భారతీయం చచ్చిపోతూంది

భారతీయం చచ్చిపోతూంది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ప్రసాదరావు రామాయణం

గతకాలపు సంస్కృతి నీడల్లో
సతతం అడుగులేస్తూ గడపినవాడిని
సాంప్రదాయపు వటవృక్ష
ఛాయల క్రింద ఎదిగిన వాడిని
చాందసుడంటారు సాంప్రదాయమంటే
అర్ధం లేని ఆచారాలనూ
పర్థం లేని మడులూ,మైలలను
నీరసించిన హేతువాదిని

వర్తమానంలో మనిషి
కర్తవ్యం మరిచి
కోరికలకు బానిసై
నవీనతను నెత్తికెత్తికొని
విచ్చలవిడి తనానికి
విశృంఖలత్వానికీ
కట్టుబాట్లు దాటి
కాలానికన్నా ముందు పరిగెడుతుంటే
అశ్రువులు కారుతున్నాయ్ నాకు

నీతిని చీల్చి
గోతిలో పాతి
వావి వరుసలు మరిచి
కూతురితో తండ్రి
చెల్లితో అన్న
మనుమరాలితో తాత
శృంగారంలో మునిగిపోతే
ఎక్కడ భారతీయ సంస్కృతి?
కామానికి దాసులై
ప్రేమానురాగాలు మరిచి
భార్యను భర్త
భర్తను భార్య
పొడిచి చంపుకుంటుంటే
ఏవిధమైన సాంప్రదాయం?

భాష మరిచి
వేషం మార్చి
అద్దెభాషను మోస్తూ
అమ్మను చచ్చిన పీనుగా
అని (మమ్మీ) సంబోధిస్తుంటే
మడత మడత పడి పోతున్నారు
ఆనందంతో అమ్మలూ నాన్నలూ

బొట్టు చేరిపేశారు
కట్టు విప్పేశారు
గాజులు విరిచేశారు
జాజులకు స్థానం లేదు
మాంగల్యం దాచేవారు
దర్వాజా కొక్కేనికి తగిలించేవారు
అయ్యో!
ఎలా ఐపోతూంది స్త్రీ
దాచుకోవలసింది
దోచుకోమంటూ
ధర్మదర్శనమిస్తే
బ్రహ్మకైనా పుట్టదా రిమ్మ తెగులు?

రేవ్ పార్టీలు
ఒకచేతిలో కండోములు
మరో చేతిలో మత్తు డ్రగ్గులు
రాత్రంతా ఊగి ఊగి
పొర్లి పొర్లి
ఇంటికి చేరితే
మందలించే ధైర్యం
అమ్మకూ లేదు నాన్నకూ లేదు

వృద్దుడనైపోయాను అయినా
చేతి ఊత కర్ర విసరగలను
బోసినోటితో బూతులు తిట్టగలను
మరేమీ చేయలేని అసమర్థుడిని!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!