మేడారం జాతర
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
వ్యాసకర్త: విస్సాప్రగడ పద్మావతి
జాతర అంటే జనం. జనం ఒక చోట గుమిగూడి, కష్టసుఖాలు పంచుకోవడం. జాతర పదం సంస్కృత పదం. మేడారం జాతర భారతదేశంలో తెలంగాణలో అతిపెద్ద జాతర. వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామం వద్ద అడవి మధ్యలో చిలకలగుట్ట ఉన్నది. చుట్టూ దట్టమైన అడవి.ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు రోజులపాటు జరిగే జాతర ఇది.
మాఘశుద్ధ పౌర్ణమి మొదలుకొని మూడు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. పూర్తిగా గిరిజన సంప్రదాయ రీతిలో జరుగే జాతర ఇది.. తెలంగాణా రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షల మంది భక్తులు విచ్చేస్తుంటారు. గిరిజన దేవతామూర్తులుగా కొలిచి, ఆరాధించే సమ్మక్క-సారక్కలు ఇరువురు తల్లీకూతుళ్లు. గిరిజనుల హక్కుల కోసం ఎదురుతిరిగి పోరాడిన వీరవనితలు.
జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం చేస్తారు. ఆ గుట్టను అక్కడ ప్రజలు పవిత్రమైనదిగా భావిస్తారు. జాతరకు ముందు ఒక కోయ యువకుడు చిలుకలగుట్ట మీదకు వెళ్ళి, పసుపు కుంకుమ, వెదురుగడ తెచ్చి సమ్మక్క సారక్కల గద్దెలపై నిలబడడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు
సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దే అని సారలమ్మ వీర మరణం పొందిన చోటును పిల్ల గద్దె అని అంటారు. ఈ తతంగానికి దేవతలను ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడోరోజు దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
ఈ జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచిపెడతారు. అంతేగాక ఒడిబియ్యం, తల వెంట్రుకలు ఇవ్వడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు.
ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది.1996 నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత ప్రాచుర్యం ఏర్పడింది.
బాగుంది. మంచి విషయం