నిర్ణయం(సంక్రాంతి కథల పోటీ)

నిర్ణయం

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: గొర్తి వాణిశ్రీనివాస్

పిన్నీవాళ్ళ ఊరికి బయలుదేరాను.
బస్సు దిగేసరికి చీకటి పడింది. జారిపోతున్న బ్యాగ్గుని భుజం మీదకి లాక్కుంటూ ఊరివైపుకు నడిచాను. అసలే అమావాస్య రోజులు. వెలిగి ఆరే వీధిలైట్ల మధ్యన కనివెలుతుర్లో వడివడిగా నడక సాగించాను.

పిన్నీవాళ్ళింటికి వెళ్లాలంటే రోడ్డు మీదనుంచి అరగంటపైనే నడవాలి . చిన్నప్పుడు పరుగెత్తుకుంటూ అవలీలగా పావుగంటలో వెళ్లిపోయేవాళ్ళం.
ఇప్పుడూ పరిగెత్తచ్చు. ఒక్కణ్ణే పరిగిడితే కుక్కలు వెంటపడతాయేమో! అసలు పరిగెత్తగలనోలేనో. మా ఆవిడ పెట్టిన తిండికి కాస్త పొట్టొచ్చింది. దారికీ అటూ ఇటూ ఉన్న చెట్లు ఊగుతూ దయ్యాల్లా విచిత్రంగా కనబడుతున్నాయి. చిటారు కొమ్మలకి తగులుకున్న సర్వీసు వైర్లు ‘చిట్ చిట్ ‘మంటూ నిప్పురవ్వలు చిమ్ముతున్నాయి.

ఆరున్నరకే ఓ ముద్ద తినేసి తలుపులు బిడాయించుకునే జనాలు ఉన్న ఊళ్ళో పట్న వాసులకు సమయం గడవటం మహా కష్టం.
పిన్నీ బాబాయ్ కూడా ఈ పాటికి తిని తలుపులేసుకుని టి వి చూస్తూ వుంటారు.

వాళ్ళింటికి ఏడున్నరకి వెళ్లినా
“ఇంత అర్ధరాత్రి వచ్చావేరా. కాస్త తొందరగా బయలుదేరకపోయావా?”అంటారు. ఏవిటో వీళ్ళు.
అంత టoచనుగా టైములు పాటిస్తారు. రాత్రి వరకూ మెలకువగా ఉండలేరు.
అవున్లే! వీళ్ళు మేలుకొనివుండి ఏం చెయ్యాలిగనక! కసరత్తులు చేసి ఒలింపిక్స్ కి వెళతారా ఏమన్నానా!
అలా ఏవో పిచ్చి ఆలోచనలు చేస్తూ నడుస్తున్నాను.

చిన్నప్పుడు మా అమ్మా నాన్నా యాత్రలకు వెళ్లినప్పుడల్లా నన్ను పిన్నీ బాబాయి దగ్గరే వదిలేసి వెళ్ళేవాళ్ళు. పల్లెటూళ్ళలో ఓ సుఖం ఉంటుంది. ఆడుకోడానికి బోలెడు జాగా. ఆటలాడి ఇంటికి ఎప్పుడొచ్చినా పెద్దగా ఏమీ అనరు. స్మశానాల్లో గోరీల మధ్య ఆడుకున్నా
ఎవరూ పట్టించుకోరు. స్మశానం అంటే గుర్తొచ్చింది.
చిన్నప్పుడు పక్కింటి శేఖర్ గాడు ఒకరోజు నాతో “ఒరేయ్! కాలుతున్న శవాన్ని ఎప్పుడైనా చూశావా?” అని అడిగాడు.
“లేదురా..!” అన్నాను
“నేను చూశానురా. మొన్న మునసబుగారి నాన్న పోయాడుగా. ఆయన్ని కాలుస్తున్నప్పుడు కాటికాపరి వెనకాలే నిలబడి చేసాను.
అబ్బ..!కణకణ కాలుతున్న నిప్పుల్లో ఆయన కళ్ళు రెండూ ‘పెటిక్కిన’ పేలడం చూశాను.
అమ్మో..కట్టెల్లోంచి పిశాచిలా పైకి లేచాడు.
కాపరి కర్రతో లోపలికి తోసాడు. బాబోయ్ డ్రాకులా సినిమాలో భూతంలా ఉన్నాడురా” వాడు చెబుతున్న తీరు నాకు ఆసక్తిగా అనిపించినా భయంతో నా వెన్నుపాము ఒణికింది. వాడి మాటల ప్రభావంవల్ల నాలో తెలియని ఉత్సుకత బయలుదేరింది.

