పొడుస్తున్న పొద్దు

పొడుస్తున్న పొద్దు

రచన :: నామని సుజనాదేవి

ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. పొయ్యి మీద ఉన్నఅన్నం తుక తుక ఉడుకుతా ఉంది. దాన్నే చూస్తున్న లక్ష్మి మనస్సు కూడా అలాగే కుత కుత ఉడికిపోతా ఉంది. ముందు రూమ్ లో పుస్తకాలు ముందు వేసుకుని కూర్చున్నారన్న మాటే గాని ఏడేళ్ళ నాని, పదేళ్ళ బుజ్జి ముఖాలు వాడి పోయి ఉన్నాయి. కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్న రామయ్య మొహం బాధ , కోపం సమ్మేలితమై జేవురించింది. ఒక మూల వాడిపోయిన పూల మాలలన్నీ కుప్పలుగా పోసి ఉన్నాయి.
అన్నాన్నే చూస్తూ ఆలోచనల్లో పడ్డ లక్ష్మి మనస్సు , ఇంతకు ముందు జరిగిన గొడవను మననం చేసుకుంటుంది. ‘రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు తమవి. ఎదో ఉన్నంతలో ప్రతిరోజూ గుడి దగ్గర పూలు అమ్మిన డబ్బులతో భర్త , నాలుగిళ్లలో పాచిపని చేసి సంపాదించే నాలుగు డబ్బులతో తను, పిల్లలిద్దరికీ ఎ లోటు రానీయకుండా చదివిస్తున్నారు.
కాని ఈ వారం రోజుల నుండే చాలా కష్టం గా ఉంది. ప్రపంచాన్ని గడ గడ వణికిస్తున్న కరోనా
వల్ల దేవాలయాలు, షాపులు, సినిమాలు , ఆఫీసులు అన్నీ మూల పడ్డాయి. వీధి వీధిన తిరిగి పూలమ్మి సింహంలా ఇల్లు చేరే భర్త , పిల్లి పట్టిన కోడిలా అయిపోయాడు. నాలుగిళ్లలో చకచకా పని చేసే తాను బయటకు వెళ్ళనీయక పోవడంతో ఏం తోచక కాలుగాలిన పిల్లిలా ఇంట్లోనే తిరుగుతుంది.
అసలే చిరాకుగా ఉన్న భర్త తో తాను ఇంట్లో కూరగాయలు , సరుకులు ఏవీ లేవని తెమ్మని పదే పదే అనడంతో గట్టిగా అరుస్తూ మీద మీదకు కొట్టడానికి వచ్చాడు భర్త. ఆ కోపంతో ఆకలన్న పిల్లలను నాలుగు దేబ్బలేసి తనూ అరిచింది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఇంట్లో జరిగిన ఈ సంఘటనతో బిత్తర పోయిన పిల్లలు ఆరున్నొక రాగం ఆలాపించి, కోపంగా తను నోట్లో నుండి మాట బయటకు రావద్దంటూ గద్దించడం తో బిక్కు బిక్కు మంటూ పుస్తకాలు ముందేసు క్కూర్చున్నారు.
భర్త రేడియో పెట్టినట్టున్నాడు . వార్తల్లో మరో ఇరవై ఒక్క రోజు వరకు లాక్ డౌన్ అంటూ ప్రధాన మంత్రి చెబుతున్నాడు. ఒక్కసారి ఉలిక్కి పడింది లక్ష్మి. లక్ష్మి తొమ్మిది వరకు చదివింది కాబట్టి అన్నీ అవగాహన చేసుకో గలదు. గబగబా ముందు రూమ్ లోని రేడియో దగ్గరకు వచ్చింది. అప్పటికే భర్త కూడా లేచి సౌండ్ ఎక్కువ పెట్టాడు. పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భద్రతా చర్యల్లో బాగంగా మూడువారాల పాటు దేశమంతా లాక్ డౌన్ చేస్తున్నట్లు చెబుతున్న ప్రధాన మంత్రి మాటలు వింటూనే అలాగే నిలువునా కూలబడి పోయాడు రామయ్య.
