ప్రశ్నార్థకం

(అంశం:: “అర్థం అపార్థం”)

ప్రశ్నార్థకం

రచన:: పి. వి. యన్. కృష్ణవేణి

కళ్ళు విప్పుడు పడట్లేదు.  కానీ తెల్లగా తెల్లవారింది.  అబ్బా నిద్ర నుంచి మెలకోవాలా?  అన్నట్టు బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాను.

నెమ్మదిగా మంచం దిగి, బెడ్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాను. బ్రష్ చేసుకుని;  మనసులో ఉన్న భయంతో ఎప్పుడో అలవాటు పడిన హోమియో మందులు టైం ప్రకారం వేసుకుని కిచెన్ లోకి వెళ్లాను.

ఒక స్టవ్ మీద పాలు పెట్టి ఇంకో సో మీద కాఫీ డికాషన్ పెట్టాను ఏంటో భవిష్యత్తు అంటే భయంగా,  గతం ఒక మరపురాని తీపి గుర్తుగా మిగిలిపోయింది  అందరి జీవితాల్లో.

ఒక చిన్న కణం, ఎలా పుట్టిందో తెలియదు!!! ఎప్పుడు పుట్టిందో తెలియదు!!!! కానీ ప్రపంచాన్ని మొత్తాన్ని కదలాడిస్తోంది. ప్రపంచం స్తంభించిపోయింది.

ఇలా ఆలోచనలో ఉన్న నాకు,  కాఫీ డికాషన్ వాసనతో కలలో నుంచి ఇలలోకి అడుగు పెట్టాను.

కమ్మనైన కాఫీ,  గుమగుమలాడే రుచితో సిద్ధం చేశాను.  రెండు కప్పుల నిండా కాఫీ పోసి, మా వారికి ఒక కప్పు ఇచ్చి,  నేను ఒక కప్పు తీసుకున్నాను.

అప్పటికే వార్తలు చూస్తూ ఉన్న మా శ్రీవారు నేను రావడం చూసి చిరునవ్వుతో కాఫీ కప్ అందుకున్నారు. అతని మొహంలోని ఆనందం,  రాత్రి తాలూకా తీపి జ్ఞాపకాలు అతని కళ్ళల్లో కదలాడుతున్నాయి.  సిగ్గుతో తల దించుకున్నాను.

ఇదేంటి పెళ్లి అయిన పదేళ్ల తర్వాత, కొత్తగా ఇప్పుడు సిగ్గు పుట్టుకొచ్చింది నాకు అనుకుంటూ ఉంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

నా ధోరణి అతనికి అర్థం కాక ముందే , రిమోట్ తీసుకుని టీవీలో పాటలు ఛానల్ పెట్టాను. నాకు ఇష్టమైన నాగార్జున పాట, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది అంటూ వస్తోంది.  సరదాగా హమ్ చేస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను.  హాయిగా, ఆహ్లాదంగా,  ఆనందంగా ఉంది బయట వాతావరణం కూడా.

నన్ను అలా చూసిన మా వారు ముసిముసిగా నవ్వుకోవడం నేను పక్క నుంచి అదే క్రీకంట కనిపెట్టక పోలేదు.

కాసేపటికి లేచి స్నానం చేసి వచ్చి, మా ఇద్దరికీ ఇష్టమైన లేత గులాబీ రంగు చీర కట్టుకొని, తలలో పువ్వులతో,  చేతినిండా గాజులతో  అలంకరించుకుని నన్ను నేను అద్దంలో చూసుకుని మురిసిపోయాను.

దేవుడి దగ్గర దీపం వెలిగించి,  మనసారా ఒక నమస్కారం చేసి,  ఇంకా పెద్దగా ఆశలు లేవు నాకు. దేవుడా!!! నా ఈ ఆనందాన్ని నా నుంచి దూరం చేయకు ఎప్పటికీ … అని ఒక కోరిక మాత్రం చెప్పుకొని పూజ ముగించాను.

కొంత సేపు అలాగే ప్రశాంతంగా గడిపిన తర్వాత లేచి,  గబగబా టిఫిన్ రెడీ చెయ్యసాగాను. పక్కనే ఉండి మావారి అందిస్తున్న సహాయంతో పూరి కూర అమోఘమైన రుచితో తయారుచేశాను.

టిఫిన్ చేసిన మా వారు,  ఏదో ఆఫీస్ పని అంటూ కంప్యూటర్ ముందుకు వెళ్ళిపోయారు. మా ఆఫీసు వాళ్ళు నాకు ఎలాట్ చేసిన నా పని పూర్తి చేసి,  డేటా వాళ్ళకి పంపించాను.

ఒకవైపు వంట పని పూర్తి చేస్తూ,  నా చేతి వెనకే అటూ ఇటూ తిరిగే పిల్లల గుర్తుకు రాగా…  వాళ్లకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాను.

అన్ని పనులు ముగించుకుని, స్థిమితంగా సోఫాలో కూర్చుని రిలాక్స్ గా టీవీ చూస్తున్నాను. టీవీ లో ఏదో సిగ్నల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అచ్చం మన జీవితాలు లాగా.

ఉరుకులు పరుగుల జీవితంలో పడి, మానవుడు దేవుడు ఉనికిని మర్చిపోయారేమో అని సందేహం వచ్చిన దేవుడు మనకి కూడా పాజ్ బటన్ పెట్టారేమో, అందుకే లోకం మొత్తం స్తంభించిపోయింది అనిపించింది.

అవును మరి ఏరోజైనా ఇలా తీరుబడిగా కూర్చుని

వంటల రుచి అభినందించామా!!!

ప్రకృతి అందాన్ని ఆస్వాదించామా!!!

