కృతజ్ఞత

కృతజ్ఞత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మాధవి బైటారు “దేవి తనయ”

        ఊరికి కొద్దిగా దూరం లో ఉంది ఆ వృద్దాశ్రమం. అక్కడకి  ప్రతీ ఆదివారం  వచ్చి పెద్దవాళ్ళ యోగక్షేమాలు కనుక్కుoటాడు రాజేష్. కూతురు శ్రావణిని కూడా అప్పుడప్పుడు తీసుకువస్తుంటాడు.
అతను పుట్టిన కొన్నేళ్లకే తల్లితండ్రులు చనిపోవడం తో అయినవాళ్ళు ఎవరూ చేరదీయకపోవడం తో బ్రతుకు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ పైకొచ్చాడు. తల్లి తండ్రుల ప్రేమ లభించకపోవడం తో వృద్ధాశ్రమ౦ లోని పెద్దవాళ్ళల్లో తన తల్లి తండ్రులను చూసుకుంటూ అక్కడ వారికి సేవలు చెయ్యడం, మందులు ఇవ్వడం, కబుర్లు చెప్పడం వంటివి చేస్తూ తృప్తి పడుతుంటాడు. ఎప్పటిలాగే ఆదివారం వచ్చిన రాజేశ్ కి అక్కడ సర్వం కోల్పోయినట్లుగా, విచారం తో ఉన్న ఒకామెని చూస్తే ఎక్కడో తెలిసినట్లుగా అనిపించింది.“ఎవరని” నిర్వాహకుడిని అడిగాడు. కిందటి వారం గుడి దగ్గర నీరసం గా ,భయంభయంగా  చేతిలో చిన్న సoచి తో మావాళ్ల కి కనిపించారట. ఎప్పుడో కానీ నోరు విప్పడం లేదు. అడగ్గా అడగ్గా  పేరు సుందరమ్మ, ఊరు ఒంగోలు అని మాత్రం చెప్పారు. ఎంత బ్రతిమిలాడుతున్నా ఆహారం, మందులు  సరిగ్గా తీసుకోవడం లేదు. నిద్రలో కూడా “ నేనెవరికోసం  బ్రతకాలి” అంటూ ఏడుస్తున్నారు  ” అని బాధగా  చెప్పాడు. అంతా విన్న  రాజేష్  ఏదో గుర్తుకువచ్చినవాడిలా ఆమె దగ్గరికి వెళ్లి,
“అమ్మా!! మీరు రాఘవయ్య మాస్టారిగారి భార్య కదా” అని అడగగా “అవును నాయన. నువ్వెవరు”? అని సుందరమ్మ అడిగింది. “నేనమ్మా, రాజేష్ ని. అనాధనైన నన్ను మీరిద్దరూ ఎంతో ఆదరించారు. ఈ జీవితం ‘మాస్టారుగారు పెట్టిన భిక్ష’. నా చదువులకు అయ్యే ఖర్చును మాస్టారు గారు పెట్టేవారు. అన్నపూర్ణ లాగా మీరు కొసరి కొసరి వడ్డించేవారు. కొన్నేళ్ల కి  నా పై చదువులకు వేరే ఊరు కి వెళ్లిపోయాను. తర్వాత మీ గురించి ఎంతో వాకబు చేశాను. కానీ ఆచూకీ దొరకలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి మిమ్మల్ని ఇక్కడ ఇలా  చూడాల్సివస్తుందని అస్సలు ఊహించలేదు. ఎంతో హుందాగా లక్ష్మీదేవిలా  కళకళ లాడుతూ  ఉండే మీకేమిటమ్మ ఈ దుస్థితి”  అంటూ ఆమె చేతులు పట్టుకుని భోరుమన్నాడు. అసలు మీరిక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి ” అని ప్రశ్నించగా ఆమె నిర్వేదంగా నవ్వి “ ఎప్పటికైనా ముగ్గురు కొడుకుల దగ్గరే ఉండాలి కదా అని, ఉన్న ఆస్తినంతా వాళ్ళకే ఇచ్చేసాము. మాకంటూ  ఏమి మిగుల్చుకోని మమ్మల్ని, భారమయిపోయామని సూటిపోటి మాటలతో ప్రతీ రోజు హింసిస్తుంటే కడుపున పుట్టిన పిల్లలతో మాటపడడం తట్టుకోలేని మీ  మాస్టారుగారు మానసిక క్షోభతో పోయారు.  వట్టిపోయిన ఆవులాంటి నన్ను గుడి దగ్గర వదిలేసారు బాబూ!!”అంటూ గుండెలవిసేలా రోదించింది. అదివిన్న రాజేశ్ కి కోపం కట్టలు తెంచుకుంది. “నవమాసాలు మోసి కనిపెంచిన మిమ్మల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా ఎలా వదిలేశారమ్మా ”
అనగానే పక్కనే ఉన్న కూతురు శ్రావణి “నాన్నా! నాన్నా! నాన్నమ్మని మనం ఇంటికి తీసుకు వెళదాం” అని ముద్దుగా అడగ్గానే వెంటనే రాజేష్ నిర్వాహకుడు దగ్గరికి వెళ్లి “. అందరూ దగ్గర ఉండాల్సిన ఈ వయస్సులో ఎవరూ లేని అనాధల్లా వీరిని ఇలా వదిలేయడం ఎంతమాత్రం మంచిది కాదు. ముసలితనంలోనే పిల్లల ఆసరా తల్లితండ్రులకు ఎక్కువగా ఉండాలి. డబ్బులేదని, ఆరోగ్యం బాగుండటం లేదని దైవసమానులైన తల్లితండ్రులను వదిలేయడం సమాజానికి అలవాటు గా మారుతుంది. తల్లితండ్రులు లేని నాకు, వారి విలువ ఎంత గొప్పదో తెలుసు. ఆవిడను నేను మా ఇంటికి తీసుకువెళతాను, తల్లిలాగా చూసుకుంటాను. అని దృఢంగా చెప్పాడు రాజేష్. ఆనందం తో శ్రావణి, సుందరమ్మ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కార్ దగ్గరికి తీసుకువెళ్ళింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!