ఉగాది ఉల్లాసాలు

ఉగాది ఉల్లాసాలు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్

 

 

ఉగాది పండుగ వచ్చింది
ఉత్సాహమును ఇచ్చింది
ఉరకలు వేయించింది
ఊహలు పారించింది

కోకిలమ్మ వచ్చింది
కొమ్మపై కూర్చుంది
కుహుకుహు కూసింది
కుషీకుషీ చేసింది

మామిడి మెండుగ పూతేసింది
పిందెలనెన్నో కాచేసింది
చెట్టు కొత్తాకులు తొడిగింది
శుభతోరణాలు కట్టించింది

మల్లె పూలనిచ్చింది
మాలను కట్టించింది
పడతుల కొప్పెక్కింది
పరిమళాలు చల్లింది

కోడరికానికి కొత్త కోడలు వచ్చింది
కొత్త కాపురమును పెట్టించింది
చీరెలను సారెలను పుట్టింటి నుండి తెచ్చింది
శోభాయమానంగా అత్తవారింటికొచ్చింది

చలికాలం పోయింది
మధుమాసం వచ్చింది
పుడమి పచ్చబడింది
ప్రకృతి పరవశించింది

కవులను కలం పట్టించింది
కైతలనెన్నో వ్రాయించింది
కమ్మకమ్మగా పాడించింది
కమ్మదనాలను చూపించింది

చక్కని ఆలోచనలనిచ్చింది
సాహిత్యంలోనికి దించింది
కవితల కవనం చేయించింది
కాసులు కానుకలు కురిపించింది

సన్మానాలు చాలా చేయించింది
శాలువాలు మెడపై కప్పించింది
ప్రశంసల వర్షం కురిపించింది
కవులకు కీర్తి కిరీటీలనిచ్చింది

తెలుగుభాష తీపిని చుట్టూ చల్లింది
దేశ విదేశములందు వెలిగిపోయింది
తెలుగుదనమును జగతికి చాటింది
తెలుగువాళ్ళను తెగ తృప్తిపరచింది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!