నీకు నచ్చాలని తాపత్రయపడుతున్నా!

నీకు నచ్చాలని తాపత్రయపడుతున్నా! 

 

తెల్లని చొక్కా కండువా ధరించి

తెలుగువాడిలా తయారయి

తారసపడిన తెలుగింటి తరుణినికోరి

తహతహలాడుతున్నా తాపత్రయపడుతున్నా!

 

మంచిమంచి మాటలతో

భాసిల్లేటటువంటి భావాలతో

అందమైన అల్లికలతో

కమ్మనైన కవితలు రాస్తున్నా!

 

వేషము మార్చుకున్నా

బాషను మెరుగుపరుచుకున్నా

పాతబట్టలు వదిలిపెట్టా

కొత్తవస్త్రాలు వేసుకుంటున్నా!

 

దుఃఖాలను దూరంగా తోలా

విచారాలను విడిచిపెట్టా

చిరునవ్వులను చిందిస్తున్నా

అందుకోవాలని ఆరాటపడుతున్నా!

 

తలంటు స్నానం చేశా

తనువుకు తళుకులు అద్దా

సుగంధాలను చల్లుకున్నా

ఆకర్షించాలని అవకాశంకోసంచూస్తున్నా!

 

ప్రేమను పంచాలనీ

ప్రణయంలో పొంగిపోవాలనీ

గులాబి గుత్తులు ఒకచేతిలో

మల్లెపూలు మరోచేతిలో పట్టుకొనియున్నా!

 

ఆలోచనలు చేష్ఠలు అల్లరి చేస్తున్నా

భవబంధాలను అనుబంధాలగా మార్చాలని

జీవితాన్ని జయించి తీరాలని 

సరయిన సమయం కోసం చూస్తున్నా

 

కబుర్లు కర్ణాలకింపుగా వినాలనీ

శబ్దాలు రాకుండా చూస్తున్నా

కనురెప్పలు కదలించకుండా

శ్వాసను సహితం ఆపుతున్నా!

 

అక్కున అదిమి చేర్చుకోవాలని

అభిమానం అమితంగా అందించాలని

అలజడులను ఆపి అదిమిపడుతూ

అలమటిస్తున్నా ఆరాధిస్తున్నా

 

నీకు నచ్చకపోతే

దూరంగా వెళ్ళిపోతా

ప్రేమను త్యాగంచేస్తా

ప్రాణత్యాగానికైనా సిద్ధంగాయున్నా

నీ సుఖసంతోషాలనే నే కోరుతున్నా!

                                                రచయిత: గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!