మన రాజుగాడి కథలు

అంశం: హాస్య కథలు

మన రాజుగాడి కథలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

అక్క చంద్రమ్మ గారింటికి రైల్లో బయల్దేరేడు నారాయణ తన ఐదేళ్ల కొడుకు రాజుని ఆమె ఇంట్లో పది పదిహేను రోజులు ఉంచి రావడానికని. ఆ ఊర్లో రైలు దిగిన తర్వాత, పిల్లాడికి టిక్కెట్ లేదని ప్లాట్ఫారం టికెట్ కలెక్టర్ పట్టుకున్నాడు. పిల్లాడికి ఇపుడిపుడే నాలుగో యేడు వచ్చిందని, అందువల్ల టిక్కెట్ కొనలేదని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఫైన్ వ్రాసేయబోయాడు కోపిష్టి ముఖంతో. ఇంతలో పిల్లాడు రాజు “నాకు ఐదో యేడు వచ్చేసి చాన్నాళ్ళైంది కదా నాన్నా” అన్నాడు. ఆ మాటలకు ఆ టికెట్ కలెక్టర్ కి నవ్వొచ్చేసింది, మన రాజుగాడి నిజాయితీకి మెచ్చుకొని, వదిలిపెట్టేశాడు.
ఓ సారి సినీమా కు తీసుకెళ్ళింది రాజుని చంద్రమ్మ. సినిమా హాల్ గేటు సమీపిస్తుండటంతో మరోసారి హెచ్చరించింది ఆమె తనమేనల్లుడు రాజుని “కళ్ళు మూసుకుని పడుకో! లేపినా లేవద్దు” అని. ఇదేమాట అంతకుముందే చెప్పి, చటుక్కున చంకనెక్కించేసుకుంది ఆమె ఆ ఐదేళ్ళ పిల్లాడిని. గేటు వాడికి తన టిక్కెట్ ఇచ్చేసి లోనకు హడావుడిగా వెళ్ళిపోబోయింది. ఇంతలో గేటు వాడు అడ్డుకొని పిల్లాడికి టిక్కెట్ అడిగితే “వీడు చిన్న పిల్లాడు, సినీమా ఏమి చూస్తాడు, నిండా మూడేళ్ళు కూడా లేవు, నిద్ర పోయాడు, టిక్కెట్ ఎందుకు, ఏం అక్కర్లేదు” అని చకచకా చాకచక్యంగా చెప్పేసి లోనికి దూరేసింది చంద్రమ్మ. నిద్ర నటించే రాజు నిజంగానే నిద్రపోయాడు. ఎక్కువ సేపు అలా మోస్తూ కూర్చోలేక, ఆవిడ రాజుని లేపి,  పక్క కుర్చీలో కూర్చోబెట్టింది. పట్టుమని పది నిమిషాలు కూడా కాలేదు, మన రాజుగాడు చక్కగా మరో కుర్చీలో కూర్చుని సినిమా చూడడం గేటువాడికి దొరికిపోయిన ఆమెకు మరో టిక్కెట్ తీయడం తప్పలేదు.   మేనత్త గారింటికి దూరపు బంధువులొచ్చి, తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళని బస్సుకి దిగబెట్టడానికి వెళ్ళేరు మేనత్త చంద్రమ్మ, మేనల్లుడు రాజూను. అక్కడ ఎండలో చాలాసేపు నిలబడ్డ వీళ్ళలో ఇద్దరికి సోడాలు తెచ్చి యిచ్చేడు రాజు దగ్గరలో ఉన్న చిన్న అంగడి నుంచి ఇంతలో వీళ్ళత్త కూడా సోడా అడిగితే తెచ్చి ఇచ్చేడు. ఆ తర్వాత ఆ చుట్టాలలో మరొకావిడ కూడా అడిగితే, ఆమెకూ మరోసోడా తెచ్చి యిచ్చేడు. ఇదంతా గమనిస్తున్న ఎవరో తెలియని ఒకామె ” ఓయ్ సోడాలబ్బాయ్! నాకు ఒక సోడా తీసుకురా” అంది. వెంటనే ఇంకొకామె “బాబూ! మాకు రెండు సోడాలు కావాలి” అన్నాది. మన రాజుగాడికి చిర్రెత్తుకొచ్చి, “ఏం మీకెలా కనబడుతున్నాను? సోడాలమ్మేవాడిలా కనబడుతున్నానా?” అన్నాడు కాస్త కోపంగానే. “అయ్యో బాబూ! మాకు తెలీదమ్మా!” అని నాలిక్కరుచుకున్నారు. ఇంతలో బస్సు రావడం, అందరూ బస్సెక్కేసి వెళ్ళిపోవడం వెంటవెంటనే జరిగిపోవడంతో చంద్రమ్మ ఏమీ అనలేక పోయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!