నేను.. ఆకాశం

నేను.. ఆకాశం

రచయిత :: తపస్వి

“నేనూ ఆకాశం కవిత్వాన్ని చెప్పుకొంటాం
ఒకరిపై ఒకరం వాలి ఆకాశం వైపు చూస్తే,
నేను కింద ఉంటా..
తన వైపు నుండి చూస్తే,
తన మీద నేనుంటా…

కలిసి మెలిసి అల్లరి చేస్తూ ఉంటాం
ఆడి పాడి ఊయలూగుతాం
జ్ఞాపకాల దొంతరలని పంచుకుంటూ
ఒకరికి ఒకరం పోటీ పడుతూ
పరిగెడుతూ ఉంటాం…

కనులలో చూస్తే అంతా తెలిసిన
నీలాకాశంలాగా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటా..
తరచి వలచి చూడాలంటే అనంత శూన్యంలా
మనసు లోతుల్లో అంతు చిక్కని ఆరాటల పోరాటాలను దాచుకుని ఉంటా..

అప్పడప్పుడు మబ్బులు వస్తాయి,
చినుకులు నాపై విసిరేస్తాయి..
అపుడపుడు అవే కారుమబ్బులు అయ్యి
నన్ను కమ్మేసి పిడుగులై అల్లకల్లోలం చేస్తాయి…

అప్పుడప్పుడు చిన్న చిన్న సంతోషాలను కూడా నక్షత్రాలుగా
మా ముఖాలకు అతికించుకుని మురిసి పోతాం..
అపుడపుడు అంతుచిక్కని వేదనని మౌనంగా
నిశి రాత్రిలో ఒంటరి మౌనంగా మిగిలిపోతాం..

గాలి మాత్రం నీలి రంగుని మోసుకొని,
ఇద్దరినీ తాకుతూ తిరుగుతుంటుంది…
గాలిలొ కలిసి పోయిన గతాన్ని
అపుడపుడు సరదాగా నెమరేసుకుంటూ
కబుర్లు చెప్పుకుంటు ఉంటాం…
ఎంతసేపైనా సరే..

నేనూ ఆకాశం అంతే… !
నేను తనకి.. తనకి నేను…!”

You May Also Like

6 thoughts on “నేను.. ఆకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!