స్నేహ ధర్మం 

స్నేహ ధర్మం 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : తిరుపతి కృష్ణవేణి.

       అధిక వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు, చెరువులు, పొంగిపొర్లుతున్నాయి. ఊర్లు, ఏర్లు, చెట్లు, పుట్టల మీదనుండి వరదలు ముంచెత్తి పారుతున్నాయి. ఈ భారీ వరదల వలన మా నివాసాలన్ని చెల్లచెదురైనాయి. మేము  వేరు వేరు ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వచ్చింది, మా కుటుంబంతో పాటు! బంధువులు, స్నేహితులపిల్లా, జెల్లలం, అందరం బయలు దేరాము. ఈ సంవత్సరం  భారీగా వరదలు రావటం వలన మాకీ దుస్థితి ఏర్పడింది. మేమంతా వరదకు ఎదురు ఈదుతూ పయనిస్తున్నాము.  చివరికి  వరద ఉదృతిలో ఓ పెద్ద  చెరువులోకి  వచ్చి పడ్డాము. చుట్టూ కరకట్టలతో, ఆ చెరువు అంతా, విశాలంగా ఉంది. చుట్టూ ఉన్న కరకట్టమీద , భారీ వృక్షాలు ఉన్నాయి. వాటిపై రకరకాల పక్షి జాతులు నివాసంఉంటున్నాయి. ఉదయం, సాయింత్రం సమయాల్లో, పక్షుల కిలకిలా రావాలతో చెరువు ప్రాంగణమంతా, ప్రతిధ్వనిస్తూ, ఎంతోఆహ్లాద కరంగా ఉంది. మేమంతా,  క్రొత్త స్నేహితుల పలకరింపులతో,  చెరువు అంతా కలయ తిరుగుతూ, నీటిపై తేలియాడుతూ, ఎంతో సంతోషంగా గడిపాము. మా తల్లిదండ్రులు తమ తమ నివాసాలు వెదికే పనిలో నిమగ్నమయ్యారు.
ఇంతకూ “నేనెవరో  చెప్పలేదుకదూ ? ఈ పాటికి మీకు అర్ధమయ్యేవుంటుంది. “నేనొక చేపపిల్లను” నా పేరు “సుకుమారి”. అమ్మ, నాన్నలు ఆ చెరువులో, ఒక పెద్ద బండరాయి క్రింద, మా నివాసాన్ని ఏర్పాటు చేశారు. రోజు మధ్యాహ్నంపూట కరకట్టపై ఉన్న పెద్ద వృక్షం  నీడలో ఉన్న  బండరాయి పైన కూర్చొని, తరచూ, నేను సేదతీరేదాన్ని. ఒకరోజు చెట్టుపై నున్న గూటిలోనుండి చిన్న, పక్షి  రెక్కలాడిస్తూ  వచ్చినీటిలోని, బండపై వాలింది. నీరు త్రాగి అటూఇటూ పచార్లు చేస్తూ ఉంది!  ఇదంతా గమనిస్తున్న నేను, నెమ్మదిగా పైకి వచ్చి, ఎవరు నువ్వు? మిత్రమా!అని అడిగాను. కాకి జాతికి చెందిన దానినని, మా కుటుంబంతో ఈ చెట్టుపైనే నివాసం ఉంటాము, అనిచెప్పింది. ఆ రోజునుండి ప్రతి రోజు మేమిద్దరం ఆ బండవద్ద కలుసుకుంటూ, ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళము, మేముఇద్దరం, మంచిస్నేహితులమయ్యాము. ఇది గమనించిన  నా తల్లిదండ్రులు, “ఎవరితో పడితే వారితో స్నేహం మంచిది కాదు తల్లీ ” మనకు శత్రువులు చాలా మంది ఉన్నారు. అందులో! కాకి జాతి కూడా ఒకటి, అవి చాలా క్రూరమైనవి! ఏ మాత్రం  దొరికినా, మనలను పొడుచుకుని తింటాయి. వాటి స్నేహాన్ని నమ్మవద్దు, అని తల్లి, హెచ్చరించింది. కానీ, నేను అమ్మ మాటలు పెద్దగా పట్టించుకోలేదు!, మా స్నేహాన్ని  కొనసాగిస్తూ వచ్చాను. కాలం హాయిగా గడచి పోతూంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ! ఎండ తీవ్రత బాగా పెరిగింది. చెరువులో నీరు, రోజు రోజుకూ, తరిగి పోతూంది. నీరు తగ్గిపోవటం వలన, జాలరులు రోజూ చేపల వేట సాగిస్తున్నారు. మా బంధువులు, స్నేహితులు చాలా మంది కనపడకుండా పోతున్నారు. ఇక కొద్ది రోజుల్లో, అందరమూ జాలరులకు  ఆహారమవ్వాలసిందే!ఒకవేళ జాగ్రత్త గా ఉండి, తప్పించుకుంటే,ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అందరం మరణిస్తాము.!అని,  అమ్మ బాధగా చెప్పింది. ఒక రోజూ, రాత్రి అయినా, అమ్మ, నాన్నలు ఇంటికి తిరిగి రాలేదు. నేను చాలా సేపు ఎదురుచూసాను. వారు ఎంతకూ రాకపోయేసరికి జాలరుల వలలో చిక్కుకొని  ఉంటారని గ్రహించి, ఎంతగానో దుఃకించాను. తల్లిదండ్రులను కోల్పోయిన నేను వంటరినై , ఎటు వెళ్తే, ఏ, ప్రమాదం జరుగుతుందోనని, బిక్కు బిక్కుమంటూ, బండక్రింద స్థావరంలో ఉంటున్నాను.
