మనిషే గెలుపు

మనిషే గెలుపు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:చందలూరి నారాయణరావు

సృష్టిని
చిటికిన వ్రేలు పట్టుకుని
నడిపించే కాలం.

సృష్టిలో ఓ అద్భుతాకృతి మనిషికి
కోట్ల సంవత్సరాలు నడిచినా
తీరని కోరిక
దొరకని జవాబు కాలం చిరునామా..

ప్రశ్న రుచిమరిగిన మనిషి
తత్వం, శాస్త్రం,యోగం, జ్ఞానం, తపస్సు
పరిశోధన, ప్రయోగం,పరీశీలనలతో
ఎత్తిన రూపాలెన్నో…..

ఎంతో లోతుగా తవ్వుతూ
ఎంతో ఎత్తును గురి చూసాడు.
ఎంతో బరువును మోస్తూ
ఎంతో తేలికగా మారాడు…

ఎన్నో ప్రశ్నలను పుట్టించి
ఎన్నిటికో జవాబులు కనిపెట్టారు.
ఎన్నిటికో జవాబుగా మారి
ఎన్ని ప్రశ్నలను చంపేశాడు.

సముద్రానికి భయపడుతూనే
మార్గాన్ని కనిపెట్టాడు.
ఆకాశాన్ని అమాయకంగా చూసినవాడే
అంతరిక్షానికి ఎగపాకాడు.
చిన్న రాయితో మాట్లాడం నేర్చుకుని
పర్వతాన్ని లొంగదీసుకున్నాడు.
భూమిని ఆలోచిస్తూనే
మరో భూమిని ప్రేమిస్తున్నాడు.

తరం తరం నిరంతరం
మానవ మేధస్సు
ప్రశ్నతో హద్దులు చేరిపి
ప్రాణం ఎరగా వేసైనా సరే
రహస్యం వైపు విజయం నేర్చుకుంది…

కాలం చుట్టూ తిరుగుతూ
కాల మహిమకు గురౌతూ
కాల పరీక్షలు ఎన్నో వ్రాసి
కాల ప్రశ్నను ఢీ కొంటూ

కాలాన్ని
శత్రువుగా పోరాడుతూ
మిత్రుడుగా అభిమానిస్తూ
బంధువుగా ప్రేమిస్తూ..
దైవంగా ఆరాధిస్తూ
భూతంగా భయపడుతూ
రహస్యంగా పరిశోధిస్తూ
విచిత్రంగా విస్తుపోతూ
తన అడుగును వినిపిస్తూనే ఉంది.
తన మాటను గెలిపిస్తూనే ఉంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!