నాన్నకో లేఖ

నాన్నకో లేఖ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

 

డా.బండారి సుజాత

ప్రియమైన నాన్నకు
మీ రవళి వ్రాయునది!

(తన విజయాన్ని వ్రాతపూర్వకంగా తండ్రికి తెలుపాలనుకొని తనకు తాను రవళి రాసుకున్నలేఖ. ఎప్పుడో చిన్నప్పుడు ఊహ తెలియని తనను అమ్మ తీసుకొని బయటకు వచ్చినప్పటి నుండి తెలియని నాన్నకు ఉత్తరం అందించాలన్న ఆలోచనను అమలు చేసింది రవళి)

ప్రియమైన నాన్నకు,
రవళి రాయుఉత్తరం..
పి.హెచ్.డి అందుకున్న రవళిని అందరు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఆ తల్లి మనసు మూగ పోయింది. పేపర్లో వివరాలు తెలుసుకొని రవళి తండ్రి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. అమ్మ రవళి అంటూ బొకే ఇస్తున్న అతనిని, అమ్మా రవళి ఇతడు మీ నాన్నని తల్లి చెప్పగానే రవళి మది ఉద్వేగమైంది. అతను తనను వదిలించుకోవడానికి అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
నాన్న అన్న పిలుపుకు నన్ను దూరం చేశావు కదా నాన్న. మీ ఆలోచనను హర్షించలేక పోయాను. అమ్మ ఎన్ని రాత్రులేడ్చిందో.. నన్ను ఈ ప్రపంచానికి తేవాలనుకున్న అమ్మను ఎన్ని మాటలన్నావు. ఎంత హింస పెట్టావో నేను చూస్తూనే, వింటూనే ఉన్నాను కాని ఏమీ చేయలేని అశక్తత. కానీ పాపం అమ్మ ఎలాగోలా ప్రపంచం చూపింది. కానీ నా ప్రపంచంలో వెలుగులు లేవని అమ్మ తెలుసుకుని కృంగిపోయింది. నన్ను సాగనంపడానికి అమ్మకు మీరు అందించిన ఔషదాలే అవయవలోపాలకు కారణం అని డాక్టర్లు చెప్పడంతో అమ్మ కుంగిపోయింది. నిజం తెలుసుకున్న అమ్మకు, నవనాడులు కుంగిపోయాయి. ఎందుకు నాన్న ఇలాంటి పని చేశావు. నేనే ద్రోహం చేస్తాననుకున్నావు…?
ఎలాగైనా నన్ను బాగు చేయాలని ఎందరో డాక్టర్లను కలిసిందో అమ్మ. ఎందరు డాక్టర్లను సంప్రదించిందో పాపం. ఆమె ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. కారణం నన్ను ఏ శరణాలయంలోనో పడేయమన్న మీ మాటలకు అమ్మ తట్టుకోలేకపోయింది. ఆ రాత్రి అమ్మకు చీకటి రాత్రి, నన్ను ఎక్కడ చంపేస్తావో అన్న భయంతో నన్ను అక్కున చేర్చుకొని పడుకున్న అమ్మకు నన్ను దూరం చేయాలని చూస్తే మీకు తానే దూరమైపోయింది. నాకోసం ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని హేళనలు భరించిందో ఎదుగుతున్న నేను అర్థం చేసుకున్నాను. అమ్మ నా కొరకు బ్రెయిలి లిపి నేర్చుకున్నది. నాబడిలోనే టీచరుగా ఉద్యోగం సంపాదించింది. నాలాంటి వాళ్ళెందరికో తల్లిలా గురువుల సేవలు అందించింది . నాకు కూడా బోధన ఇష్టం అనగానే నాకు సహకరించింది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అమ్మ నాకు జన్మ జన్మలకు ఈ అమ్మే కావాలని అనుకుంటున్నాను అనుకున్నది రవళి.
అమ్మా రవళి, మాట్లాడవేమమ్మా నేను మీ నాన్నను. ఇదిగో మీ అక్కయ్య అంటూ రమణి చేయందించాడు. నాన్నగా పరిచయమైన నాన్న, అక్క చేతి స్పర్శకు ఆనందించింది రవళి. భుజాల మీదున్న తల్లి చేతులు బుజ్జగిస్తున్నాయి. తప్పు తెలుసుకున్న వాళ్ళను అక్కున చేర్చుకోమని. అంధురాలైనా ఆత్మ స్థైర్యంతో ఎదుగుతున్న రవళి అందరికి మార్గ దర్శకురాలు అన్నారందరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!