కాలుతున్న శవం ఎలా ఉంటుందో చూద్దామని ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు స్మశానానికి వెళ్ళాం.
అక్కడ ఒకటే కంపు. శవాలు కాలుతున్న వాసనకి మాకు డోకొచ్చింది. అయినా చూడాలనే పట్టుదలతో ఒక చెట్టు చాటున నక్కి నిలబడ్డాం.
శవం ఒంట్లోంచి నీళ్ళో ,నూనోగానీ బుడగలతోపాటు ద్రవంలాంటి పదార్థం బయటకొచ్చింది. పుచ్చు వంకాయను నిప్పుల్లో కాల్చినట్టు ‘టుప్’ మని పొట్ట పగిలి తెల్లని పదార్థం బయటకి చిమ్మింది. తల పుచ్చకాయలా చిట్లి మాడు సురసురమంటూ కాలి ‘టాంగ్’ మని పెంకు ఎగిరి అవతలపడింది. చర్మం, కండ కాలిపోయి అస్థిపంజరం బయటపడింది. గుడ్లు నల్లగా మాడి రెండు గుంటలు కనపడ్డాయి.
శవం నోరు ‘బిలంలా’ పెద్దగా తెరుచుకుంది. కొన్ని పళ్ళు ‘చిట్ చిట్’ మని ఊడి రాలిపోయాయి. తెరుచుకున్న నోట్లోంచి మంటలు బయటకు వచ్చాయి.
కెవ్వున అరిచాడు శేఖర్. వాడరిచింది శవాన్ని చూసి కాదు. వాడి వీపుమీద ఎవరిదో చెయ్యి చల్లగా పడింది. అందరం వెనక్కి తిరిగి చూశాం. ఆ చెయ్యి మునసబుగారి తండ్రిది.
మాకు గుండె ఆగినంత పనయ్యింది.
“ఇక్కడేంచేస్తున్నారు? పొండవతలకి” అని పెద్దగా అరిచాడు.
“పరిగెత్తండ్రో….” అంటూ అందరం పారిపోయి ఊళ్ళోకొచ్చిపడ్డాం. చచ్చిపోయిన వాడు అక్కడికెలా వచ్చాడ్రా అని తెగ రొప్పుకుంటూ కూర్చుని చాలాసేపు చర్చించుకున్నాం.

పెద్దవాళ్ళకి చెబితే మా మాటల్ని వాళ్ళు నమ్మలేదు. పోయినవాళ్ళు కనపడటం ‘కల్ల’ అని కొట్టి పారేశారు.
ఆ కనపడింది మునసబుగారి పెదనాన్నేమో అన్నారు.
నాకైతే వాళ్ళమాటలు నమ్మబుద్ధి కాలేదు. చిన్నప్పటి గందరగోళం అదోరకంగా ఉంటుంది. నాకిప్పటికీ ఆ విషయంలో సందేహం తీరలేదు.

అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు నవ్వొస్తుంది. కానీ రాత్రిపూట గుర్తురావటం నాకు నచ్చలేదు. అందులో నేను ఒంటరిగా వున్నప్పుడు అసలు ఇష్టంలేదు.

