చిన్ననాటి మా ఊరు..యాదిలో

చిన్ననాటి మా ఊరు..యాదిలో

రచన :: లోడె రాములు

ఎవ్వరికైనా కన్న తల్లి,పుట్టిన ఊరు అంటే వల్లమాలిన ప్రేమే ఉంటది..
ఎక్కడ ఉన్నా,ఏ స్థాయిలో ఉన్నా, ఊరి వాళ్లు ఎక్కడ కనిపించినా నా అనే భావం,తనను తాను పలకరించుకొన్న సంతోషం. ఆ కిక్కే వేరబ్బా..అంటుంటారుగా..
అదే క్రమంలో ప్రతి కుటుంబ పెద్ద
తన పిల్లలకోసం,బతుకుదెరువు కోసం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఒక స్థాయికి చేరడానికి తాను పడ్డ బాధలు..త్యాగాలు ,నిజానికి ఆయనే మన హీరో..
కానీ జనం ఆకర్షణకే దాసోహం.
వెండి తెర పైన నటనకు ఫిదా అయితే ఓకే అదే నిజమనుకొంటేనే సమస్య.
ఇప్పుడు తన పిల్లలే తల్లిదండ్రుల్ని సరిగ్గా అర్ధం చేసుకోకపోగా వారిని ఇష్టమున్నట్లు చీదరించుకోవడం..
ఆ సంఘటనలు ఏ ఇంటిలోనూ జరుగొద్దు. వీలుదొరికినప్పుడల్లా ఆనాటి ముచ్చట్లను ముచ్చటించుకొందాం..ఈ రోజు మా ఊరి యాదిలో భాగంగా క్లుప్తంగా పరిచయం చేస్తాను..

బతకమ్మ పండుగనాడు పూలజడ వేసుకున్నట్లుండేది మా ఊరి పెద్దబావి కుంట……బోనాల పండుగకు సున్నం జాజుతో పుదిచ్చిన ముత్యలమ్మ గుడి. ఎత్తు అరుగుల మీదున్న చందా లింగయ్య గారి కిరాణ దుకాణం…శివుని గుడి ముందున్న దొర్బాయి ,శివునిబాయి మంచినీళ్ళ బోరింగ్… కంచారోల్ల బాయి కాడి గంగరేగుపండ్లు.
లోడో ని బాయి కాడి సీతాఫలాలు… మోదుగుపూలు….
ఉప సర్పంచ్ గా చరిత్రలో నిలిచి పోయిన పాలెం యాదయ్య గారి ఇంటికాడి పంచాయతీ రేడియో….
ఊరెంక చిర్ర గోనె ఆట…. కోట ముంగలి బావికాడ గోళీల ఆట… గుడి ముంగల తెల్లాంగ దెల్లార్లేసే సిందొల్ల భాగోతం… గొల్లోల్ల దొడ్ల పగటీలి ఆడే పట మోల్ల కథలు . ఎండకు రగడీలుతూ …గుడి మండపం కాడ సాధనా శూరుల ఆట…… కాలానుగుణంగా వచ్చేబాతులోల్లు,
దొమ్మరోల్లు,లంబాడీలు….
మంగలి రాములు గారి కత్తి కోసం సబ్బండ జాతి వరసలో నిల్చోవల్సిందే,పదిమంది కలిస్తే ఇంటింటి ముచ్చట్లు,
అక్కడ వినిపించేవి..అందరిజాతకాలు.. జ్యోతిష్యాలు… నవ్వులాటలు.అసహనం తో వచ్చే అసందర్భప్రేలాపనలు

