మధురమైన భాష
రచన: యువశ్రీ బీర
ఏ దేశమేగినా, ఏ భాషను నేర్చినా…
వీడబోకు నీ భాషను, అమ్మ నేర్పిన తెలుగు భాషను…
ఎంత కీర్తిని తెచ్చిందో నీవు పలికే ఈ భాష…
ఎన్ని కవనాలకు ప్రాణం పోసిందో…
మనం మాట్లాడే ఈ తెలుగుభాష….
అదరాలపై తేనెలసోనలు…
అమ్మ లాలిపాటలో దాగెను, అందాల రాగమై…
నాన్న మురిపాలలో ఒదిగెను,రమ్యమైన భావమై…
అక్క అనురాగంలో నిలిచెను, ఆత్మీయ కావ్యమై…
ఎన్నెన్నో బంధాలను పెనవేసిన మన తెలుగుభాష…
అమ్మ నేర్పిన భాష…
గురువు బోధించిన భాష…
అధరాలపై తొణికిసలాడు…
తేటతేనియల భాష మన తెలుగు భాష….
సంభోదనలో సప్త స్వరాలు పలికిస్తూ…
సంభాషణలో ఛలోక్తులు విసురుతూ…
చిన్నారులను లాలించే జోలపాటల సోయగం….
చింతలలో ఓదార్పునిచ్చు అమ్మప్రేమ…
ఆత్మీయతానురాగాల పలకరింపుల తెలుగు…
పరభాషలునేర్చి మన భాషనువీడి…
చులకన చేయొద్దు, మన తెలుగు భాషను…
నీకు ఓనమాలు నేర్పిన అమ్మభాష తెలుగు…
పునాదిగా ఉన్న నీ భాషను వీడి…
అనాదిగా ఉన్న మన తెలుగుభాషను…
అనాథను చేయబోకు పరభాషను నేర్చి…