చెప్పద్దూ చెప్పలేని భయం మోకాళ్ళల్లోంచి నడుందాకా జరజరా పాకింది. ఇప్పుడు ఎవరైనా తోడుంటే బాగుండు. అనుకున్నాను. ఇలా అనుకున్నానోలేదో నా వెనకాల అడుగుల చప్పుడయింది.

చటుక్కున వెనక్కి తిరిగి చూశాను. అంత స్పీడ్ గా వెనక్కి తిరిగేసరికి నా మెడ పట్టేసింది. వెనకాల ఎవరూ కనపడలేదు. మెడ రుద్దుకుంటూ నడక వేగం పెంచాను. నా వెనకాల అడుగుల వేగం పెరిగింది.
నా గుండె వంద కొట్టుకుంది. మళ్లీ వెనక్కి తిరిగితే ఇంకేం పట్టేస్తుందో అని తిరిగి చూడలేదు.నడక వేగం తగ్గించాను. అక్కడా తగ్గింది. ఇదేదో నా ప్రాణం మీదకి వచ్చేట్టుందనిపించి గుండెలు పీచు పీచు మన్నాయి.

నడుస్తూనే మెల్లిగా తల కాస్త కిందకివంచి నా కాళ్ళసందుల్లోంచి చూశాను. చీకటి తప్ప నీడల జాడలేవీ కనబడలేదు.
నాకెందుకో నేను వెళ్లాల్సిన దారి తప్పినట్టుగా అనిపించింది.చెరుకుచేలు ఇంతకు ముందు అక్కడ ఉన్నట్టు గుర్తులేదు. నేను రూటు మారానా? నన్నెవరన్నా ఏమారుస్తున్నారా అనుకున్నా. నా నడక ఆపాలని నేను అనుకోలేదు. ఇంకా నా వెనక ఎవరో వస్తున్నట్టే ఉంది.
చచ్చింది గొర్రె అని వీపుమీద చరుచుకున్నాను.

చెత్తకుప్ప పక్కన ఏదో చచ్చినట్టుంది.
విపరీతమైన కంపు. ముక్కు మూసుకుని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ చెరుకు చేను దాటాను. హమ్మయ్య అనుకున్నాను. హమ్మయ్య అన్నారు నా వెనకెవరో. ఆశరీరులెవరో నన్ను అనుసరిస్తున్నారనిపించింది . దెయ్యమో దైవమో తెలీదు. ఈ రోజు నా చావు మూడినట్టుందని
ఎందుకైనా మంచిదని శ్రీ అంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ నడిచాను. గతుకుల్లో పడ్డ గ్రాంఫోన్ రికార్డర్ లా నా గొంతు నాకే కీచుగా వినిపించింది.

వెనకాల ఎవరో రొప్పటం వినబడింది. రొప్పుకుంటూ దగ్గరగా వస్తున్నట్టనిపించింది.
నా భయం పటాపంచలయ్యింది. భయాన్ని చేత్తో తీసి ఉఫ్ అని గాల్లో ఎగరేసినట్టనిపించింది. దయ్యాలు రొప్పవు. ఆయాసపడవు. అవును. ఎందుకంటే వాటికి ఊపిరితుత్తులు వుండవు , ముక్కులు కూడా వుండవు కాబట్టి. ఉండవా? ఏమో..ఉండవని నా నమ్మకం. ఇప్పుడు నిర్భయంగా వెనక్కి తిరిగి చూడచ్చు. చూశాను. ఒక ఆడ ఆకారం నాకు కాస్త దూరంలో ఉంది. తెల్లచీర కట్టుకుంది. మల్లెపూలు పెట్టుకుంది.
పూల వాసన గుప్పుమంది.

మళ్లీ నాలో భయం మొదలయ్యింది. ఈ పల్లెటూర్లో ఏడుగంటల అర్ధరాత్రి వేళ ఒక ఆడపిల్ల తెల్లచీర మల్లెపూలు పెట్టుకుని ఒంటరిగా రావడం అంటే మామూలు విషయం కాదు.

