నమ్మకం

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

నమ్మకం

రచన: ఐశ్వర్య రెడ్డి

ఈ భూమి మీద మనలను ఏదో ఒక శక్తి నడిపిస్తోందనేది వాస్తవం. ఇప్పటికీ కొంతమంది దేవుడు ఉన్నాడని కొంత మంది లేరని ఎన్నో విధాలుగా చర్చలు జరుపుతున్న సైన్స్ కి అందని అద్భుతాలు ఈ భూమ్మీద ఇప్పటి వరకు మిగిలే ఉన్నాయి. ప్రకృతిని మన కోసం ఏర్పాటు చేసింది ఎవరు? మానవ శరీరం ఇలాగే ఉండాలని నిర్దేశించింది ఎవరు? ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో???… మన ఆచారాలు వ్యవహారాలను బట్టి  పూర్వీకుల నియమాలను మనం పాటించిన కూడా కొన్ని స్వయంగా అనుభవంలోకి వస్తేనే వాటి విలువ తెలుస్తోంది. అలా నా జీవితంలో నాకు దేవుడి విలువ తెలిసిన సంఘటన జరిగింది.
మా పెద్ద పాప పుట్టాక ఆరు సంవత్సరాల వరకు నాకు మళ్ళీ పిల్లలు కలగలేదు, అక్కడికి ఇక్కడికి అని చాలా హాస్పిటల్స్ కి వెళ్ళాం అన్ని రకాల పరీక్షలు చేయించాము, కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేదని చెప్పేవారు, ఒకరోజు తెలిసిన ఆవిడ  మా ఏరియాలో ఉన్న సంతోషి మాత కోలువై ఉన్న చిన్న గుడి గురించి చెప్తే వెళ్లాను. అక్కడే సుబ్రమణ్య స్వామి కూడా కొలువై ఉన్నాడు. వెళ్ళగానే పంతులు గారి దగ్గర కూర్చుని నా సమస్య చెప్పాను.
ఆయన నా జాతకం చూసి సుబ్రహ్మణ్య స్వామికి తొమ్మిది మంగళవారాలు, సూర్యోదయం కాక మునుపే ఇక్కడికి వచ్చి పాలతో అభిషేకం చేసి చలివిడి ప్రసాదం పెట్టండి, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధానం అ మాటలను బట్టి నమ్మకం కుదురింది. తెల్లవారితే  మంగళవారం ముందు రోజు రాత్రి ఆ పూజకు కావలసినవన్ని సిద్ధం చేసుకుని పొద్దున్నే వెళ్లాను, అతను మంత్రాలు చదువుతూ నాతో అభిషేకం చేయించారు. మనస్సు చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా రెండో మంగళవారం కూడా చేసాను, మూడవ మంగళవారం పూజ లోపే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. చాలా సంతోషంగా వెళ్లి పంతులు గారికి, ఆ దేవుడికి కృతజ్ఞతలు  చెప్పాను. నేను చెప్పింది విని  పంతులు గారు మీ సంకల్పం మీ నమ్మకం మీ పవిత్రమైన పూజ ఫలితం ఇది కచ్చితంగా 9 వారాలు పూజ కంటిన్యూ చేయండి అని చెప్పాడు. అలాగే చేశాను, తొమ్మిది నెలలకి అందమైన పాప పుట్టింది ఇప్పటికి నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం అనిపిస్తుంది. అందుకే కచ్చితంగా చెన్నై నగరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకొని మా పాప రెండో సంవత్సరం బర్త్ డే కి చెన్నై వెళ్ళాము. అది ఎండాకాలం మాకు అక్కడ ఎవరు తెలియదు.
జనాలు చాలామందే ఉన్నారు కానీ ఐదు నిమిషాల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అది ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము అనేది ఇప్పటికీ నాకు ఒక వింత. 5 నిమిషాల్లో దర్శనం, అంత పెద్ద గుడిలో, మా కారు డ్రైవర్ కారు రివర్స్ తీసి పెట్టే లోపలే దర్శనం చేసుకోని వచ్చాము. నిజంగా నా జీవితంలో సుబ్రహ్మణ్యస్వామి చేసిన అద్భుతాలు అంతా ఇంతా కాదు.  మా చిన్న పాప రాకతో మా సంతోషం రెట్టింపయింది. నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం అనే చెప్పాలి ఈ సంఘటన.
ధర్మబద్ధమైన విషయాలకు మన సంకల్పం తోడైతే మనకు సాధిస్తామన్న నమ్మకం ఉంటే కచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాం. ఏదో ఒక  శక్తి తోడుగా ఉండి నడిపిస్తుంది. ఎవరికీ అన్యాయం చేయకుండా పదిమంది బాగు కోరుకుంటూ ఆ పది మందిలో మనం కూడా  ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా ఉంటాము. అలాగే ఉండాలి కూడా.
సర్వేజనా సుఖినోభవంతు

You May Also Like

2 thoughts on “నమ్మకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!