నాన్నఅదృశ్యప్రేమ

నాన్నఅదృశ్యప్రేమ

రచయిత: లంకా జయ కుమారి

 

  

ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఉంది,ఎన్నిటికో సమాధానం అడిగి తెలుసుకోవాలని ఉంది, కానీ అడగలేను. ఇప్పుడు ఈ క్షణం నా మనసులో మాటలు మీతో పంచుకోవాలని ఉంది నాన్న.
      చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసే నేను అన్నీ నేర్చుకున్నా. నేను పుట్టిన సంవత్సరానికే చెల్లి పుట్టడంతో, అమ్మకి మా ఇద్దరిని చూసుకోవడం కష్టం అవుతుంది అని, మీరు ఎక్కడకు వెళ్లినా నన్ను కూడా తీసుకువెళ్లడం వల్ల ఏమో… నేను ప్రతి విషయం మిమ్మల్ని చూసే నేర్చుకున్నా.
      అమ్మ చేతి గోరుముద్దలో అమ్మ ప్రేమను చూసాను. ఆ గోరుముద్దల వెనుక మీ కష్టం, మాకోసం మీ తపన, ప్రేమ, ఆప్యాయతలు అన్ని నాకు చిన్నప్పటి నుండే తెలుసు నాన్న.
     మాతో పాటు నానమ్మ, చిన్నాన్న, అత్తయ్య, అందరి బాధ్యతలు స్వీకరించి, అందరి అవసరాలు తీర్చడం కోసం, మీ జీతం సరిపోక అప్పులు చెయ్యడం, వాటిని తీర్చడానికి మీరు పడ్డ తిప్పలు అన్నీ, దగ్గర ఉండి చూడటం వల్ల ఏమో మీ కష్టం విలువ, దానితో పాటు డబ్బు విలువ కూడా తెలిసింది.
    మీరు ఇతరులతో మాట్లాడే తీరు, వారికి ఇచ్చే మర్యాద, వారు మీకు ఇచ్చే గౌరవం ఇవన్నీ నాకు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలిపాయి.
     పుస్తకాలు కొనుక్కోలేని పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వడం, వారి పరీక్ష ఫిజులు కట్టడం, ఎవరు ఏ సహాయం అడిగిన కాదు, లేదు అనకుండా మీరు చెయ్యగలిగిన సహాయం చేయడం చూసి సహాయం వల్ల పొందే సంతోషం, తృప్తి నేర్చుకున్నాను.
      సాయంత్రం వేళ మీరు ఇంట్లో లేనప్పుడు, ట్యూషన్ కి వచ్చిన పిల్లలందరిని కూర్చోపెట్టి వెన్నెలను చూపిస్తూ మీరు చెప్పిన నీతి కథలు, పాత పాటలు, దేశభక్తి గీతాలు నేర్పిస్తూ, నాక్కుడా సంగీతం అంటే ప్రాణం అయ్యేలా చేశాయి.
       డబ్బు కన్న మనిషికి విలువ ఇవ్వాలని.. బ్రతికి ఉన్న నాడు బాసటగా, పోయిన నాడు ఊరటనిస్తూ,   అభిమానం, అనురాగం చూపించేది మనుషులే గాని ఆస్థులు, అంతస్థులు కాదని మీరు ఇతరుల విషయంలో చేసి చూపించి, మాకు ఆదర్శం అయ్యారు.
      నలుగురు తిట్టిన, నలుగురు మెచ్చిన, నీ విలువలు నువ్వు కాపాడుకోవాలి అని, నీతిగా, నిజాయితీగా నడుచుకోవాలని చెప్పారు.
      పెద్దల్ని గౌరవించాలి, చిన్నవాళ్ళని ప్రేమించాలి,
మన వల్ల ఇతరులుకు సంతోషం, లాభం కలుగక పోయిన పర్వాలేదు కానీ నష్టం, బాధ కలగకూడదు అని చెప్పారు కదా నాన్న.
       మరి అన్ని చెప్పి… మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఎదురు తిరగాలని నేర్పలేదు ఏంటి నాన్న. 
      మీరు ఎంత సున్నితంగా పెంచారు, అక్కడ వస్తువు తీసి ఇక్కడ పెట్టనిచ్చేవారు కాదు, కానీ ఇక్కడ గ్యాస్ బండ కూడా నేను మోయాల్సి వస్తుంది. 
     రోజు మీరు భోజనం చేసేటప్పుడు, మేము తిన్నాము అని చెప్పిన వినకుండా నాకు ఎక్కువైంది,  తినలేను అంటూ కొసరి మరీ నాకు తినిపించే వారు కదా, కానీ ఇక్కడ కడుపునిండా తిని, కంటి నిండా నిద్ర పోయిన రోజు లేదు అంటే మీరు తట్టుకోలేరెమో నాన్న.
     ఎందుకు నాన్న పుట్టినప్పటి నుండి ప్రతి విషయంలో మమ్మల్ని అపురూపంగా చూసుకునే మీరు, పెళ్ళి విషయంలో ఎందుకు తొందరపడ్డారు, అందరిలాగే డబ్బు, ఆస్తులు ఉంటే చాలు అనుకున్నారు ఎందుకు అడగాలని ఉంది, కానీ మిమ్మల్ని అలా అడిగేంత పెద్దరికం, ధైర్యం ఇంకా రావడం లేదు నాన్న.
       ఎవరికో ఇచ్చిన మాట కాదు అనలేక, నన్ను అడగకుండా, నాకు ఇష్టం లేని పెళ్లి చేయడం ఏంటి నాన్న. మీ పరువు పోకూడదు అని, నా చదువు, సంగీతం, నా లక్ష్యాన్ని వదిలి పెట్టి ఈ పెళ్ళి చేసుకున్న. ఆ పెళ్లిలో మీ సంతోషం ముందు నా కన్నీళ్లు చిన్నబోయాయి.
      అప్పగింతలప్పుడు మీరు గుక్కపెట్టి ఏడుస్తుంటే, 
చిన్నప్పటి నుంచి మీరు మాపై చూపిన కఠినత్వం మా భవిష్యత్తు కోసం మీరు పడే ఆరాటం అని అర్ధం అయింది. మీరు మాపై పెంచుకున్న  ప్రేమను మీ కళ్ళల్లో ఆ రోజు చూసా.
      నిన్న కాక మొన్న పరిచయం అయిన నా ప్రేమను కోల్పోయినందుకే నా ప్రాణం విలవిలాడుతోంది, అలాంటిది మేము కడుపులో పడిన నాటి నుండి, మీరు మాపై పెంచుకున్న ప్రేమను కాదని మేము వెళ్ళిపోతే, మీ ప్రాణం ఎంత విలవిలలాడుతుందో
ఆ క్షణం అర్ధం అయింది. మీరు చేసిన త్యాగాల ముందు నేను చేసింది ఎంత అనుకున్నాను నాన్న.
       కానీ ఇప్పుడు తెలుస్తోంది, ఏ విషయంలో అయిన త్యాగం చేయొచ్చు కానీ పెళ్లి విషయంలో త్యాగం చేస్తే, ఇలా జీవితాన్ని కోల్పోవలిసి వస్తుంది అని.
      కానీ మీ ప్రేమ కోసం, నేను ఏదైనా చేస్తాను. ఇంటికి పెద్ద కూతురు అయినా… ఏ రోజు కూడా నన్ను “నువ్వు ఆడపిల్లవి అలా చెయ్యకూడదు,ఇలా చెయ్యకూడదు” అని చెప్పలేదు. మాకు ఎప్పటికప్పుడు స్వేచ్ఛ ఇస్తూనే వచ్చారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఆ స్వేచ్ఛను  ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదు నాన్న.
      నేను మాట ఇచ్చాను కదా నాన్న… మీ బరువు, మీ పరువు మోస్తాను అని, మీకు చెడ్డ పేరు రానివ్వను అని, ఆ మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూనే వచ్చాను, ఇక మీదట కూడా చేస్తాను. 
      నాకు నేను కూడా ఒక మాట ఇచ్చుకున్నాను నాన్న… నా తుదిశ్వాస వరకు నా వల్ల మీరు బాధపడే సందర్భం రానివ్వను అని. 

