నాగులు

నాగులు

రచయిత :: గుడిపూడి రాధికారాణి

“ఏమండీ! ఎవరివల్ల ఏ ప్రమాదమోనని మా కొలీగ్స్ అంతా పనిమనుషుల్ని మానిపించేశార్ట” లాక్ డౌన్ మూడోరోజు ఒకింత ఆందోళనతో చెప్పింది లత.తన ప్రాణానికి ఇదో బిగ్ బ్రేకింగ్ న్యూస్ లా ఉంది.
“మనమూ మానిపించేద్దామా అయితే?” కొంచెం భయంగా, కొంచెం సందిగ్ధంగా అడిగాడు శ్రీధర్.సహాయం చేయాల్సొచ్చి తనకీ పనిభారం పెరుగుతుందనే భయానికి ఒళ్ళొంచి కొన్ని పనులైనా చేయడానికి లత ఒప్పుకుంటుందా అనే సందేహం తోడైనట్లుంది.
ఈ రెండు భావాల్నీ సెకనులో వెయ్యోవంతులో పసిగట్టేసి మొహం మార్చేసింది లత.
అమ్మో! ఎంతైనా ఈ ఆడవాళ్ళ తెలివి భర్తల ముందు భలే ప్రకాశిస్తుంది అనుకున్నాడు శ్రీధర్.
“వాళ్ళంతా అపార్ట్ మెంటుల్లో ఉండేవాళ్ళు.ఎప్పటిగిన్నెలు అప్పుడు సింక్ లో కడిగేసుకుంటే అయిపోతుంది.ముగ్గేసే పనుండదుగా.మనదంటే ఇండిపెండెంట్ హౌసాయె.పైగా కార్నర్ ఇల్లు.అటు పెద్దగేటువైపు ఇటు చిన్నగేటువైపు రెండువైపుల ఊడ్చి కడిగి ముగ్గులెయ్యాలి.నాకు నడుం నొప్పి బాబోయ్” అంది అలా ఇండిపెండెంట్ హౌస్ కొనడం అతని తప్పే అన్నట్లు.. ఇలాంటి ఇల్లే కావాలని తనే పోరు పెట్టిన విషయం కన్వీనియంట్ గా మర్చిపోతూ.
ఇంట్లో హెల్ప్ అయితే చెయ్యగలడు గానీ బయటికెళ్ళి ముగ్గులేసే దమ్ములేదు కనక శ్రీధర్ నోర్మూసుకున్నాడు.
“పోనీ ముగ్గేసి అట్నించటే పొమ్మను.అంట్లు కడిగేసుకుందాం.” అన్నాడు.
“ఎందుకులెద్దురూ.బయట సబ్బొకటి పెట్టి శుభ్రంగా కాళ్ళూ చేతులూ కడుక్కుని రమ్మంటా. శానిటైజర్ వేస్తా.” అంది లత. తన మాటే శాసనమన్నట్లు.
“ఎందుకొచ్చిన రిస్క్. వద్దులే” అనబోయి తరవాత తనకొచ్చే రిస్క్ ను ఊహించిన వాడై తలూపేశాడు శ్రీధర్.
ఇద్దరూ ప్రభుత్వోద్యోగులు.ఇద్దరికీ సెలవులే.ఇంట్లోనే ఉండడంతో సహజంగానే కాఫీలూ, టీలూ,చిరుతిళ్ళ ప్రయోగాలూ ఎక్కువయ్యాయి. పనిమనిషి నాగులుకి అంట్లు ఎప్పటికంటే ఎక్కువే పడసాగాయి.
దానికి తోడు కరోనా భయంతో తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా స్వచ్చ గృహం కార్యక్రమం ప్రారంభమయింది. అందులో భాగంగా స్వచ్చ వంటిల్లు అమలైంది.
దాదాపు అన్ని పళ్ళేలూ,డబ్బాలూ రోజుక్కొన్ని చొప్పున నాగులు చేతిలో పడి తళతళలాడాయి.