నాకు మామూలిగా మూడలేదు. ఇదంతా నా చావుకే వచ్చినట్టుంది అని అనుకున్నాను. ఆ ఆకారం నాకు దగ్గరగా వచ్చింది. నాకు శ్రీరామరక్షగా ఆమె చేతిలో ఒక సంచి కనబడింది.హమ్మయ్య.

దయ్యాలు సంచులు క్యారీ చెయ్యవు. కానీ ఈ మధ్య అవీ తెలివిమీరాయేమో? మెడలు కొరికి తలకాయల్ని సంచుల్లో వేసుకుని తీసుకుపోతాయేమో. ఫ్రెండ్స్ తో కలిసి రక్తకోలా పార్టీ చేసుకుంటాయేమో.

అబ్బ చీ. నా మనసుకి ఒక్క పాజిటివ్ ఆలోచనకూడా రాదెందుకని అని నన్ను నేనే విసుక్కున్నాను. ఆ ఆకారం బాగా దగ్గరకొచ్చింది.ఆ ఆకారాన్ని
ఎక్కడో చూసినట్టుంది.అవును. అది ..అదే ఇందూనే..ఇందుమతి
హమ్మ చంపేసింది. ఇదా..నా చిన్నప్పటి ఫ్రెండు.
మా పక్కవిధే. పోయిన ప్రాణం గూట్లోకొచ్చి పడింది.

“ఏరా వాసూ! అంత గబగబా నడుస్తున్నావే?! నువ్వా కాదా అనుకుంటూనే వస్తున్నా. నిన్ను అందుకుందామని సందు మొదలునుంచి ప్రయత్నిస్తున్నా. ఆయాసమొచ్చింది బాబూ!” అంది ఇందు.

ఇంకా నయం నువ్వు దయ్యానివేమో అని భయపడిచచ్చి పరుగెడుతున్నా అని చెబితే నాలిక భుజానేసుకుని ఊరంతా ప్రచారంచేస్తుందని భయపడి ఓ వెర్రినవ్వు నవ్వాను.

“ఇందూ! నువ్వేoటి? ఈ టైం లో ఇలా వస్తున్నావ్?” అన్నాను మాటల్ని పేర్చుకుంటూ.

“పుట్టింటికి రావడానికి ఒక టైం అనేమన్నా ఉంటుందా? లాస్ట్ బస్సుకి వస్తున్నాను. నువ్వెక్కడినుంచి?” అంది నాతో కలిసి నడుస్తూ.
“నాకు బెంగుళూరుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. మా ఆవిడని మా అమ్మా నాన్న దగ్గర దింపాను . పిన్నీ బాబాయిల్ని చూసి ఎకాయకిన బెంగుళూరు వెళ్లిపోతాను. మరి నువ్వెక్కడినుంచి? మీ అత్తారింటి విశేషాలేంటి” అడిగాను అప్పటికి కాస్త నిబ్బరం చిక్కింది .

“నువ్వు బస్సు దిగటం చూసాను. నువ్వా కాదా అని పోల్చుకోలేకపోయా. నేను సందుమొదట్లో మల్లెపూలు కొనుక్కుని తిరిగి చూసేసరికి నువ్వు పరిగెత్తావు.

అత్తవారింటినుంచే వస్తున్నానులే. ఆయన నన్ను వాళ్ళ అమ్మా నాన్న దగ్గర పడేసి ఉద్యోగం అని ఊళ్ళన్నీ తిరుగుతున్నారు. నేను వీళ్ళతో వేగలేక చేస్తున్నాను.” అంది  తలకొట్టుకుంటూ.

ఇందూ చెప్పిన విధానానికి నాకు నవ్వొచ్చింది.

“ఏమంటారేంటి వాళ్ళు? “అన్నాను నింపాదిగా నడుస్తూ.

