ప్రక్రియ :: సున్నితం
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు
రచన :: గద్వాల సోమన్న
కన్నులపండుగ మహిలో మొక్కలు
అందాలొలికే నింగిని చుక్కలు
ప్రాణాధారము నిలుపును అసువులు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
ధరణితలంలో మొక్కలు నాటుము
జగతిప్రగతికి బాటలు వేయుము
నలుదిశలా దేశకీర్తి చాటుము
చూడచక్కని తెలుగు సున్నితంబు!
జగమంతా పచ్చదనము పెంచుము
అంతులేని ఆనందము పంచుము
హరితహారమే పుడమికి వేయుము
చూడచక్కని తెలుగు సున్నితంబు!
పర్యావరణ పరిరక్షణ మేలు
పట్టుదలతో నాటిన పదివేలు
హరితవిప్లవము నడిపితే చాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
కన్నబిడ్డలా మొక్కలను చూడు
నిర్లక్ష్యమును తక్షణమే వీడు
చేయెద్దోయ్ పుడమిని వల్లకాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు
