మాతృభాష

మాతృభాష
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సంధ్యాసలోమి

 తేట తెలుగు మాట అమ్మ మాట
తేనెలొలుకు భాష అమ్మ భాష
అమ్మ భాష అపురూపం
ఆ భావం అనిర్వచనీయం

అమ్మ పాడే లాలిపాటలో లాలిత్యం
జోలపాటలో మాధుర్యం
అమ్మ ఒడి మాతృభాషకు గుడి
సకల శాస్త్రాలకు కళలకు లోగిలి

పలుకు పలుకులో పాండిత్యం
వేదాలలో ఆణిముత్యం
తెలుగు భాషా సౌందర్యం
తరతరాల సంస్కృతి
సంప్రదాయాల నిలయం

పరవశించే పదనిసలు
మది పులకరించే మాట విరుపులు
ప్రతి గమకములో సరిగమలు
ప్రతి రాగములో మధురిమలు

అందాల ఆటవెలదులు
తేనెలూరే తేట గీతులు
గుణపరిచే గుణింతాలు
తలకట్టూ దీర్ఘాలు

భాషకూ భావ వ్యక్తీ కరణకు
ఆత్మీయ అనురాగాలకు
సాహిత్య సౌరభాలకు తేనె పట్టు
అమ్మ భాష ఆయువు పట్టు
జ్ఞానానికి సృజనాత్మకతకు తొలి మెట్టు
వ్యక్తిత్వ వికాసానికి ఉనికి పట్టు

అష్టదిగ్గజాలను అలరించిన
కృష్ణదేవరాయ కీర్తిని చాటించిన
అన్నమయ్య క్షేత్రయ్య విశ్వనాధలనందించిన
కాళోజి గిడుగుల త్యాగఫలమున
గురజాడ జాషువా కృష్ణశాస్త్రుల పదమున
శ్రీ శ్రీ ఆరుద్ర సినారేల కలమున
నండూరి ఎంకిలా నాట్యమాడిన
బాపూ బొమ్మలా పరవశించిన భాష
ప్రభవించి పరిఢవిల్లిన భాష
తెలుగు నేలకు వన్నె తెచ్చిన భాష

తెలుగు భాషను బ్రతికిద్దాం
మాతృభాషను గౌరవిద్దాం
తెలుగుతల్లిని తేటతెలుగు
ముత్యాల మాటలతో అలంకరిద్దాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!