విరామం లేకుండా వరుసగా వారం పాటు సాగిన ఈ ప్రహసనానికి విసుగులేకుండా నోరెత్తకుండా సహకరించింది నాగులు.పైగా ” పోన్లేమ్మా! ఇల్లు శుభ్రపడుతోంది ” అని సంతోషించింది కూడాను.
ఇట్టే నెల మారింది.జీతాల టైమొచ్చింది.శ్రీధర్ నాగులు నెలజీతం డబ్బులిమ్మని లతకిచ్చాడు.
“అదనంగా ఎంతిద్దాం? గిన్నెలు ఎక్కువ పడుతున్నాయి కదా!” లతనడిగాడు నోట్లు చేతిలో పట్టుకుని.
” ఈనెలలో సగం జీతమే వచ్చిందిగా మనిద్దరికీ” అంది లత నిర్లక్ష్యంగా.
” అయితేనేం..ఊరుకో ఎవరైనా వింటే నవ్వుతారు.మరో నాలుగొందలు ఇవ్వలేని స్థితిలో లేముగా మనం” అన్నాడు శ్రీధర్ కన్విన్సింగ్ గా.
అతని మనసులో దిగువస్థాయిలో ఉన్న నాగులుని సంతోషపెట్టాలనే తపన ఉంది. ఈ నెలరోజులూ నాగులు మొగుడికి పన్లేకుండా పోయింది.పాపం..ఆమె రెక్కల కష్టంతొనే బతుకుబండి లాగుతున్నారు వాళ్ళిద్దరూ.
ఒకట్రెండు సార్లు పార్టీల వాళ్ళు ఇంటింటికొచ్చి పంచదారా,బియ్యమూ,కందిపప్పూ,గోధుమపిండీ,ఉల్లిపాయలూ,కూరలూ తాలింపు గింజలిచ్చారని ఎంత సంబరంగా చెప్పిందో.
బయటవాళ్ళకి ఎన్ని డొనేషన్స్ ఇస్తేనేం! ఇలాంటప్పుడే ఇంట్లో పని చేసే వాళ్ళని సంతోష పెట్టగలిగేది.ఎక్కువ చాకిరీ చేయించుకున్నాం కనుక అది మన ధర్మం.
అదీగాక నాగులు నాగా పెట్టదు. ఠంచనుగా టయానికొస్తుంది.తన మానాన్న తనపనేదో తను చేసుకుపోతుంది.
లత కూడా కాదనలేకపోతోంది కానీ కాదనడానికి ఆమె కారణాలు ఆమెకున్నాయి.
అడపాదడపా గ్లాసో గరిటో చెంచానో మాయమవుతూ ఉంటుందింట్లో.ఈ అదృశ్యం వెనకాల ఉన్నది నాగులేనని లత ప్రగాఢ విశ్వాసం.
ఏ కాకో అయ్యుంటుందంటాడు శ్రీధర్.కానీ చీటికీమాటికీ పన్లోకి రాకుండా ఏడిపిస్తున్న ఈ రోజుల్లో నాగులు లాంటి వాళ్ళు మరొకరు దొరకరు కనక ఆమె బుద్దిని భరిస్తున్నానంటుంది లత.
బయట వాషింగ్ మిషన్ పక్కన పెట్టిన సర్ఫ్ డబ్బాలో సర్ఫ్ తగ్గిపోయిందనీ, ముగ్గుడబ్బాలో ముగ్గు మర్నాటికే సగమయ్యేంత రంగవల్లులేం తీర్చిదిద్దిందీ .. ఇలాంటి ఆరోపణలు పదేపదే లతవైపు నుండి వినడం, చెట్టుకింద ప్లీడరులాంటి ఆమె వాదనని నిరాధారమైన ఆరోపణలంటూ చెయ్యి తిరిగిన జడ్జిలా శ్రీధర్ తోసిపుచ్చడమూ కూడా మామూలే.
అందుకే నాగులుకి ఎక్స్ ట్రా డబ్బివ్వడం లతకి ఇష్టం లేదు.
