అందని వెన్నెల

(అంశం:: “అర్థం అపార్థం”)

అందని వెన్నెల

రచన:: బండి చందు

అనుకోకుండా పుట్టిన ప్రేమలోనే అంతో ఇంతో ఇష్టమనేది కనపడుతుంది. అదే ఎప్పటికీ అమరప్రేమగా చరిత్ర సృష్టిస్తుంది. అలాంటి ప్రేమలు చాలా అరుదుగా పుడుతుంటాయి. కానీ నిజానికి ఆ ప్రేమ కొందరికే దొరుకుతుంది అలాంటి కథే నాది కూడా…

నా పేరు చందు నేనో నిత్య విద్యార్థిని. కొందరైతే పుస్తకాల పురుగు అని కూడా అంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బస్టాప్ లో బ్యాగ్ తో నిల్చున్నాను. బస్టాప్ ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది. చాలాసేపు వెయిటింగ్ తరువాత బస్ వచ్చింది. ఖాళీగానే ఉండడంతో కిటికీ పక్కన సీట్లో కూర్చున్నాను.

ఇంతలో ఎవరో ఈ బస్ సిద్దిపేట వెళ్తుందా అని అడిగారు. ఆ పిలుపులో ఏదో తెలియని మాధుర్యం. తల తిప్పి చూసాను తెలుపు రంగు చుడిదార్ లో ఉన్న ఆ అమ్మాయి అప్పుడే భూలోకం చూడడానికి దివి వదిలి వచ్చిన దేవకన్యలా ఉంది. చూడగానే నచ్చేసింది అందుకే నా నోటా మాట రాలేదు తనని అలాగే చూస్తూ ఉండిపోయాను. తను మళ్ళీ పిలిచి ఇది సిద్దిపేట వెళ్లే బస్సెనా అని అడిగింది. అవును అని తల ఊపాను. తను ఇప్పడే బయల్దేరుతుందా ఇంకా టైం ఉందా అని అడిగితే హా! బయల్దేరుతుంది చాలాసేపు అవుతుంది బస్ స్టాప్ లో బస్ ఆగి అని చెప్పాను. వెంటనే ఆ అమ్మాయి తన లగేజ్ తీసుకొని బస్సులోకి ఎక్కింది. నా వెనకాల సీట్ ఖాళీగా ఉంటే కూర్చుంది.

నాకు తనను పదేపదే చూడాలని అనిపించినా మాటిమాటికి వెనక్కి తిరిగిచూస్తే బాగుండదు అని బ్యాగులో నుండి చదవడానికి బుక్ తీసాను. కొన్ని పేజీలు తిరగేసాను కానీ మనసంతా ఆ అమ్మాయి వైపే ఉంది. ఇంతలో తను మీరు పీజీనా అని అడిగింది. అవును మీకెలా తెలుసు అని అడిగితే తను నేను కూడా పీజీనే మీ చేతిలో ఉన్న బుక్ చూసి చెప్పాను. నా పేరు లావణ్య మాది సూర్యాపేట. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో సీట్ వచ్చింది అక్కడే పీజీ చేయడానికి వెళ్తున్న అని చెప్పింది. నా ఆనందానికి హద్దే లేదు. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఆ కాలేజ్ పక్క గల్లీలోనే. తనకి ఆ విషయం చెప్పాను తను ఎంతో సంతోషంతో హమ్మయ్య అయితే నాకు కాలేజ్ లో జాయిన్ అవ్వకముందే ఒక ఫ్రెండ్ దొరికాడు అని అంది. తను నన్ను ఫ్రెండ్ గా ఒప్పుకునందుకు మా అమ్మమ్మకి లోలోపలే థాంక్స్ చెప్పుకున్నా.

బస్ బయల్దేరిన రెండు గంటల తరువాత సిద్దిపేట చేరుకుంది. తను లగేజ్ తీసుకుంటూ ఫోన్ నంబర్ ఇచ్చి నేను కాలేజ్ దగ్గర్లోనే లేడీస్ హాస్టల్ లో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. బస్సులోనే తనను ఇష్టపడుతున్నానని చెప్పాలని ఉన్న ఏమనుకుంటుందో అని భయంతో చెప్పలేదు. నిరాశతోనే నేనుకూడా ఇంటికి వెళ్ళాను కానీ మది నిండా తన ఆలోచనలే. మళ్ళీమళ్ళీ తనను చూడాలని తనతో ఏదో ఒకటి మాట్లాడాలని ప్రతిక్షణం ఒక యుగంలా గడిపాను. తనతో మాట్లాడాలని ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ కలవలేదు. నంబర్ సరిగ్గా తీసుకున్నానో లేదో అని నన్ను నేనే తిట్టుకున్న. రెండు రోజుల తరువాత లావణ్య చెప్పిన హాస్టల్ దగ్గరకి వెళ్ళి తన వివరాలు చెప్పి ఒక్కసారి పిలుస్తారా అని అడిగాను.

కొద్దిసేపటి తరువాత తను పరిగెత్తుకుంటూ నా వద్దకి వచ్చింది. తన కళ్ళలో పాత స్నేహితుని చూసిన ఆనందం కనిపించింది. చాలాసేపు మాట్లాడుకున్న తరువాత ధైర్యం చేసి నా మనసులో మాట తనకి చెప్పాను. తను మౌనంగా ఏమి మాట్లాడకుండా కనీసం తిరిగి చూడకుండా ఎంత పిలిచినా వినకుండా హాస్టల్ లోనికి వెళ్ళిపోయింది. హాస్టల్ వాళ్ళు విసిటింగ్ టైం అయిపోయిందని చెప్పి నన్ను వెళ్ళిపొమ్మన్నారు. తరువాతి రోజు లావణ్యని కలవడానికి మళ్ళీ వెళ్ళాను. మాట్లాడడానికి రానని చెప్పిందని తన ఫ్రెండ్ వచ్చి చెప్పింది. ఎన్నిసార్లు హాస్టల్ కి వెళ్లిన అదే సమాధానం ఎదురయ్యేది. రోజు హాస్టల్ కి వెళ్ళడం నిరాశతో ఇంటికి వచ్చేయడం ఇలా పది రోజులు గడిచాయి.

నాపై నాకే అసహ్యం వేసింది. ఇక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తరువాత రోజు హాస్టల్ కి వెళ్ళలేదు. తనతో మాట్లాడిన క్షణాలను గుర్తుచేసుకుంటూ అక్కడే ఉండలేక అమ్మమ్మకి చెప్పి మా ఊరు బయలుదేరాను. నిజానికి తను నాలో ఒక స్నేహితున్ని చూసింది నేను మాత్రం లేనిపోనివేవో ఊహించుకొని ఒక మంచి స్నేహితురాలిని దూరం చేసుకున్న. బహుశా నేనె తనని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!