“అత్తమామలు ఇద్దరికీ క్షణం పడదు. రాత్రిపూట ఆయన గారు ఎఫ్ టీవీనో వల్లకాడు టీవీనో చూస్తారు. ఈవిడ తెల్లవారి కర్రపుల్లతో టీవీ పెడుతుంది.
అప్పడాలు కర్రతో రిమోట్ నొక్కి భక్తి ఛానల్ ఆన్ చేస్తుంది. కాసేపు టీవీలో మంత్రాలు మోగాక అప్పుడు టివి రిమోట్ ని ముట్టుకుంటుంది.
రాత్రి మైలబడ్డ టివినీ భక్తి ఛానల్ తో సంప్రోక్షణ చేస్తుందట.”
నేను పగలబడి నవ్వుతుంటే ఇందూ ఇంకా చెబుతోంది.

“ఆయన తాటిచెట్టంత వాడ్ని అనగానే
‘సత్యం చెప్పారు. దానిలాగే మీ వలన కూడా ఏం ఉపయోగం లేదులేండి!” అంటుంది.

“నువ్వు తులసిమొక్కంత ఎత్తు లేవు ఎప్పుడూ తులసి మొక్క చుట్టూ తిరుగుతూ వుంటావేమే చాదస్తురాలా!” అంటారాయన.

“మళ్లీ సత్యం చెప్పారు. నేను తులసి మొక్కలాంటి దాన్నే. పుడుతూనే పూజ్యునీయురాల్ని” అంటుందావిడ.
ఈమధ్య మిథునం సినిమా చూసారేమో మరీ రెచ్చిపోతున్నారు.

మహామహావాళ్లే కొట్టుకోగాలేనిది, మనమెంత అని మోతాదు పెంచి మరీ తిట్టుకుంటున్నారు.
మా ఆయన ఎప్పుడొస్తారో. నన్నెప్పుడు తీసుకెళతారో. నాకు పిచ్చిపడుతోంది” అంది ఇందూ. ఈ సారి నాకు నవ్వు రాలేదు
ఆలోచనలో పడ్డాడు.
వయసులో ఉన్న భార్యకి ముద్దుముచ్చట్లు లేకపోగా వీళ్ళ గొడవల్లోకి నెట్టటం ఎంతవరకూ న్యాయం?! వృద్ధ దంపతుల సరసాలు అలాగే ఉంటాయి.
నోటితో తిట్టుకుంటూ కళ్ళతో వెక్కిరించుకుంటూ పంచ్ లు వేసుకుంటూ ఒకరితో ఒకరు పట్టపగలే చేసే వింత రొమాన్స్ కి పట్టపగ్గాలుండవు.
వాళ్ళని అర్ధం చేసుకోకపోతే మనకే తలనొప్పి. పోనీ అర్ధం చేసుకుంటే వాళ్ళ మధ్యన ఉండాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. నా భార్య కూడా మా అమ్మా నాన్నలతో ఇలాగే ఇబ్బంది పడుతుందేమో.

బెంగుళూర్ వెళ్ళగానే ఇల్లు చూసుకుని నా భార్యని తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాను.

“ఇందూ ముందు మీ సందు వచ్చింది. మీ ఇంటిదాకా వచ్చి దింపమంటావా?” అన్నాను.

“వద్దులే వాసూ ! నేనెళ్లిపోతాలే . ఏడున్నరైందిగా. మీ పిన్నీ బాబాయ్ గాఢ నిద్రలో ఉండుంటారు. నువ్వెళ్లు” అంది.
ఇందూ మాటల్ని మళ్లీ మళ్లీ తలుచుకుని లోలోపల నవ్వుకుంటూ ఇంటిదారి పట్టాను.

భయం మహా చెడ్డది సుమా! ఇందాక ఒంటరిగా వస్తూ ఎంతభయపడిపోయాను! టెన్షన్ కి తల్లోని దారాల్లాంటి సన్నటి నరాలు ‘పుటుక్కున’ చిట్లి పోతాయట. అమ్మో! ఇంకెప్పుడూ అలా భయపడకూడదు అనుకుంటూ పిన్నీ వాళ్ళింటికి వెళ్ళాను.