చాలా రోజుల తర్వాత  స్నేహితురాలు , కలసి, ఏమిటి! మిత్రమా!అసలు బయటకు కూడా రావటం లేదేంటి? ఏమిటి విషయాలు?, ఏం జరిగింది”? అని అడిగాడు. తల్లి దండ్రులను కోల్పోయిన విషయాన్ని ఎంతో ఆవేదనతో  తెలియ జేశాను. ఏదో ఒక రోజు జాలరుల చేతిలో నా ప్రాణానికి కూడా  ప్రమాదం పొంచి ఉన్నది. నేను కూడా మరణిస్తాను మిత్రమా!
అని “మనసు లో ఉన్న బాధనంత చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నాను. బాధపడకు మిత్రమా! సమయం వచ్చినప్పుడు నిన్ను ఎలాగైన  ఈ ముప్పు నుండి తప్పిస్తాను. భయపడకు అని దైర్యం చెప్పింది.
అప్పటినుండి, నాకు అమ్మ చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి? కొంగ, బాతు, కాకి మొదలైన, కొన్నిపక్షి జాతులు మన ప్రాణాలకు హాని తలపెడతాయి.! వాటితో మనం కాస్త జాగ్రత్త గా ఉండాలి. “అందులో ముఖ్యంగా కాకి జాతిని  నమ్మవద్దు”అనే మాటలు గుర్తుకు వచ్చాయి.
నమ్మించి మాయ మాటలు చెప్పి తనకేదైనా హాని తలపెడుతుందా ? ఏమిటీ? ఎంతో స్నేహంగా ఉంటున్నది. కానీ! స్నేహం మాటున విషం దాగిలేదుగదా? మంచి మాటలతో నమ్మించి బయటకు తీసుక వెళ్ళి నా ప్రాణాలకు హాని కలిగిస్తుందేమో? జాగ్రత్త గా ఉండాలి? దాని మాటలను నమ్మి మోసపోవద్దు?అని మనసులో అనుకుంది. క్రమంగా చెరువులో నీరంతా ఇంకి పోయి తనకి ప్రమాదం ముంచు కొచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పుడెలా? అని అనుకుంటూ ఉండగా!.. ఒకరోజు “తన స్నేహితురాలు మిత్రమా! మిత్రమా! అని పిలుస్తూ వచ్చింది. నీకో శుభవార్త! ఇక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద జీవనది ప్రవహించుచున్నది. నేను ఎలాగైనా నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను. అని చెప్పింది. కానీ నాకు మాత్రం, అమ్మ చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి!. కానీ ఏం చేయాలి? ఈ చెరువులో వుంటే జాలర్ల చేతుల్లో ముప్పు తప్పదు!. లేక స్నేహితురాలు చెప్పినట్లువిని, బయటకు వస్తే  మోసం చేసి తనకు ప్రాణ హాని తల పెడుతుందేమో? ఏం! చేయాలో ఎంతకూ, బోధ పడటం లేదు.? అలోచించి, చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను. స్నేహితురాలు మోసం చేస్తే, దాని చేతిలో మరణిస్తాను.లేకుంటే జాలరుల చేతిలో మరణిస్తాను. మొత్తానికి చావు తప్పదు.
జాలరుల చేతికి చిక్కటం కన్నా, నమ్మిన స్నేహితురాలి చేతిలో మరణించటం మిన్న! అనుకుని స్నేహితురాలితో వెళ్ళటానికి నిర్ణయించు కున్నాను. ఒక రోజు వేకువ జామునే, పొడవైన  గిజిగాడి గూటినొకదానిని నోట కరుచుకొని చెరువులో, బండ రాయి వద్దకు వచ్చి, మిత్రమా! అని పిలిచింది. అన్నీ ఆలోచించుకొని, ఒక నిర్ణయానికి వచ్చినేను తయారుగా ఉన్నాను.
స్నేహితురాలు గిజిగాడి గూటిని ముక్కుతో కరచి  పట్టుకొని నా ముందు నీటిలోకి వంచింది, చెంగుమని గిజిగాని గూటిలోకి  దూకాను.
పొడవైన గిజిగాడి పక్షి గూటిని నోటకరుచుకొని ఒక్క ఉదుటున గాలి లోకి ఎగిరింది. నాకు మనసులో ఆందోళన మొదలైంది. ఇప్పుడు నా స్నేహితురాలు నన్ను ఏం చేస్తుందో ? అని!కపట బుద్దిదైతే భక్షిస్తుంది. స్నేహధర్మాన్ని పాటించే సన్మార్గురాలైతే, నన్ను నదిలో వదలి రక్షిస్తుంది ఇలా ఆలోచిస్తుండగానే, ఒక పెద్ద నాదీ తీరానికి చేర్చి, నెమ్మదిగా నదిలోకి జారజారవిడిచింది. నా  ఆనందానికి అవధులులేవు.  స్నేహితురాలి గొప్ప మనసుకు, ఎంతో ఆనందించాను. అమ్మచెప్పినట్లు అందరూ మోసగాళ్లు ఉండరు? మనకు శత్రువుల్లాగ కనిపించినా? అందులో “మంచి బుద్ది కలిగిన వారు” కూడా ఉంటారనినాకు, అర్థమైంది. అన్నిటికన్నా “స్నేహబంధం” గొప్పదని నా స్నేహితురాలు  నిరూపించింది. ఇంతమంచి స్నేహితురాలు ఉన్నందుకు నేను ఎంతో సంతోషించాను. ఆనాటినుండి మా ఇద్దరి స్నేహం,  కొనసాగుతూనే ఉంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!