాల్లో కూర్చున్నాడు గోపాలం.

శ్రీలత మంచినీళ్లు గోపాలానికి అందించి, కాఫీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. అదే అదనుగా గోపాలం శ్రీలత వెనుక నెమ్మదిగా వెళ్లి, పనిలో ఉన్న శ్రీలతని వెనుక నుంచీ గట్టిగా పట్టుకున్నాడు.

“అదేంటన్నయ్యా, వదులు నన్ను!” అంటూ విదిలించుకునే ప్రయత్నం చేసింది శ్రీలత.

“అన్నయ్యా అనకు, నిన్ను చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. కానీ పెద్దయ్యాక, నీ మీద మోజు పడ్డాను. ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలని చూసాను, కానీ కుదరలేదు. మీ మావయ్య అదే బసవన్న తండ్రిని అడ్డు తప్పిస్తే, ఈ వ్యాపారం నా సొంతం చేసుకోవచ్చని అనుకున్నాను. ఎందుకంటే బసవన్న నా మాటలకి డూడు బసవన్న లాగా తలూపుతాడు కాబట్టి. కానీ నువ్వు మీ ఆయనకి అండదండగా ఉంటూ వ్యాపారంలో మెళకువలు నేర్పిస్తావా? మరైతే నేనేం చెయ్యాలి? అందుకే నీకీ గతి!” అంటూ గట్టిగా తన మెడకు తాడుని బిగించాడు.

గిలాగిలా కొట్టుకుని ఊపిరందక ప్రాణాలు గాల్లో కలిపేసింది శ్రీలత. వెనుక నుంచీ ఏదో శబ్దం రావటంతో ఎవరైనా చూసి ఉంటారేమో అన్న అనుమానంతో అటువైపు పరిగెత్తాడు గోపాలం.

బసవన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య విగత జీవిలా పడి ఉండటం చూసి నిశ్చేష్టుడయ్యాడు. శ్రీలతా అంటూ గట్టిగా ఏడ్చాడు. అప్పుడే బసవన్నని ఓదార్చటానికి వచ్చిన పని మనిషి సీతాలు, గోపాలం చేసిన పనిని తను చూసిన దాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పేసింది.

స్నేహితుడని నమ్మి ఇంట్లో స్థానం ఇస్తే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగడతావా అంటూ విరుచుకుపడ్డాడు. గోపాలం కోసం వేట కుక్కలా వెతికాడు. బసవన్నకి నిజం తెలిసిపోయిందని తెలియని గోపాలం మాములుగా స్నేహితుడి దగ్గరకు వచ్చాడు.

“ఏంటి సంగతి బసవా, ఇదేనా రావటం పట్నం నుంచీ?” అంటూ కుశల ప్రశ్నలు వేసాడు. బసవన్న కోపం నషాలానికి అంటింది. ఇక మరో ఆలోచన లేకుండా పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని గోపాలాన్ని కసి తీరా నరికాడు.
“ఏం పాపం చేసింది రా ఆ పిచ్చిది, అన్నా అంటూ నిన్ను నోరారా పిలిచింది కదా! నేనేం పాపం చేసాను రా, అమ్మా నాన్నా కాదన్నా నా స్నేహితుడవని నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకుని, సొంత మనిషిలా చూసుకున్నాను కదరా. మనుషుల కన్నా డబ్బే ముఖ్యమా నీకు. అడిగితే నీ పేరున రాసిచ్చేసే వాడ్ని కదరా నీచుడా! నీలాంటి వాడు బ్రతకటానికి వీల్లేదు.” అంటూ మరింతగా తన కోపాన్ని తీర్చుకున్నాడు బసవన్న…

స్నేహితుడ్ని చంపి, భార్యని, కట్టెల్లో కాల్చి, పోలీసులకు లొంగిపోయాడు బసవన్న.

అలా స్వార్ధం ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. ఒక మోసం తన ప్రాణాలకే ముప్పు తెచ్చింది. నిలవని ఒక నమ్మకం, చితిలో కాలిపోయింది…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!