పిన్ని లేచి లైట్లేసి మంచినీళ్లిచ్చి కుశల ప్రశ్నలు వేసింది.

“ఈ తిరుపతి లడ్డూ తినరా వాసూ! కాసిని మజ్జిగ చేసి తెస్తాను. రేపు పెందరాడే వండి పెడతానులే” అంది.

ఆ టైం లో వంట చేయడం ఆవిడకి కష్టం అనుకుంటా. సరే అని లడ్డూ తింటుంటే ఇందూ గుర్తొచ్చింది.

“పిన్నీ ! మన పక్కవీధి ఇందూ నేనొచ్చే దారిలో కనిపించింది. పుట్టింటికి వచ్చినట్టుంది” అన్నాను.

“ఇందూ రావటం ఏంటి నీ మొహం. అది ఆ మధ్యనే పోయిందిగా.నువ్వు చూసింది దాని చెల్లెలు బిందుని అయ్యుంటుంది” అన్నాడు ఒక నిద్ర తీసి లేచిన బాబాయి బిగ్గరగా ఆవలిస్తూ.

తింటున్న లడ్డూ నాగొంతుకు అడ్డంపడి పొలమారింది.
“జాగ్రత్తరా ..!” అంది పిన్ని.

లడ్డూ ఏంటి. ఆ మాట విన్నాక ఏదైనా గొంతుకు అడ్డంపడి పొలమారాల్సిందే.

“నిజమా పిన్నీ?” అన్నాను నమ్మలేనట్టుగా .

“మీ బాబాయి చెబుతున్నారుగా! దాని మొగుడు దూరదేశాలకు పోయాడట. అత్తవారింట్లో ఇమడలేక చెర్లో దూకిందని విన్నాను. దానికోచెల్లెలు ఉన్నట్టు గుర్తు. చెల్లెలంటే సొంత చెల్లెలు కాదనుకో. పిన్నో, పెద్దమ్మ కూతురో. కానీ అది కూడా ఆ మధ్య అమెరికాలోనో, అక్లాండులోనో ఉందన్నారు. ఇండియా ఎప్పుడొచ్చిందో మరి ” అంది పిన్ని పడుకోడానికి సమాయత్తమవుతూ ముందుగా లైటు ఆర్పేసింది.

నా గుండె గుభేలుమంది.

నాతో వచ్చింది ఇందూ కాదా?! చీకట్లో నేనే పొరబడ్డానా?
అసలు ఇందూకి చెల్లెలు ఉన్నట్టా లేనట్టా?
అది ఇండియా వచ్చినట్టా ?రానట్టా?
అది ఇందూనా? బిందూనా ?…
నాతల్లో సన్నటి నరాలు ‘పుటుక్’ మంటున్నట్టనిపించి గబుక్కున దుప్పటి కప్పుకుని పడుకున్నాను.
ఆ చీకట్లో నేను కళ్ళు తెరిచినట్టా మూసినట్టా? నా సందేహం తీరలేదు.

అది బిందైనా ఇందయినా అది చెప్పింది ఒకటి నిజం. భర్త వెంటే భార్య. డబ్బువేటలో పడి తనని అమ్మా నాన్న దగ్గర వదలడం అంత మంచి ఆలోచన కాదు. ఏది ఏమైనాగానీ నా భార్యని నాతోపాటు బెంగళూరుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుని పడుకున్నాను.

……..శుభం……

You May Also Like

14 thoughts on “నిర్ణయం(సంక్రాంతి కథల పోటీ)

