మార్పు
రచన ::మంగు కృష్ణకుమారి

వసంతకి కోడలు అనూషని ఎలా అర్థం చేసుకోవాలో తెలీటం లేదు. కొడుకూ, కోడళ్ళది ఏం లవ్ మేరేజ్ కాదు.
ఏదో పెళ్ళిలో కలుసుకొని సరదాగా మాటాడుకున్నారట. స్నేహితులంతా చేరి “మీరిద్దరూ చక్కటి పెయిర్” అవుతారని రాయభారాలు చేసి పెళ్ళి అయేలా చేసేరు.
ఇటు వసంతా, అటు అమ్మాయి తల్లి శారదా దాదాపు ఒకేలాటి స్వభావం ఉన్నవాళ్ళు. ’పిల్లలు సుఖంగా ఉంటే చాలు’ అనుకొనే స్వభావం ఉన్నవారు. వాళ్ళిద్దరికీ మాట బాగా కలిసింది.
అనూష, ఆర్య వేలు పట్టుకొని అత్తింటికి వచ్చింది. ఆ అమ్మాయిలో ఎక్కడా ఉత్సాహం కనపడదు. ఆర్యకి నైట్ డ్యూటీ ఉంటే పగలు ఎక్కువ నిద్రపోతూనే ఉంటాడు. అలాటప్పుడు మరీ వేల మొహం వేసుకొని ఉంటుంది.
ఓసారి తన ఫ్రండ్ తో మాటాడుతూ “అవును. ఆర్యా వాళ్ళింట్లోనే ఉన్నాను” అంది. ఆరోజు మాత్రం వసంత చాలా మృదువుగా అడిగింది.
“తల్లీ! ఇది ఆర్య ఇల్లే కాదు, నీ ఇల్లు కూడా! మనఇల్లు” అంది.
అనూష బుర్ర అడ్డంగా తిప్పుతూ, “ఏమో ఆంటీ నాకు ఇంకా ఆ ఫీలింగ్ రాటం లేదు. అలాటప్పుడు మనిల్లు అని ఎలా అనేది?” అంది మొహమాటం లేకుండా. “పోనీ మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి రామ్మా” అని పుట్టింటికి పంపించింది. వారంలో వచ్చేసింది.
శారద ఫోనులో నవ్వుతూ “మీరెంత ముద్దుగా చూస్తున్నారో గానీ వదినగారూ, అనూ ఇక్కడ ఉండలేక వెళిపోయింది” అంది. వసంతకి ఏమనాలో తెలీదు. అనూష బాధ బోధపడ్డా, తను ఏం చేయాలో తెలీటం లేదు.
తను గోరంత పని అనూషకి చెప్పదు సరికదా, ఆమె బట్టలు కూడా తనే వాషింగ్ మిషన్ లో వేస్తుంది. ఆరినవన్నీ తీసి మడతలు వేస్తుంది. ఇంకా ఆర్య కాస్త అయినా సహాయం చేస్తాడు కానీ అనూష సున్నా. పోనీ మనిషయినా కళకళలాడుతూ ఉంటుందా అంటే రోబొలా తిరుగుతోంది. శ్రేయ మీద అనూష ప్రభావం పడుతుందేమో అని వసంతకి భయం పట్టుకుంది.
కొడుకుతో ఒకసారి చెప్పింది. “తనకి కొత్తకదమ్మా… నాతో కూడా ఒక్కోసారి అలాగే ముభావంగా ఉంటుంది” అనేసాడు.
శ్రేయ తన ఫ్రండ్ తో మాట్లాడుతూ “ఎందుకే మీ అక్క అత్తగారంటే అంత భయపడుతోంది? మా ఇంట్లో చూడు.
మా అమ్మ వదిన్ని నాకన్నా ఎక్కువగా చూస్తుంది. మా మమ్మీలాటి అత్తగారు అయితేనే మనం పెళ్ళి చేసుకోవాలి” అంటున్నది.
వసంత గుండె ఆగింది. ఏదయినా పరిష్కారం చూడాలి అనుకుంది.
“అమ్మా, ఇదేమిటి? నాన్నగారికి బదిలీ అయితే మీరు ఆ దూరంలో ఇల్లు తీసుకొని ఉండాలా? సొంత ఇల్లు వదిలిసి దేనికి? నాన్నగారు కార్ లో వెళ్ళి వస్తే అవదా?” ఆర్య
తల్లితో అన్నాడు. అనూష నిశ్శబ్దంగా వింటున్నాది.
“ఆర్యా, అంతంత దూరాలు రోజూ కార్ లో ప్రయాణం చేసే వయసా మీ నాన్నది. శ్రేయకి కూడా ఎక్కడ సీట్
వస్తుందో, తెలీదు. ఆ చుట్టుపక్కల అయితే మంచి కాలేజ్ లు ఉన్నాయి” వసంత నచ్చచెప్పింది.
“అయినా శనాదివారాలు మీరో, మేమో ఇటూ అటూ వస్తూనే ఉంటాం కదా” మళ్ళా తనే అంది వసంత.
“అది కాదమ్మా, అనూకి కొత్త. ఇల్లు నిభాయించగలదా? అని” ఆర్య బాధ.
“నాయనా, ఆడపిల్లలకి ఇలాటివి పుట్టుకతో వస్తాయి. అయినా వాళ్ళామ్మా వాళ్ళు దగ్గరే కదా! నేను ఆవిడకి చెప్పేను. ఆవిడ సాయపడతారు ఏం బెంగలేదు” తేల్చేసింది వసంత.
ఏడాదికల్లా అనూషలో చాలా మార్పు వచ్చింది. వసంత హమ్మయ్యా అంటూ తనలో తను నిట్టూర్చింది.
శుభం
