నేను కుంతిని కాను
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ప్రసాదరావు రామాయణం
కాలు జారాను నేను
కామం కనులకెక్కి కాదు
ఖర్మం పరిపక్వమై
కాలు జారాను నేను
కాలం ముసిముసిగా నవ్వింది
ఘటనో యాదృశ్చికమో!
మలుపు తిరిగింది జీవితం
కాలు జార్చినవాడు
కాలం చేశాడు
ప్రమాదాన్ని చుట్టుకుని..
ప్రమోదం విషాదం గా
పరిణమించింది
కాలు జారాను నేను
కనులు మూసుకున్న ఒక్క క్షణం
కడుపు చేసుకున్నా
మబ్బు ఉరిమింది
అమ్మ ఉరిమింది
కడుపు చించుతాను….నాన్న
కాళ్ళమీద పడుతుంది….నేను
వెళ్ళిపొమ్మన్నారు
వెళ్ళిపోయాను
నేను కుంతిని కాను
అతని జ్ఞాపిక కావాలి నాకు
నేను నేటి స్త్రీని
ఒంటిగా వుండగలను
తెలుసు నాకు
తోడేళ్ళూ చుట్టూ అని
వేళ్ళు నన్ను చూపుతున్నాయని
తట్టుకోగలను కాకుల గోలను
ముట్టుకోకుండా వుండగలను
మరే పురుషుడినీ
కట్టుబాటులో వుండగలను
కాలానికి ఎదురీది
నిరూపించగలను
స్త్రీ ఆత్మశక్తిని