అక్కడే ఉన్న లక్ష్మి అమాంతం ,’అయ్యో..ఏమయిందయ్యా…..’ అంటూ ఇంతక ముందు కోపం మర్చి అమాంతం కూర్చుని రామయ్య తలను తన ఒళ్లోకి తీసుకుంటూ ,’మంచినీళ్ళు తెపోవే’ అంటూ అరిచింది కూతురు తో .
అరుస్తున్న లక్ష్మి కూతురు నీళ్ళు తేగానే అతని మొహం పై చిలకరించింది. నెమ్మదిగా కళ్ళు విప్పాడు రామయ్య. ఎక్కడున్నా అన్నట్లు ఒక్కసారి చుట్టూ చూసాడు. కాని మళ్ళీ అతని కళ్ళు వాలి పోయాయి. లక్ష్మి గుండెలు బాదుకుంటూ ఉండగానే ఇంటి ముందు వాన్ ఆగింది. ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి చేతులకు గ్లౌజులు వేసుకుని చేతిలో ఒక పాకెట్ పట్టుకుని లోనకు వచ్చారు.
లోన పరిస్థితి అర్ధం కాగానే బయటకు వెళ్లి తెల్లటి ఆప్రాన్ వేసుకున్న డాక్టర్ ని లోనకు పంపి వారు బయటనే ఉన్నారు. అతను వారందరినీ పక్కకు దూర దూరంగా ఉండమని చెబుతూ , ఫాన్ స్విచ్ వేసి కొంచెం నీళ్ళు చిలకరించాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు రామయ్య.
ఆయన కిట్ లో నుండి పేపర్ నాప్ కీన్ఇచ్చి మొహాన్ని తుడుచుకోమన్నాడు.
లేచి కూర్చున్నాడు రామయ్య.
‘ఎం లేదమ్మా…. కొంచెం నీరసం, మానసిక ఒత్తిడి వల్ల ఇలా అయ్యింది…. భయం లేదు… ఇదిగోండి ఈ గోలీలు తీసుకోండి. ‘ అంటూ గోళీలు ఇచ్చి ఎలా వాడాలో చెప్పాడు.
‘సడెన్ గా ఇలా ఎందుకయ్యింది సారూ ….’ అడిగింది లక్ష్మి.
‘ఏమయినా వినరాని మాట గాని ఆందోళన కలిగించే విషయం గాని విన్నాడా’ అడిగాడు డాక్టర్.
‘ వారం రోజులకే ఇంట్లో గడవడం కష్ట మయితాంది. చేసుకుంటే బతికే టోళ్ళం… ఇంకా ఇరవై ఒక్కరోజులు ఇలాగే లాక్ డౌన్ అని చెబితే విని ఇలా అయిపోయాడు సారూ’
‘ అమ్మా…. మీరు పని చేసేది ఎందుకోసం’
‘బతకడానికి…. పిల్లలకు మంచి సదువులు చెప్పించడానికి’
‘అదిగో అలా సదువులు చెప్పించాలంటే ముందు మనం బతకాలి కదా…. బతకాలి అంటే ప్రధాని గారు చెప్పినవి తప్పక పాటించాలి… మన దేశం కన్నా అమెరికా ఇటలీ లాంటి దేశాలు చాలా అభివృద్ది చెంది ఉన్నాయి. వారి దగ్గర హాస్పిటల్స్ గాని డాక్టర్లు గాని ఆధునిక యంత్ర పరికరాలు గాని చాలా చాలా ఉన్నాయి. అలాంటి దేశాలే ఈ ‘కరోనా’ వైరస్ను అరికట్ట లేక పోయాయి. అక్కడ హాస్పిటల్స్, సానిటైజర్లు, డాక్టర్లు ఇంకా ఇంకా కావాల్సిన పరిస్థితి ఉంది. అక్కడి కన్నా మనదగ్గర చాలా చాలా తక్కువ వనరులు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఈ ఊళ్ళో రెండు హాస్పిటల్స్ ఉన్నాయి. దాదాపు పది మంది డాక్టర్లు ఉన్నారు. వారు మహా అంటే వంద లేదా రెండు వందల మందికి చికిత్స చేయగలరు. ఈ ఊళ్ళో రెండు వేల మంది ఉన్నారు. ఒక వేల వారంతా జబ్బున పడితే ఏమవుతుంది… ‘
‘అబ్బో…. ఊహించుకోవదానికే దుర్భరంగా ఉంది సారూ…. కళ్ళ ముందంతా చీకటే కనిపిస్తాంది. అయినా అలా అందరూ ఒకేసారి ఎందుకు జబ్బున పడతారు?’