మా ప్రతి గమ్యాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకునే

మీ జీవితం మాకు మరో ప్రస్థానమే.

మా ప్రతి అడుగుని గెలిపించాలనుకునే

మీ అదృశ్య ప్రేమ మాకు మరో గమ్యమే. 

మీ అనంత ప్రేమకు శతకోటి వందనాలు నాన్న.

కూతుర్ని కన్న ప్రతి తల్లిదండ్రులకు, వినయ విధేయతలతో పాటు, తప్పు జరిగినప్పుడు చిన్న అయిన, పెద్ద అయిన తప్పుని తప్పు అని చెప్పే ధైర్యాన్ని కూడా నేర్పండి.

You May Also Like

14 thoughts on “నాన్నఅదృశ్యప్రేమ

  1. చాలా బాగా రాసారు జయ గారు. మీ నాన్నగారి కష్టాన్ని అర్ధం చేసుకుని బాధ్యత గా మీకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని, కష్టాల్ని కూడా ఇష్టంగా అనుభవిస్తున్నారు 👏👏💐💐

  2. నాన్న ప్రేమ ఎప్పుడు తను చూపే భాద్యత లొ కనబడుతుంది.విలువ కట్టలేనిది అమ్మ ప్రేమ అయితే ఆ విలువ అమ్మ కి రావడానికి కారణం నాన్న నే కదా!!
    నాన్న తొ అనుబంధం గురించి చాలా గొప్పగా చెప్పరు జయ గారు 👏👏👏
    చాలా చాలా బాగుంది.👌

  3. ఇంత ఆవేదన ని తండ్రి కోసం తట్టుకొని నిలబడుతున్న మీరు చాలా గ్రేట్ అండీ మీ లాంటి కూతురు ఉండటం మీ నాన్న గారి అదృష్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!