నీకు తెలియని నేను

నీకు తెలియని నేను
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చందలూరి నారాయణరావు

ఒకటి “నీకు తెలియని నేను”
రెండు “నేను లేని నీవు”
* * * *
వాడేదో..వాడికేదో..
లోపల…బయట
ముందు…వెనుక
లోపమో?… శాపమో?
భారమో?..నేరమో?
ఆ రెండు పదాలకే అల్లుకొని
పూత వేయని శబ్దాలకు
చిగురించని తరంగాలకు
చెవులు నోళ్లు తెరుచుకోవడం
అవసరమో?…అగత్యమో?
పుస్తకంలా…మస్తకంలో
పుట్టుమచ్చలా.. మనసు మలుపులో
ఆ పదాల గుర్తులే
కళ్లకు గుచ్చుకునే బాధలు.

వాడేదో….వాడికేదో
నేల గిట్టడం లేదు..
నింగి నచ్చడం లేదు..
వానతో మాట్లాడడు
నదితో పోట్లాడతాడు.

ఆ రెండు పదాలే
ప్రకృతిని శత్రువుగా
తనను తాను మోసగించుకోవడమే
రుచి ముందు
ఆకలి మారిపోయింది
దప్పిక దూరమైనది.

ఆకారం మార్చుకొని
ఆలోచన కొట్టే దొంగదెబ్బకు
ప్రత్యక్ష సాక్ష్యాలైన
అరుపుల్లేని బాధ
ఆవిరౌతున్న కన్నీరు
సొంత దేహంలో
పరాయిలా తప్పించుకుని
ఎప్పుడూ చివరే ఉంటాయి.
ముందుకొచ్చి కాపాడింది లేదు.

ఎంత లోతుకు మునిగాడో
ఈ మాటల గజఈత..
ఏ ఒడ్డుకు తేలేనో..
ఏ అర్థం ఎప్పటికో…

ఏ దూరం పిలుపో
ఈ అడుగుల అలసట
ఏ వేళకు ఈ దప్పికను
ఏ గమ్యం తీర్చునో…

దారివ్వండి వాడికి.
కెరలించడం దేనికి?
జరుగుతున్న కాలాన్ని
వాడిలోనే జారనీయండి.

జాలితో మనసుని
చిలికి చిలికి చంపొద్దు
ప్రేమ మనిషిలో
పొగిలి పొగిలి పారనీయండి.

ప్రశ్నలతో గుండె తలుపు కొట్టొద్దు
కాలంలోని జుట్టు పట్టుకొని ముంచొద్దు.
కసిగా చూడద్దు..
కక్షను నేర్పద్దు..

బయటకు లాగొద్దు
బయటపడేద్దు
చీకటి చిత్తడిలో కూరుకపోతే
వెలుగు వెలికి వెలివేస్తే
ఆ పాపం గొంతులో కట్టడి కాదు.

ముక్కలైన ముఖంలో
ఆనందాలను వెతకొద్దు
ఒక్కడిని చూసి
వెన్నుపోటు పొడవద్దు.

సందుచూపులతో
మర్మాలను మరిగించి
ముఖాలపై పోయొద్దు.
మనసులు మాడ్చద్దో.

వాడేదో
వాడిలో ఏదో
ఈ కాలపరీక్ష వ్రాయలేక
కూరుకుపోతున్నాడు
తేల్చుకులేకపోతున్నాడు

జీవితాన్ని మరణిస్తూ
బతుకుతున్నాడు..
బతుకును చంపుకుంటూ
జీవిస్తున్నాడు…

పొందిన ఆ రెండు పదాలకు
అర్థాలను వెతకలేని అనుభవం
చేతకాక చేతులు కట్టుకున్నా

ఆ రెండు పదాలు కింద పడ్డ
చచ్చిపోయిన ఆ నిజమంటే
ఇప్పటికీ ఇష్టమే..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!