ఎవరింట్లో పెళ్లి అయినా ఇంటి కొక్క బండి కట్టి బండెనుక బండి ..బండ్లల్లో రామ చక్క దనాల సీతమ్మ మనసున్న మనుషులు… మళ్లీ అలా చూడాలంటే అడిఆశే…
పెండ్లి కూతుర్ని సాగనంపే వేళ గుడిదగ్గర ఊరు వూరంతా వచ్చి ..మాటలు రాక..చేతులు వదలలేక భారంగా తమ గుండెని సాగనంపుతున్నట్లుగా భావించే కరుణామయులు..
గుడి పక్కనున్న బోయిని రాములు గారి హోటల్ చాయ్ , తాగినా తాగక పోయినా…పొద్దుగాల పొద్ముకి గుమ్మి కూడల్సిందే …
సందులోని పంచాయితీ కానించి సెంట్రల్ రాజకీయాల దాక ఎడ తెరుపకుండ చర్చలు, తీర్పులు సవాళ్లు.. బల్లగుద్ది ప్రతిసవాళ్లు…. సల్ల బడ్డాక ..ఆడికె ముంతల కాడ మళ్లీ తమతమ ప్రతాపాల ప్రస్థానం.
ఊరందరికీ గురువు తమ్మళ్ళ రాజయ్య పంతులు గారే….
పాలెం యాదగిరి గారి పాము మంత్రం మనోధైర్యాన్నిచ్చి
ప్రాణాలను నిలిపేది…
బోయిని కృష్ణ ఇచ్చే పసకల మందు మనిషిలో ఉన్న మాలిన్యాలని, మసకల్ని కడిగి పారేసేది….
వూళ్ళ మల్లాజి మంచితనం … కృష్ణార్జునులుగా పేరుతెచ్చుకున్న కృష్ణ శంకరాజి ల రాజకీయ స్నేహం.

పీర్ల పండుగ లో దూలాటలు..
ఓంకారేశ్వరుని జాతరలో ఎరుకల రాములు గారి యక్షగానం…..
శనివారం.. ఎవరింట్లో నైనా పూజ గంట గణ గణ మని మృోగగానే …
“ఫలహారం ఊల్లో..” అని పిలవక ముందే ..
పావురాల్ల గుంపులా పరుగెత్తి అందుకునేవాల్లం … మళ్లీ మళ్లీ అడుక్కోడం అదో థ్రిల్….
ఆకుల హనుమంతు..ధర్మయ్యల దాన గుణం…..
ఇలా ఇల్లిల్లూ ఓ గుడి ఆ ఇంట్లోని మనుషులే దేవుళ్ళు ..
ఏ కులమైనా ఏ మతమైనా,వావి వరుసలే ప్రేమకు వాకిళ్లు….
ఇంకా ఎన్నెన్నో గుండె లోతుల్లో … అన్ని జ్ఞాపకాలను పంచుకుందాం..
మా గురువు గారు కృష్ణన్న ఆశీర్వాదాలు అంది పుచ్చుకున్న
మా వివేకానంద యువత నేటి తరానికి ఆదర్శంగా ..మార్గదర్శిగా, వారధి గా నిలిచింది…..
నలభై ఏళ్ల పై బడిగా పట్నం వచ్చినా, తల్లి వూరి మట్టి వాసన గుబాళింపు, ఈ కట్టే కాలే వరకు ఉంటుంది…
పట్నం అత్తరు వాసనలు ఒంటికి పడ లేదు..
జీవనోపాధి కోసం వచ్చినా ..జీవి మాత్రం వూర్లోనే…
ఫ్చ్…. అప్పటికి…ఇప్పటికీ…ఎంతో తేడా…మా వూరు మాకే తెల్వకుంటైతుంది…
మా వూరు మాకే పరాయి దై పోతుంది…. నాకే కాదు మా సోపతి గాండ్లకు కూడా చేదెక్కుతుంది…
పట్నం పొగ ఊరి మొఖానికి కమ్మింది.
నేడు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వూరినే కానరాకుండ చేస్తుంది…
మద్యం మత్తులో మనం …
మనీ మత్తులో వాళ్ళు…
వాస్తవాల్ని గ్రహిద్దాం..అన్ని ఊర్ల పరిస్థితులు దాదాపు ఇలాగే ఉన్నాయి..గ్రామాల్ని రక్షించండి పర్యావరణాన్ని కాపాడండి… మళ్లీ కలుద్దాం..

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!