  1. కథలు మానసిక వికాసానికి మందు లాంటివి. మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. కొన్ని మన మనసును…ఆలోచనలను వేగంగా పరిగెత్తిస్తూ…చదివే పాఠకుడినీ రచయితను గా మలుస్తాయి. పాఠకుడు ఆ కథ ముగింపుకు తానే బ్రహ్మ అయి… తన మనసుకు తగ్గ నిర్ణయం ఇచ్చి తృప్తి పడతాడు. కథల ఇతి వృత్తాలు మానసిక చిత్తాలు అనేకం. అనేక పరిష్కారాలు. ఇదే జీవిత వేదం. జీవిత సారం కూడాను.
    శ్రీమతి గొర్తి వాణీ శ్రీనివాస్ గారి కలం బాణీ లో ప్రతి కథలో నవ్యత కనబడుతుంది. రచయిత్రికి కావలసింది అదే. వారి కథల గుత్తి కి అదే ఒక శోభ. కథా శీర్షిక…కథకు ఆత్మ. కథ పాఠకుడి ని ఆగకుండా చదివిస్తుంది. పాఠకుడి శ్వాస వేగం హెచ్చుతుంది. పాత్రలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. తరువాత పాఠకుడు పాత్రల భుజాల పైన చేయి వేసి కడులుతాడు… అలా పాత్రల తో మమేక మవుతాడు. ఒక్కోసారి ఆగి ఆలోచిస్తాడు. ఆ పాత్ర…పడే అవస్థలు తనూ పడతాడు. ఇదే కథ కథకు కావలసింది. ఈ కథ ఆద్యంతం రకరకాల భావనలతో సాగుతూ…పాఠకుడి మేథకు మేతలా… నిర్ణ యాన్ని…పాఠకుడికి మనసుతో పట్టం కడుతుంది. చక్కని కథ అందించిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి గొర్తి వాణీ శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక అభినందనలు. మీ కలం మరెన్నో చక్కని కథా కవనాలను పోయించ గలదు. Good luck.

    1. రచయిత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్. శ్రీదేవి శ్రీకాంత్ గారి విశ్లేషణలు, సమీక్షలు కథకుల్ని ఆలోచింపచేస్తాయి. తమ బాధ్యత మరింత పెరిగిందనేలా మంచి రచనలు చేసేలా ఆలోచనలను పురిగొల్పుతాయి. రచయిత ఎదుగుదలకు కావాల్సిన ముడిసరుకు ఆవిడ ప్రస్తావించే ప్రతి వాక్యంలోనూ కనబడుతుంది మనకి. ఒక మేధావి సమీక్ష ఒక పుస్తక పఠనం లాంటిది. వివిధ కోణాలను పరిశీలించి ఇచ్చే సూచనలు మరో కొత్త కథకు శ్రీకారం చుట్టేలా చేస్తాయి. విజ్ఞానగని ,విద్యల మణి శ్రీమతి శ్రీదేవి శ్రీకాంత్ గారి మనసు, కలము, గళము అన్నీ అమృతమయమే…ధన్యవాదాలుతో వాణిశ్రీనివాస్🙏👏👏🌹

  2. గొర్తి వాణీ శ్రీనివాస్ గారి “నిర్ణయం ” కథ చదువుతున్నంతసేపూ ఒక హార్రర్ సినిమా చూస్తూన్న భావన కలిగించింది..కథ చెప్పే వ్యక్తితో మనం బస్ దిగి పిన్ని వాళ్ళింటికి వెళ్ళేదాకా పాఠకుడిని భయపెడుతూ ధైర్యం చెబుతూ కథ నడిపించారు…రచయిత్రి దయ్యలున్నాయనిగానీ, లేవు అనిగానీ చెప్పకుండా తెలివిగా పాఠకుడి నిర్ణయం కి వదిలేసారు…ఉత్కంఠభరితంగా కథ నడిపి చక్కని ముగింపు ఇచ్చారు…మంచి కథ అందించిన వాణీ శ్రీనివాస్ గారికి అభినందనలు.

    1. శ్రీ విరించి గారి సహృదయ స్పందనకు అనేకానేక ధన్యవాద వందనాలు🙏🙏🙏

  3. వాణీగారికథ చక్కగా ఉంది అభినందనలు ఆద్యంతం చక్కగా వ్రాసారు

  4. కథ చదివి స్పందించిన అందరికీ ధన్యవాదాలు🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!