‘ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ కు అలాంటి శక్తి ఉంది. కరోనా వైరస్ ఉన్న వ్యక్తీ తో దగ్గరగా ఉండి మాట్లాడినా , లేదా ఆయన మాట్లాడినప్పుడు గాలిలోకి వచ్చిన ఆ వైరస్ లు మరో వ్యక్తీ కి సోకవచ్చు. ఆ సోకినా వ్యక్తీ మరో వ్యక్తీ దగ్గరకు రావచ్చు. లేదా ఆయన ముట్టిన వస్తువులను మనం ఎవరం తాకినా వస్తుంది. అదిగో ఆ మిషన్ కి ఉన్న సూది ని చూసావా… అంత చిన్న సూది పైన కొన్ని కోట్ల వైరస్ లు ఉండవచ్చు.’
‘అమ్మో…..’
‘ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు… కాని వాస్తవాన్ని తెలుపుతున్నా…. అలా కరోనా వైరస్ ద్వారా చనిపోతే ఆ మనిషిని ఎవరూ చూడడానికి, పూడ్చడానికి రారు సరికదా…. ఆ భస్మాన్ని కూడా ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇస్తారు. ఆది కూడా మనం చూడడానికి వీల్లేదు . అంత ఘోరమైన చావు. పైగా ఎవరికైనా అది సోకినా వెంటనే బయటకు తెలీదు. పద్నాలుగు రోజుల్లో ఎప్పుడైనా బయట పడవచ్చు. అందుకే అది ఒకరి నుండి ఒకరికి సోకకుండా ఇలా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది’
‘అమ్మో… ఇంత కధ ఉందా…. కాని ఇంట్లో సరుకులు లేవు ..మేమంటే ఎలాగో ఉంటాం. కాని పసిపిల్లలు వారి కేలా …పైగా పైసా సంపాదించక పొతే పస్తులే కదా ..ఇగ మాకు ఉరికోయ్యలె సరి ’
‘అదుగో అందుకే ప్రభుత్వం నగదు డబ్బులతో పాటు ఇంటింటికి నిత్యావసర వస్తువుల కిట్ , అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నది ..మేము అందుకే వచ్చాం … పొద్దున్న ఉదయించిన సూర్యుడు ఇపుడు అస్తమించి చీకటి కాలేదా…. అయినా రేపు మళ్ళీ సూర్యుడు వస్తాడు కదా…మళ్ళీ వెలుతురూ వస్తుంది కదా …చీకటి తర్వాత వెలుగు తప్పక ఉంటుంది… ఇంతకూ మీరు పడే కష్టం ఏమిటి ..కేవలం మీ కోసం, మీ వాళ్ళ కోసం ఇంట్లో ఉండడమే కదా…. ప్రధాని , పాలకులు చెప్పేది కేవలం మనందరి మంచికే కదా…. ఇపుడు సరిగ్గా పాటించక పొతే ప్రపంచం శవాల దిబ్బే అవుతుంది. కొన్ని పదుల సంవత్సరాల వెనక్కి ప్రగతి వెళ్లి పోతుంది . ’ అంటూ బయటి వాళ్ళని పిల్చి రెండు పాకెట్లు అందజేశారు.
‘మా కళ్ళు తెరిపించారు సారూ ….. ఇప్పటి నుండి మీరు చెప్పినట్లు , రేడియోలో చెప్పినట్లు బయటకు వెళ్ళం. తప్పక చేతులు కాళ్ళు గంటకోసారి శుభ్రమగా కడుక్కుంటాం . ….. చాలా సంతోషం సారూ…..’ చేతులెత్తి మొక్కారు లక్ష్మి తో పాటు ఇంటిల్లి పాది. చల్లని శీతల పవనం దేవదూతలా దీవిస్తున్నట్లు చల్లగా తాకింది.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!