మనసులో ఉన్న అయిష్టానికి కారణం ఇదీ అని బయటపడకుండా ” మనం కొంచెం వెరైటీస్ ఎక్కువ చేసుకున్న మాట నిజమే.కానీ చేసుకున్నప్పుడల్లా అన్ని రకాలూ దానికీ ఇస్తూనే ఉన్నాంగా” అంది దానికీ అనే పదం వత్తిపలుకుతూ అక్కసుగా.
సర్వం తెలిసిన శ్రీకృష్ణుడిలా ఓ నవ్వు నవ్వాడు శ్రీధర్. చెంచాలూ గ్లాసులదేముంది.ఒకవేళ కాకి కాదు తనపనే అనుకున్నా నీ కన్నుగప్పి ఒక సంవత్సరంలో ఎత్తుకుపోయినవన్నీ కలిపితే రెండు మూడొందలు మించదు. అందరిలా అప్పుడప్పుడు పన్లోకి రాకుండా ఎగ్గొడుతూ వుంటే నీక్కలిగే శ్రమ ముందు అదెంత చెప్పు?” అన్నాడు అనునయంగా.
“అలా అని నేనన్నానా? ” అంది లత.భర్తతో అంతకంటే వాదించి పీనాసిదనిపించుకోవడం నచ్చక అయిష్టంగానే తలూపింది.
ఎంత ఎక్కువిద్దాం? అయిదొందలు? ‘ అన్నాడు శ్రీధర్.
” ఏమండీ! చూస్తుండండి.అంట్లెక్కువ పడ్డాయి..వంటింట్లో సామానంతా వారంపాటు తోమించారు..ఇలాంటి కారణాలు వంద చెప్తుందిక.అయిదొందలకి తక్కువిస్తే పేచీ పెట్టడం గ్యారంటీ.” అంది లత చులకనగా.
” ముందు రెండొందలిస్తా.మరీ పేచీ పెడితే ఇంకో వంద.అంతే.అరిచి గీ పెట్టినా అంతకంటె పైసా కూడా ఎక్కువిచ్చేది లేదు” అంది ఖరాఖండిగా.
” అయినా దాని బుద్దికి ఇదే ఎక్కువ.మీరు మధ్యలో కల్పించుకోకండి.నేను మాట్లాడుకుంటాను.” అని డిక్లేర్ చేసేసింది.
అన్నట్లుగానే నెలజీతానికి రెండొందలు కలిపి తీసుకెళ్ళి పని ముగించుకుని బయలుదేరబోతున్న నాగులుని పిలిచింది.
నాగులు లెక్కపెట్టుకున్నాక పేచీ పెడితే వాదించడానికి అస్త్రాలన్నీ మనసులో సిద్దం చెసుకుంటోంది.
నాగులు ఏ పండో పిండివంటోనని లత చేతికేసి చూసింది.డబ్బు నోట్లు చూడగానే ” జీతం డబ్బులా లతమ్మా? మీ ఇద్దరికీ సగం జీతాలే వస్తాయంట కదా ఈ నెల.టీవీలో చూసి మా పెనిమిటి చెప్పాడమ్మా.వచ్చే నెలిద్దురుగాన్లే పోనీ.అవీ ఇవీ కట్టుకోవాల్సినవుంటాయ్ గా మీకూనూ.” అంది చీరచెంగుతో చేతులు తుడుచుకుంటూ.
“అసలు ఇంకో రెణ్ణెల్లయినా పర్లేదందామనుకున్నా.కానీ మీకు తెలుసుకదా! మావోడికీ పన్లేదు.మీ జీతాలే ఆధారం మాకు.వచ్చేనెలివ్వండి మీ వెసులుబాటును బట్టి.” అంటున్న నాగుల్ని చూస్తుంటే ఏదేదో ఊహించుకున్న లత తల సిగ్గుతో వాలిపోయింది.వెనుక శ్రీధర్ చూపులు గుచ్చుకున్నట్లనిపిస్తుంటే రెండొందల నోటు తీసేసి దాని బదులుగా అయిదొందల నోటు పెట్టి ఊపిరి పీల్చుకుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!