పూల వాసలను తనివితీరా పీల్చుకున్నామా!!!

బంధంలో ఉన్న గొప్పదనాన్ని చవి చూశామా!!!!

పిల్లల ముద్దు మాటలను ఆలకించామా!!!

కానీ ఇప్పుడు పరిగెత్తే జీవితాలను ఎవరో పట్టుకుని ఆపేసినట్లు,  పరిగెత్తే మనుషులకు కాళ్ళకు ఏదో అడ్డు పడినట్టు,  పరిగెత్తే కాలానికి కళ్ళం వేసినట్టు ఒక్కసారిగా స్తంభించిపోయింది జీవనం.

ఏది వచ్చినా మన మంచికే అనుకోవాలేమో!!! అందుకే పెళ్లి అయ్యి పది ఏళ్ళు దాటిన తర్వాత మాకు ఇప్పటికి ఆ బంధంలో విలువ తెలిసింది.

ఇన్నేళ్ళలో అపార్ధాలతో కలత చెందిన మా మనసులు మొదటి సారి ఒకరి మనసును ఇంకొకరం అర్థం చేసుకునే మానసిక పరిపక్వత పొందాము అంటే విడ్డూరంగా ఉండదేమో!!!!

ఆ ఫీలింగ్, సరిఅయిన సమయం మా ఆనందాలకు కేటాయించలేక పోవటం వల్ల కూడా కావచ్చు.

ఎన్నో సంవత్సరాల కిందట నుంచి తాగటం మొదలుపెట్టిన కాఫీ రుచి ఇప్పటికి తెలుస్తోంది. అంటే ఆ కాఫీ రుచి ఆస్వాదించే సమయం కేటాయించలేకనే కదా!

ఎప్పుడూ వెన్నంటే ఉండే పిల్లలు,  ఇంటిపట్టునే ఉండి ఉండీ వారి మనసుల్లో ఒక రకమైన చిరాకు వచ్చి, అమ్మా, నువ్వు మాతో లేక పోయినా పర్వాలేదు. మేము సెలవుల్లో  అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం అనే అంతగా ఎదిగారంటే కాలం ఎలా మారిందో కదా!!!

స్కూలు, ట్యూషన్, ఇతర క్లాసులు ఏమీ లేకపోవడంతో స్వేచ్ఛగా బాల్యాన్ని ఆస్వాదిస్తున్న వారి ఆనందాన్ని నేనెలా ఆపగలను???

కానీ చదువు అయిపోయిన తర్వాత వారు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా కాని,  పై చదువుల కోసం కానీ  వేరే ఊరికి వెళితే!!!! అప్పుడు కూడా మేము ఇద్దరమే… ఇలాగే ఉండాలా అన్న ఆలోచన భవిష్యత్తు మీద భయం కొలుపుతోంది.

ఆలోచనలో ఉన్న నేను, ‘ హాసిని ఏంటి మళ్లీ ఏదో ఆలోచనలో పడినట్లు ఉన్నావు?’ అన్న మా వారి పిలుపుతో ఈ లోకం లోకి వచ్చాను.

నేను అలా ఉంటే ఆయన బాధ పడతారన్న ఆలోచనతో,  ముఖానికి నవ్వు పులుముకుని నా పక్కన కొంచెం చోటు చూపించాను కూర్చోమన్న ఉద్దేశంతో.

‘పిల్లల గురించి ఆలోచిస్తున్నావా’ అన్నారు నా మొఖం చూస్తూనే..

అదేం లేదు,  మీ వర్క్ అయిపోతే భోజనం చేద్దాం అన్నాను మాట మార్చడానికి ప్రయత్నిస్తూ.

ఆ…  ఏం వర్క్ హాసిని? ఆఫీసులో ఉండే దానికంటే ఇంట్లో ఉండి పని చేస్తే ఇంకా పని ఎక్కువగా కనిపిస్తోంది.  కానీ ఏమి ఉపయోగం కనిపించట్లేదు.

అదీ కాక ఈ నెల జీతాలు కూడా చాలా వరకు తగ్గించి ఇస్తారట. ఎట్లా గడుస్తుందో ఇల్లు. జీవితం ఎటు పోతోందో  అర్థం అవ్వట్లేదు అన్నారు ఆయన బాధగా.

అవునండి, మా ఆఫీసు వాళ్ళు కూడా అలాగే చెప్పారు.  జీతం చాలా వరకు తగ్గించే ఇస్తారట.  సరే చూద్దాం ఏం జరుగుతుందో అన్నాను.

ఏం లాక్ డౌన్ …  బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది.  ఇలాగే ఇంట్లో కూర్చుంటే జీవితం సాగేదెలా!!! ఇంకా రెండు నెలలు పరిస్తితి ఇలాగే ఉంటే, ఇలా కూడా ఉండవు మన జీవితాలు.

సంపాదించిన డబ్బు ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉంటే, రేపు పిల్లల భవిష్యత్తు ఏమిటో ప్రశ్నార్థకంగానే ఉంది … అంటూ తన గుండెల్లో నీ బాధ అంతా వెళ్లగక్కారు.

సగటు మధ్య తరగతి మనిషి ఆవేదన అదే కదా!!! గతంలోని తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, వర్తమానంలో జీవితాన్ని ఎలాగో వెళ్లదీస్తూ, జీవిత భాగస్వామి పడే బాధలను అర్దం చేసుకుని, భవిష్యత్తు పై ఆశ తో జీవితాన్ని నెట్టుకురావడం.

కానీ ఇప్పుడు పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది.  భవిష్యత్ అంటూ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అందరి జీవితాల్లోనూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!