విద్యావంతులు – విదేశపయనం

విద్యావంతులు – విదేశపయనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: సావిత్రి కోవూరు

మనదేశంలోని విద్యావంతులెందరో విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడి పోతున్నారు.
ఉదాహరణకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో  సగం మందికి  పైగా విద్యార్థులు పై చదువులకై అమెరికాలాంటి దేశాలకు వలస వెళ్లి అక్కడే జీవనోపాధి చూసుకుని స్థిర పడి పోతున్నారు. ఒక్కొక్క ఇంజనీర్ ను తయారు చేయడానికి మన ప్రభుత్వానికి ఐదు లక్షల పైనే ఖర్చవుతోంది. అదే ఐఐటి కాలేజీ లలో అయితే 20 లక్షల నుండి 50 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత ఖర్చు చేసిన ఆ విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఆ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
ఎందుకు ఈ పరిస్థితి కలుగుతుందంటే వారి సామర్ధ్యానికి తగిన ప్రతిఫలం మనదేశంలో దొరకటం లేదు. అందువలన వారు విదేశ పయనానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఆ విధంగా మన దేశం ఇంజనీర్లను తయారు చేసే కర్మాగారంలా, లక్షల మంది ఇంజనీర్లను తయారుచేసి ఇతర దేశాల అభివృద్ధికి ఉచితంగా పంపిణీ చేసి చాలా నష్టపోతున్నది. ఇతర దేశాకెళ్ళిన విద్యార్థులకు అక్కడ భారీ మొత్తంలో వేతనం విలాసవంతమైన జీవితం లభ్యమవుతుంది. ఉద్యోగం దొరికిన రెండు సంవత్సరాల లోపే అక్కడ సొంత ఇంటిని కట్టుకో గలుగుతున్నారు. అదే మన దేశంలో ఒక ఇల్లు కావలసిన ప్రదేశంలో కట్టుకోవాలంటే చాలా కాలం పడుతుంది.
మన దేశంలో ముగ్గురు వ్యక్తులు చేసే పనిని ఒక వ్యక్తి చేత చేయించడం వలన ఉద్యోగస్తులు శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఒత్తిడికి గురై అనారోగ్యాల పాలవుతున్నారు. అక్కడ పని గంటలు చాలా తక్కువ ఉండటం వల్ల ఒత్తిడికి గురి కాకుండా, తమ వ్యక్తిగత  జీవితానికి ప్రాముఖ్యతను ఇవ్వడానికి సమయం దొరుకుతుంది. వారమంతా కష్ట పడిన వారు సంతోషంగా, ఉల్లాసంగా గడపడానికి అక్కడ ఎన్నోటూరిస్ట్  ప్రదేశాలు, బీచ్ లు ఉంటాయి. అభివృద్ధి పరిస్తే మన దేశంలో కూడా ఎన్నో మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. కాని వానిని అభివృద్ధి పరచి మంచి ఆదాయం పొందవచ్చునన్న ఆలోచన తీరిక మన ప్రభుత్వలకు ఉండదు.
మన దేశ జనాభా చాల ఎక్కువవ్వడం వలన ఎక్కడికైనా వెళ్లాలంటే రోడ్లపైన తిరిగే విపరీతమైన వాహనాల పొగ, రణగొణలతో ఆరోగ్యం పాడవడం, గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ లతో విసిగిపోయి అదొక పనిష్మెంట్ లాగా ఉంటుంది. అక్కడ చాలా ప్రాంతాలలో జనాభా చాలా తక్కువ. అంతే కాకుండ చిన్న పల్లెటూర్లలో కూడ, పట్టణాలలో ఉన్నటువంటి విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు, దుకాణ సముదాయాలన్ని ఉండటం వల్ల ప్రజలందరు పట్టణ ప్రాంతాలకే పరిమితం కారు.
అక్కడ ఎక్కడికి వెళ్లాలన్నా చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ జన సమర్థం వలన ఎక్కడికైనా వెళ్ళాలంటే  ఒక పెద్ద పనిష్మెంట్ లా ఉంటుంది. అక్కడ ఎంత మంచి పాఠశాల అయినా పాఠశాల విద్య పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ స్వచ్ఛమైనగాలి ఉంటుంది. మన దగ్గర లాగా కర్మాగారాల నుండి వెలువడిన విషవాయువులతో కలసి పొల్యూట్ అయిన గాలి కాకుండా, స్వచ్ఛమైన గాలి ఉంటుంది.
ఎందుకనగా అక్కడ అటవీ సంపద ఎక్కువ వాళ్లు అడవులను పెంచడంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారు. వాళ్లకి అవసరమైన కలప ఇతర ప్రదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. కానీ వారి అటవీ సంపదను నాశనం చేసుకోరు. అక్కడ చాలా వరకు వస్తువులు గాని, తినుబండారాలు గాని నాణ్యమైనవి దొరుకుతాయి. అక్కడ  కల్తీ చేసిన ఆహార పదార్థాలను, నాణ్యత లేని వస్తువులను విక్రయించినట్లైయితే భారీ మొత్తంలో జరిమానా, శిక్షలు విధిస్తుంది ప్రభుత్వం. అక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది. కనుక ప్రభుత్వాలు కల్పించే ప్రణాళికలు, సౌకర్యాలు, వనరులు అన్ని అందరికీ అందుబాటులో ఉంటాయి.
కనుక విదేశాలకు వెళ్లిన విద్యార్థులు అక్కడే ఉద్యోగాలు చూసుకుని అక్కడే స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!