నన్ను క్షమించు కన్నా !
రచన:: నామని సుజనాదేవి
పురిటి పొత్తిళ్ళ వెచ్చదనం
పూర్తిగా వీడకముందే
బ్రహ్మ జ్ఞానం వీడి బాహ్య లోకాన్ని వీక్షించక ముందే
నులి వెచ్చని తల్లి వొడి
పాలమదురిమ ఆస్వాదించక ముందే
నిర్దాక్షిణ్యంగా పట్టుకోలేని చేతులకు
పాలసీసా నందించి
కేర్ సెంటర్లో ఆయా చేతుల్లో
నువ్వేడుస్తుంటే
వనిత మనసు ‘వెన్న’ అన్న
నానుడి అబద్ధం చేస్తూ
గడియారాన్ని చూసిన
కళ్ళ సంకేతానికి ప్రతిస్పందించి
మనస్సందించిన ఆదేశానుసారంగా
కర్కశ హృదయాలను సైతం
కరిగించగల నీ కన్నీరు
కఠిన పాషాన మైన నా
హృదయాన్ని కరిగించలేక
అమృతం మాతృ హృదయం అన్న
కవి వాక్కు కాదంటూ వెళుతున్న
నన్ను క్షమించు కన్నా!
అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నాననే సాకుతో
కర్తవ్యమ్ కరిచి, కర్కశంగా
కాసులకు కడుపు తీపి నమ్ముకుంటున్న
ఈ కన్నతల్లిని క్షమిస్తావు కదూ!
మనసు లేని మనిషిగా చరిత్ర పుటల్లో మిగులుతున్న
ఈ అమ్మ మనసుని అర్ధం చేసుకుంటావు కదూ !!!
***